– ఇందులో సిబ్బంది రికవరీ రూ. 45,000
– జరిమానా ఈజీఎస్ సిబ్బందికి జరిమానా రూ.60 వేలు
నవతెలంగాణ – బోనకల్
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లనే బోనకల్ మండల సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఉన్నతాధికారులు మొత్తం రూ. 1.05 లక్షలు రికవరీ, జరిమానా ఉపాధి హామీ పథకం సిబ్బందికి విధించారు. 17వ విడత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మండల సామాజిక తనిఖీ ప్రజా వేదిక మండల కేంద్రంలోని రైతు వేదిక నందు సోమవారం నిర్వహించారు. 1 జనవరి 2024 నుంచి 31 మార్చి 2025 వరకు మండలంలో జరిగిన ఉపాధి హామీ పథకం పనులపై మండల స్థాయిలో సామాజిక తనిఖీ ప్రజావేదికను నిర్వహించారు. ఉపాధి హామీ పథకం ద్వారా 501 పనులు చేశారు. ఇందులో ఐదు కోట్ల 18 లక్షల 35వేల 368 రూపాయల పనులు చేశారు.
మెటీరియల్ గా ఐదు కోట్ల 41, 63 లక్షల107 రూపాయలు పనులు చేశారు. పిఆర్ కింద 110 పనులు చేశారు. ఇందుకు గాను వేజ్ రూ. 31,120 రూపాయల విలువగల పనులు చేశారు. మెటీరియల్ గా రెండు కోట్ల 80 లక్షల 40 వేల ఎనిమిది వందల ఇరవై మూడు రూపాయలు విలువగల పనులు చేశారు. ఫారెస్ట్ కు సంబంధించి ఒక్క పని కూడా ఉపాధి హామీ పథకంలో చేయకపోవడం విశేషం. ఈ పనులన్నింటిపై మండల స్థాయిలో సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. పలు గ్రామాలలో పనులు తక్కువ చేసి ఎక్కువ ఎక్కువ రోజులు పని చేసినట్లు మస్టర్లు వేసినట్లు తేలింది. మరి కొన్ని గ్రామాలలో పనులకు రాకపోయినా కూలీలు పనులకు వచ్చినట్లు మస్టర్లు వేశారు.
మరికొన్ని గ్రామాల్లో మొక్కలు వేసినట్లు చూపించగా చాలా మొక్కలు క్షేత్రస్థాయిలో కనిపించలేదని గ్రామస్థాయిలో సామాజిక తనిఖీ నిర్వహించిన సిబ్బంది తమ నివేదికలో ప్రవేశపెట్టారు. గ్రామపంచాయతీలు వారిగా 26 డిసెంబర్ 2025 నుంచి 11 జనవరి 2026 వరకు గ్రామస్థాయిలో సామాజిక తనిఖీలు నిర్వహించారు. మండల స్థాయిలో సామాజిక తనిఖీ లో గ్రామస్థాయిలో నిర్వహించిన సామాజిక తనిఖీ వివరాలను ప్రవేశపెట్టారు. ఈ సామాజిక తనిఖీ లో జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ సక్రు నాయక్, జిల్లా అంబుడ్ మెన్ రమేష్, ప్రిసైడింగ్ ఆఫీసర్ రామకృష్ణ, అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ పవన్ కుమార్, సూపరిండెండెంట్ శాస్త్రి, ఎంపీడీవో రురావత్ రమాదేవి, సి ఆర్ పి సురేందర్, ఈజీఎస్ ఏపీవో బసవోజు కృష్ణకుమారి, ఈసి బండి సత్యనారాయణ, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామపంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.



