నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని బుస్సాపురం గ్రామపంచాయతీ పరిధిలో గల పర్యాటక కేంద్రం లక్నవరనికి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. సెలవు దినం కావడంతో ములుగు జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్లు జిల్లా హైదరాబాదు నగరం మొదలుకొని ఇతర రాష్ట్రాల నుండి కూడా పర్యాటకులు భారీ స్థాయిలో తరలివచ్చారు. పాఠశాలలకు సెలవు కావడంతో కూడా విద్యార్థులు లక్నవరం అందాలను వీక్షించేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చారు. లక్నవరంలోని కాటేజీలు పూర్తిగా నిండిపోయాయి.
ప్రస్తుతం చెరువు నిండా నీరు ఉండడంతో కాటేజీలను వారం రోజుల ముందుగానే పర్యాటకులు బుక్ చేసుకుంటున్నారని పర్యాటక కేంద్రం మేనేజ్మెంట్ తెలుపుతున్నారు. బోటు షికారు కోసం పర్యాటకులు బారులు తీరారు. స్పీడ్ బోట్లలో అలల తాకిడిని ఆస్వాదిస్తూ పర్యాటకులు ఆహ్లాదం వ్యక్తం చేశారు.
పచ్చని చెట్లు చుట్టూ నీరు మధ్యలో రాళ్ల దీవులు మొత్తానికి పర్యాటక కేంద్రం పర్యాటకులకు అద్భుతమైన కనువిందు అందిస్తోంది. సెషన్స్ బ్రిడ్జిపై పర్యాటకులు నడుస్తూ ఊగుతూ సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు. ప్రైవేట్ గా ఏర్పాటుచేసిన పలు ఈవెంట్లను పాల్గొంటూ సరదాగా గడిపారు.



