Saturday, March 21, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమహా పద్దు రూ.3,24,234 కోట్లు

మహా పద్దు రూ.3,24,234 కోట్లు

- Advertisement -

రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లు
మూలధన వ్యయం రూ.47,267 కోట్లు
శాసనసభలో బడ్జెట్‌ ప్రతిపాదించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మండలిలో పద్దును ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్‌
జూన్‌2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం
‘చేయూత’తో 2 లక్షల మందికి కొత్త పింఛన్లు
ప్రీప్రైమరీ నుంచి ఇంటర్‌ వరకు బ్రేక్‌ఫాస్ట్‌ పథకం
ఇంటర్‌ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం
‘ఉస్మానియా’కు రూ.1000 కోట్లు, ఐలమ్మ వర్సిటీకి రూ.400 కోట్లు
గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్లు
ఉభయసభలు సోమవారానికి వాయిదా

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ రాష్ట్ర బడ్జెట్‌ రూ.3,24,234 కోట్లుగా డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లుగా, మూలధన వ్యయం రూ.47,267 కోట్లుగా చూపెట్టారు. రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున జీవిత బీమా అందించేలా ఈ ఏడాది జూన్‌ 2వ తేదీన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. చేయూత పథకం ద్వారా అర్హులైన 2 లక్షల మందికి నూతన పింఛన్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదివే పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌ పథకంలో భాగంగా పోషకాలతో కూడిన రాగిజావ, పాలు అందిస్తామని చెప్పారు.

ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నట్టు ప్రకటించారు. ఇంటర్‌ చదివే వికలాంగ విద్యార్థులకు రెట్రో ఫిట్టెడ్‌ మోటరైజ్డ్‌ వాహనాలను పంపిణీ చేస్తామన్నారు. పాఠశాలల్లో వంటశాలలను ఆధునీకరించేందుకు రూ.100 కోట్లు కేటాయించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.1000 కోట్లు, వీరనారి చిట్యాల ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి రూ.400 కోట్లు, మిగతా యూనివర్సిటీలకు కూడా బడ్జెట్‌లో కొంతమేర కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. గోదావరి పుష్కరాల కోసం రూ.500 కోట్లు కేటాయించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని శానసనభలో మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మండలిలో పౌరసంబంధాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రతిపాదించారు.

అనంతరం ఉభయ సభలు సోమవారం ఉదయం 10 గంటలకు వాయిదా పడ్డాయి. శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి బడ్జెట్‌పై ప్రసంగిస్తూ… డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడుస్తున్నామనీ, ప్రతి పౌరునికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే తమ లక్ష్యమని నొక్కి చెప్పారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిపోయిందనీ, ఇప్పుడు తమ ప్రజా ప్రభుత్వం పాత అప్పులను, వాటి వడ్డీలను కట్టుకుంటూనే ఆర్థిక క్రమశిక్షణతో పాలనను గాడిన పెడుతున్న తీరును వివరించారు. తెలంగాణను దేశంలోనే నెంబర్‌వన్‌ స్థానంలో నిలబెట్టడమే తమ లక్ష్యమనీ, సుస్థిరమైన అభివృద్ధి వైపునకు నడిపించేలా బడ్జెట్‌ రూపొందించామని తెలిపారు.

తెలంగాణ వృద్ధిరేటు 10.7 శాతం
2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం రూ.17, 82,198 కోట్లు అనీ, వృద్ధిరేటు 10.7 శాతంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇదే సమయంలో దేశ జీడీపీ రూ.3,57,13,886 కోట్లుగా ఉండగా వృద్ధిరేటు 8 శాతంగానే ఉందని చెప్పారు. దేశ జీడీపీలో రాష్ట్ర జీఎస్‌డీపీ 5 శాతం వాటా కలిగి దేశానికి బలమైన అభివృద్ధి యంత్రంలా ఉందన్నారు. 2024-25లో దేశ జీడీపీ వృద్ధిరేటు 9.8 శాతం ఉండగా 2025-26 నాటికి 8 శాతానికి పడిపోయిందనీ, అదే సందర్భంలో 2024-25లో తెలంగాణ రాష్ట్ర జీడీపీ వృద్ధి రేటు 10.6 శాతం ఉండగా ఈ ఏడాది 10.7 శాతానికి పెరిగిందని వివరించారు. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం రూ.4,18,931గా ఉందనీ, దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే 1.9 రెట్లు ఎక్కువ అని వివరించారు. 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు.

సీఎస్‌ఎస్‌ నిధులపై దృష్టి
గత ప్రభుత్వం 2014 నుంచి 2023వరకు కేంద్ర ప్రాయోజిత పథకాల(సీఎస్‌ఎస్‌) నిధులను రాబట్టడంలో విఫలమైందని డిప్యూటీ సీఎం భట్టి విమర్శించారు. తమ ప్రభుత్వం 2014-15 నుంచి 2023-24 వరకు సీఎస్‌ఎస్‌ కింద బకాయిపడ్డ రూ.3 వేల కోట్లను విడుదల చేసిందని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ.7,072 కోట్లను రాబట్టామని చెప్పారు. మరింత చిత్తశుద్ధితో అధిక నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని హామీనిచ్చారు.

రుణ పునర్వ్యవస్థీకరణతో నగదు వెసులుబాటు
గత ప్రభుత్వం అధిక వడ్డీకి తెచ్చిన రూ.25,612 కోట్ల రుణాలను తక్కువ వడ్డీకి పునర్వ్యవస్థీకరించామనీ, రుణ చెల్లింపుల వ్యవధిని పెంచి అసలు చెల్లించాల్సిన కాలాన్ని 20 ఏండ్ల నుంచి 39 ఏండ్లకు పొడిగించడంలో సక్సెస్‌ అయ్యామని భట్టి తెలిపారు. ఈ రుణ పునర్‌వ్యవస్థీకరణ ద్వారా 2025-26 నుంచి 2031-32 దాకా చెల్లించాల్సిన రూ.34,058 కోట్ల భారం కాస్తా రూ.11,915 కోట్లకు తగ్గిందని తెలిపారు. దాని ద్వారా రాష్ట్రానికి రూ.22, 142 కోట్ల క్యాష్‌ అవుట్‌ ఫ్లో తగ్గి నగదు వెసులుబాటు కలిగిందని చెప్పారు. ఈ ఏడాది రూ.27,988 కోట్ల అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీకి మార్చుకున్నామని తెలిపారు.

రూపాయి పంపితే కేంద్రం ఇచ్చేది 42 పైసలే
కేంద్రానికి తెలంగాణ నుంచి రూపాయి పంపితే తిరిగి 42 పైసలే మనకు దక్కుతున్నదని భట్టి వివరించారు. జనాభా నియంత్రణ పాటిస్తూ, సొంత రాబడి పెంచుకుంటూ, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న రాష్ట్రాలకు ఈ పంపకం ద్వారా తీవ్ర అన్యాయం జరుగుతున్నదని 16వ ఆర్థిక సంఘం ముందు ఎత్తిచూపామన్నారు. రాష్ట్ర జీఎస్‌డీపీని కూడా కొలమానంగా తీసుకునేలా ఒప్పించామనీ, తెలంగాణ వాటాను 2.102 శాతం నుంచి 2.174 శాతానికి పెంచుకోవడంలో కొంతమేర సక్సెస్‌ అయ్యామని తెలిపారు.

గ్లోబల్‌ సమ్మిట్‌ ద్వారా తెలంగాణ రైజింగ్‌ విజన్‌ -2047
గ్లోబల్‌ సమ్మిట్‌ ఆధారంగానే తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047ని విడుదల చేశామని డిప్యూటీ సీఎం విక్రమార్క చెప్పారు. ఆ సమ్మిట్‌లో వందకుపైగా ఎంఓయూలు జరిగాయనీ, వాటి ద్వారా రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెష్టర్లు ఆసక్తి చూపారని వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి దావోస్‌ లో ‘నెక్స్ట్‌-జెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ 2026-2030’ ను ఆవిష్కరించారనీ, 2030 నాటికి పరిశోధనాభివృద్ధి, ఆధునిక తయారీ రంగాల్లో తెలంగాణను ప్రపంచంలోనే మొదటి ఐదు స్థానాల్లో నిలపాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. ఆ రంగంలో ఇప్పటిదాకా రూ.73,360 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామనీ, ప్రత్యక్షంగా లక్ష మందికి, పరోక్షంగా 2.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. రానున్నకాలంలో సింగపూర్‌కు చెందిన ఏజీఐడీసీ, వియత్నాంకు చెందిన విన్‌ గ్రూప్‌, జేసీకే ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థల నుంచి 1,03, 500 కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

క్యూర్‌..ప్యూర్‌..రేర్‌…
తెలంగాణను అభివృద్ధి చేసేందుకు రాష్ట్రాన్ని క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ ప్రాంతాలుగా విభజించామని భట్టి తెలిపారు. క్యూర్‌లో సేవారంగానికి, ప్యూర్‌లో ఉత్పాదక రంగానికి, రేర్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని భట్టి అన్నారు. 30 వేల ఎకరాల్లో భూగర్భవిద్యుత్‌, పర్యావరణ అనుకూల స్మార్ట్‌ గ్రిడ్లతో భారత్‌ ఫ్యూచర్‌ సిటీ ఏర్పాటు చేస్తున్నామనీ, దాన్ని ఏపీలోని మచిలీపట్నం పోర్టుతో అనుసంధానించేందుకు గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి నిర్మాణం జరుగుతున్నదని వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 67,763 ఉద్యోగాలను భర్తీ చేసి నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. భూ భారతి చట్టం ద్వారా 3.76 లక్షల మందికి కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేశామని ప్రకటించారు. జనగణనను డిజిటల్‌ విధానంలో చేయ బోతున్నామని తెలిపారు.

ఉచిత బస్సు ప్రయాణం ద్వారా తెలంగాణ ఆడబిడ్డలు రూ. 9,222 కోట్లు ఆదా చేసుకున్నారనీ, రూ.500కే గ్యాస్‌సిలిండ్‌ పథకం ద్వారా 43 లక్షల కుటుంబాలకు రూ.752 కోట్లు, ఉచిత కరెంటు ద్వారా పేదలకు రూ. 3,954 కోట్లు ఆదా అయ్యాయని వివరించారు. మహిళా శక్తి మిషన్‌ ద్వారా మహిళలకు ఐదేండ్లలో లక్ష కోట్ల రూపాయలు ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామనీ, ఇప్పటికే 57, 938 కోట్ల రూపాయల రుణం ఇప్పించామని తెలిపారు. 1,329 కోట్ల వడ్డీ రాయితీ విడుదల చేశామని చెప్పారు. ఇందిర సౌర గిరి జలవికాసం పథకం కింద ఎస్టీలకు 12,600 కోట్ల బడ్జెట్‌తో వంద శాతం సబ్సిడీ కింద సోలార్‌ పంపు సెట్లను అందిస్తామనీ, 6 లక్షల ఎకరాల పోడు భూములలో అటవీ ఉత్పత్తులకు సంబంధించిన తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. ఇప్పటికే అచ్చంపేటలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించామనీ, విధివిధానాలు రూపొందించి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు.

వ్యవసాయానికి రూ.23,179 కోట్లు
ప్రస్తుత బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.23,179 కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ.1,529 కోట్లు ప్రతిపాదిస్తున్నట్టు డిప్యూటీ సీఎం ప్రకటించారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.12 వేలు ఇస్తున్నామనీ, బోనస్‌ ద్వారా ఎకరా సాగు చేసే రైతుకు ఏటా రూ.25 వేల అదనపు ఆదాయం లభిస్తున్నదని వివరించారు. ఉద్యాన పంటల సాగును మరో 68 వేల ఎకరాలలో విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించామనీ, మైక్రో ఇరిగేషన్‌ పద్ధతులను 2.34 లక్షల ఎకరాల్లో అమలు చేయాలని నిర్ణయించామని ప్రకటించారు.

పౌరసరఫరాల శాఖకు రూ.7366 కోట్లు ప్రతిపాదించారు. విద్యుత్‌ను నిల్వచేసేందుకు యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 1500 ఎమ్‌డబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. విద్యుత్‌ శాఖకు రూ.21,285 కోట్లను ప్రతిపాదించారు. ఏటీసీల్లో 15 కొత్త కోర్సులను ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశపెడతామని చెప్పారు. అక్కడ శిక్షణ పొందేవారికి ప్రతినెలా రూ.2 వేల స్కాలర్‌షిఫ్పు ఇస్తామన్నారు. ఈ బడ్జెట్లో విద్యారంగానికి రూ.26,674 కోట్లను ప్రతిపాదించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు నగదు రహిత ఆరోగ్య భద్రత పథకం
రాష్ట్ర ప్రజల హెల్త్‌ప్రొఫైల్‌ రూపొందిస్తామనీ, వారికి డిజిటల్‌ హెల్త్‌కార్డులు ఇస్తామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. ప్రభుత్వాస్పత్రుల్లో థియేటర్‌ కేర్‌ పడకల సంఖ్య 44,029కి చేరుకుంటుందనీ, ప్రతి వెయ్యి మంది ప్రజలకు ఒక పడక ఉండాలన్న నిబంధనను అధిగమించబోతున్నామని చెప్పారు. ఈబడ్జెట్లో వైదారోగ్య శాఖకు రూ. 13,679కోట్లను ప్రతిపాదించారు. ఈ బడ్జెట్‌ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ, 421 ఎంప్యానెల్‌ ప్రయివేటు ఆస్పత్రుల్లో 1,998 వ్యాధులకు ఈ పథకం ద్వారా చికిత్స పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్ల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. కార్మిక సంక్షేమ శాఖకు రూ.998 కోట్లు కేటాయించారు. బడ్జెట్లో మహిళా, శిశుసంక్షేమానికి రూ.3,143కోట్లను ప్రతిపాదించారు.

గృహనిర్మాణ శాఖకు రూ.7,430 కోట్లు
హైదరాబాద్‌లోని లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ నిర్మిస్తున్నామనీ, కాచిగూడ నింబోలి అడ్డాలో బాబూ జగ్జీవన్‌రామ్‌ పేరుతో వసతి గృహాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. ప్రస్తుత బడ్జెట్లో ఎస్సీల సంక్షేమానికి రూ.11,784కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.7,937కోట్లు, బీసీల సంక్షేమానికి రూ.12,511 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.3,769 కోట్లుగా ప్రతిపాదించారు. రాజీవ్‌ యువ వికాసం పథకానికి రూ.6 వేల కోట్లను ప్రతిపాదిస్తున్నట్టు చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి రూ.22,500 కోట్లు అవసరం కాగా ఇప్పటి వరకు రూ.5,073 కోట్లు ఖర్చుచేశామనీ, వాటికోసమే గృహ నిర్మాణ శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.7,430 కోట్లు ప్రతిపాదించినట్టు తెలిపారు.

ఐటీరంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం చెప్పారు. టీ-ఫైబర్‌ ద్వారా సురక్షిత హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ను 50 వేల ప్రభుత్వ సంస్థలకు ఈ ఏడాది చివరికల్లా కల్పించాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో ఐటీకి రూ.875 కోట్లు ప్రతిపాదించారు. పరిశ్రమల శాఖకు రూ.3,490కోట్లు, చేనేత రంగానికి రూ.258 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు అత్యధికంగా రూ.33,688 కోట్లను ప్రతిపాదించారు. భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ ‘జాతీయ పూడికతీత మార్గదర్శకాల’ ప్రకారం.. పైలట్‌ ప్రాజెక్టు కింద కడెం, లోయర్‌ మానేరు, మిడ్‌ మానేరు డ్యామ్‌ ప్రాజెక్టులతో పాటుగా..

శ్రీరాంసాగర్‌, ప్రియదర్శిని జూరాల, మూసీ, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులలో కోల్పోయిన నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించడానికి పూడికతీత పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. ఇరిగేషన్‌ శాఖకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ.22,615 కోట్లను ప్రతిపాదించారు. నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ అభివృద్ధి చేసిన డిజిటల్‌ సేవలు ”సారథి”, ”వాహన్‌”లను తెలంగాణలో అమలు చేస్తున్నామనీ, ”వాహన్‌” సేవలను వచ్చే ఆరు నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ బడ్జెట్లో రోడ్డు, భవనాల శాఖకు రూ.12,789 కోట్లు ప్రతిపాదించారు. న్యాయ శాఖకు రూ.2,367 కోట్లు వెచ్చిస్తామని తెలిపారు.

జీహెచ్‌ఎంసీ అప్పులపై వడ్డీరేట్లను తగ్గించాం
జీహెచ్‌ఎంసీ అప్పులపై బ్యాంకులతో చర్చించి వడ్డీరేటు 9.15 శాతం నుంచి 7.95 శాతానికి తగ్గించామని డిప్యూటీ సీఎం చెప్పారు. హైదరాబాద్‌ నగర మౌలిక వసతుల అభివృద్ధి కోసం హెచ్‌సీఐటీఐ పథకం కింద రూ.2,654 కోట్లను ప్రతిపాదించారు. హైడ్రా సంస్థ ద్వారా ఇప్పటివరకు 1045 ఎకరాలను ఆక్రమణ దారుల నుంచి కాపాడామనీ, దాని విలువ రూ.60 వేల కోట్లు ఉంటుందని తెలిపారు. మెట్రోను విస్తరిస్తామన్నారు. మూసీ పునరుద్ధరణలో బఫర్‌ జోన్‌లోని ప్రజలకు ఇబ్బంది లేకుండా మానవీయ కోణంలో పునరావాసం కల్పిస్తామని చెప్పారు. హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం వివిధ సంస్థల ద్వారా సుమారు 43,592.88 కోట్ల పనులు మంజూరు అయ్యాయనీ, అందులో ఇప్పటికే రూ. 24,752 కోట్ల పనులు నడుస్తున్నాయని తెలిపారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.17,907కోట్లు ప్రతిపాదించారు. పర్యాటక రంగానికి రూ.1224 కోట్లు ప్రతిపాదించామని తెలిపారు.

హోంశాఖకు 11,907 కోట్లు
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా హోంశాఖకు రూ. 11,907 కోట్లను భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వం మాదిరిగా నక్సలిజాన్ని శాంతిభద్రతల సమస్యగా చూడలేదనీ, సమస్య మూలాలను విశ్లేషించి యువతకు సరైన జీవనోపాధి, సామాజిక గౌరవం, ఆర్థిక భరోసానిస్తే మావోయిస్టుల్లోకి వెళ్లేవారి సంఖ్య తగ్గుతుందని గుర్తించామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రెండేండ్లలోనే 732 మంది మావోయిస్టులు లొంగిపోయారని వివరించారు.

అసెంబ్లీలో సామాజిక ఆర్థిక సర్వే…
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రణాళిక శాఖ రూపొందించిన ‘తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే’ను శుక్రవారం శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టారు. వివిధ రంగాల్లో నెలకొన్న పరిణామాలు, సాధించిన అభివృద్ధి, అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను ఇందులో పొందుపరిచారు. దీంతోపాటు ‘తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047’ డాక్యుమెంట్‌లోని లక్ష్యాలను, ప్రణాళికలను వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -