Sunday, July 13, 2025
E-PAPER
Homeనెమలీకతాబేలు తెలివి

తాబేలు తెలివి

- Advertisement -

ఎన్నో ఏళ్ళుగా ఆ అడవిలో సింహానికి సలహాదారుగా ఉంది నక్క. అది జిత్తులమారి అని సింహానికి తెలుసు. కానీ.. ఇటీవల సింహం రెండు మూడు అడవులకు పర్యటనకు వెళ్ళింది. నక్కను తన కూడా తీసుకు వెళ్లలేదు. ఆ అడవుల్లో జీవించే ప్రాణుల సఖ్యత, కలివిడితనం, స్నేహం అన్నీ గమనించింది. అలా మా అడవి ఎందుకు లేదని ఆలోచన వచ్చి తన దగ్గరకు వచ్చిన కొంతమందితో ఈ విషయం ముచ్చటించింది. ఆ ముచ్చట్లలో దానికి ఎన్నో విషయాలు తెలిశాయి. నక్క తన పేరు చెప్పి ఎందర్నో మోసం చేస్తుందని సింహానికి అర్ధమైంది..
దాంతో సింహం.. ఎక్కువ కాలం ఎవరినీ ఒకే పదవిలో ఉండనివ్వకూడదు. అలా ఉండనిస్తే నక్కలా తయారవుతారు. సలహాదారుని బట్టే రాజుకు తన ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి. కాబట్టి దీనిని సలహాదారు పదవి నుండి తొలగించాలి. ఆ స్ధానంలో కొత్తవారిని ఎవరినైనా నియమించాలనుకుంది మనసులో.
అలా అనుకున్నప్పటి నుండీ అది అడవిలోని గాల్లో ఎగిరే, నేలపై, నీళ్లల్లో, చెట్లపైన బ్రతికే జీవులను అన్నింటిని తీరికగా పరిశీలించసాగింది.
అలా గమనించగా అందర్లో తాబేలు తెలివి తేటలు దానికి ఎంతో నచ్చాయి. దాన్నే తన సలహాదారుగా నియమించుకోవాలని అనుకుంది.
నీళ్లు తాగటానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఒడ్డున ఎండలో సేదదీరుతున్న తాబేలుని చూసి పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంది. తర్వాత.. ”నేను నిన్నొక విషయం అడగాలనుకుంటున్నాను” అంది సింహం.
ఆ మాటలకు ఆశ్చర్య పోయింది తాబేలు. అయినా అదేమీ పైకి కనపడకుండా.. ”అడగండి మహారాజా..!” అంది.
”ఈ మధ్య నీ తెలివితేటలను బాగా గమనించాను. నువ్వు చాలా ఓర్పు కలదానివి. మేధావివి. పైగా అప్పట్లో నీకంటే వేగంగా పరిగెత్తగల కుందేలును ఓడించావు. అది చిన్న విషయం కాదు. కాబట్టి నిన్ను నా సలహాదారుగా నియమించుకోవాలనుకుంటున్నాను” అంది సింహం తాబేలుతో.
అది విన్న తాబేలుకు చాలా అశ్చర్యం, భయం కలిగాయి.
ఇదెలా సాధ్యమవుతుందని కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది.
”ఏమిటి? ఏమీ మాట్లాడవు? అంత పెద్ద పదవికి నిన్ను ఎంపిక చేస్తే నీకు ఆనందంగా లేదా?” అని అడిగింది సింహం.
”చాలా ఆనందంగా ఉంది సింహరాజా! కానీ సాధ్యం కాదేమో అని అనిపిస్తుంది” అంది తాబేలు.
”ఎందుకు సాధ్యం కాదు?” అని అడిగింది సింహం.
”సింహరాజా! నేను చాలా చిన్న ప్రాణిని. పైగా చాలా నెమ్మదిగా నడుస్తాను. కుందేలు, నేనూ పోటీ పడ్డప్పుడు నేను గెలిచాను. నిజమే. అది ఎలా సాధ్యం అయింది అంటే, తాబేలు చాలా నెమ్మదిగా నడుస్తుంది. ఇప్పట్లో ఇక్కడికి రాలేదని కుందేలు భావించి చెట్టుకింద నిద్రపోయింది. కాబట్టి నేను గెలిచాను. అది నిద్రపోకుండా ఉండి ఉంటే అదే గెలిచేది. నేను ఓడిపోయేదాన్ని. అందులో నా తెలివితేటలు ఏమీ లేవు. కుందేలు అపోహ తప్ప.
ఇప్పుడైనా అంతే. మీరు చాలా వేగం. బలశాలి. నేను బలహీనురాలను. చాల నెమ్మది. ఆ పదవికి నేను ఎంతమాత్రం సరిపోను.”
”సరిపోతావు. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను ” అంది సింహం.
”లేదు మహరాజా. ఎంతమాత్రమూ సరిపోను”
”అదే.. ఎందుకని అడుగుతున్నాను” అంది సింహం.
అప్పుడు తాబేలు.. ”సింహారాజా..! మీకు తెలియనిదా? నేను మీ సలహాదారుగా ఉంటే ఎప్పుడూ మీ కూడానే అందుబాట్లో ఉండాలి. పైగా మీ ఆహారం నా ఆహారం వేరు వేరు. నాకు ఆకలి వేసినప్పుడల్లా ఆహారం కోసం నది దగ్గరకు వెళ్తుండాలి. నెమ్మదిగా నడిచే నాకు వెళ్ళి రావటమే సరిపోతుంది. తిని మీ దగ్గరకు వచ్చేసరికే మళ్ళీ నాకు ఆకలి మొదలు అవుతుంది. మళ్ళీ వెళ్ళాలి. వెళ్ళలేను. సమయమంతా నడకే. ఇక మీకు సలహాలు ఎలా ఇవ్వగలను మహారాజా?” అంది తాబేలు.
”నేను మహారాజును అన్న సంగతి నువ్వు మర్చిపోతున్నట్టు ఉన్నావు. నువ్వు ఏమి తింటావో చెప్పు. అవన్నీ నేను ఏర్పాటు చేస్తాను” అంది సింహం.
అది విన్న తాబేలు గతుక్కుమంది. అమ్మో! నన్ను వదిలేట్టు లేడు ఈ సింహరాజు. నా ప్రాణం నీటిలో హాయిగా ఉంది. ఎలాగైనా సింహాన్ని ఒప్పించి ఈ ప్రమాదం నుండి బయటపడాలి. లేదంటే నా స్వేచ్ఛను కోల్పోతానని మనసులో అనుకుని సింహాన్ని చూసి చిన్నగా నవ్వి.. ”మహారాజా! నా మీద మీకున్న గౌరవానికి, నమ్మకానికి ధన్యవాదాలు. కానీ అది జరిగే పని కాదు మహారాజా. కానీ నాది ఒక చిన్న సలహా మహారాజా.”
”చెప్పు, అందుకేగా నిన్ను ఎంచుకున్నది” అన్నది సింహం తీరికగా కింద కూర్చుంటూ.
”మహారాజా..! మీరు, నేనూ ఇద్దరమూ మాంసాహారులమే. నా శరీరం చిన్నది కాబట్టి నేను తినేది చాల తక్కువ. చిన్న చిన్న పురుగులతో నా పొట్ట నిండిపోతుంది. పాలించేవారు మీరు. మీకు చాలా శక్తి అవసరం కాబట్టి, నాతో పోలిస్తే మీ శరీరం కూడా చాలాపెద్దది కాబట్టి మీకు ఎక్కువ ఆహారం కావాలి. అందుకని మీరు పెద్ద పెద్ద జంతువులను వేటాడతారు. కానీ మీరైనా అంతా తినలేరు కదా. కొంచెమే తినగలుగుతారు. అలా తినగా మిగిలిన ఆహారం అక్కడే వదిలేస్తే అది కుళ్ళిపోయి, పురుగులు పట్టి ఆ ప్రాంతం అంతా విషవాయువులతో నిండిపోయే అవకాశం ఉంటుంది. అది మన అడవిలోని జంతువులకు మంచిది కాదు.
అది మిగలకుండా ఉండాలంటే కొంచెమే తినే నా వల్ల అవ్వదు. ఆ మిగిలిన ఆహారాన్ని బాగా తినగల జంతువులే కావాలి. అందుకు నక్క వంటి జంతువు అయితేనే సరిగ్గా సరిపోతుంది. నక్క అయితే కడుపు నిండిపోయినా మిగిలిన దాన్ని దాచుకుని దాచుకుని మరీ తింటుంది. అలా ఆ ప్రాంతం శుభ్రం అయిపోతుంది. సలహాదారుణ్ణి నియమించుకునే ముందు అన్ని విధాలుగా ఆలోచించుకోవాలి. మీరే ఆలోచించండి” అంది.
”అవును. నువ్వు అన్నది నిజమే. కానీ నక్క నాకు తెలియకుండా నా వెనుక చాలా రాజకీయాలు చేస్తుందట. చాల మంది చెప్పారు. వింటుంటే చాల ఆశ్చర్యం, కోపం కలిగాయి. అలాంటప్పుడు మళ్ళీ నక్కే ఎందుకు?”
”అది సహజం మహారాజా! ఎవ్వరికైనా అధికారం ఉంటే అంతే. కాకపోతే మీరు ఒక పని చెయ్యవచ్చు”
”ఏమిటి అది?”
”మీ సలహాదారుగా నక్కకు అనుభవం ఎక్కువ. కాబట్టి సలహాదారుగా దానినే ఉండనివ్వండి. కానీ అడవిని అయిదు భాగాలుగా విభజించి ఒక్కో భాగానికి ముగ్గురు ముగ్గురు చొప్పున ఉప సలహాదారులను నియమించండి. నక్క సలహాలను ప్రాంతాలను బట్టి ఉప సలహాదారుల ముందు ఉంచి వారి అభిప్రాయం తెలుసుకోండి. దాని మీద ఒక కన్ను వేసి ఉంచినట్టు మనం చెప్పకనే చెప్పినట్టు ఉంటుంది. అలా కొన్ని నక్క చేసే అక్రమాలను తగ్గించవచ్చు. దాంతో నక్క మారవచ్చు.”
ఈ సలహా సింహానికి చాలా నచ్చింది. తాబేలు దగ్గరకు వచ్చి, మెచ్చుకుంటున్నట్టు దాని మీపు మీద మెల్లగా చరిచి.. ”భేష్‌. మంచి సలహా ఇచ్చావు” అంది సింహం.
”మీ మాట వినలేదని నాపై కోపం వద్దు మహారాజా. నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను. మీకు ఏదైనా సలహా అవసరమైతే నీళ్ళు తాగటానికి వచ్చినప్పుడు చెప్పండి. కలసి ఆలోచిద్దాం”
”అలాగే” అంటూ అక్కడ్నించి వెళ్ళిపోయింది సింహం.
”బతుకు జీవుడా” అనుకుంటూ తాబేలు నీళ్లల్లోకి జారిపోయింది.

– కన్నెగంటి అనసూయ,
9246541249

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -