నవతెలంగాణ – హైదరాబాద్: మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
కుండపోత వర్షాల కారణంగా పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు తెగిపోవడం, వంతెనలపై నుంచి నీరు పోవడం, రోడ్లపై నీరు నిలవడం వంటి కారణాలతో పలు రహదారులు తాత్కాలికంగా మూతబడ్డాయి. భారీ వర్షాలకు వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆ రహదారిని పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. వరంగల్ నగరంలో పలు కాలనీలు నీట మునిగాయి. వరంగల్ బస్టాండ్ చెరువును తలపిస్తోంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం – మహబూబాబాద్ జిల్లాల మధ్య వాల్యాతండా సమీపంలోని వంతెనకు ఆనుకుని ఆకేరు వాగు ప్రవహిస్తోంది. దీంతో ఈ రోజు సాయంత్రం నుంచి రెండు జిల్లాల మధ్య రాకపోకలను నిలిపివేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం వీరిశెట్టిపల్లి గ్రామ సమీపంలోని కాగ్నా నదిలో ఒక వ్యక్తి కొట్టుకు వచ్చాడు. యాలాల మండలం ఆగనూరు గ్రామానికి చెందిన నర్సింహులు ప్రమాదవశాత్తూ నదీ ప్రవాహంలో చిక్కుకున్నాడు. అతడు నదిలో కొట్టుకురావడాన్ని గమనించిన వీరిశెట్టిపల్లి యువకులు హరీశ్, శ్రవణ్ కుమార్, శంకర్ అతనిని రక్షించారు. శ్రవణ్, హరీశ్ ఈదుకుంటూ వెళ్లి నర్సింహులు కాపాడి ముందుకు తీసుకురాగా, అనంతరం శంకర్ తాడు విసరడంతో దాని సాయంతో అందరూ ఒడ్డుకు చేరుకున్నారు.



