మొదటి ప్రపంచ యుద్ధం జరగక మునుపు పరిస్థితితో పోలిస్తే యుద్ధానంతర కాలంలోని సామ్రాజ్యవాదం ఒక మౌలిక వైరుధ్యం మీద ఆధారపడి నడిచింది. ఎప్పుడైనా కానీ సామ్రాజ్యవాద ప్రపంచానికి నాయకుడిగా వ్యవహరించే దేశం పెట్టుబడి దారీ విధానం విస్తరిస్తున్న దేశాలలోని ప్రధాన దేశాలతో పోల్చి చూసుకున్నప్పుడు మొత్తం మీద వాణిజ్య లోటును కలిగి వుండాలి. ఇందుకు అనేక కారణాలున్నాయి. కొత్త ప్రాంతాలకు పెట్టుబడిదారీ విధానం విస్తరించడానికి గాను నాయకుడిగా ఉన్న ఈ దేశం పెట్టుబడిని ఎగుమతి చేయాలి. కొత్తగా పారిశ్రామికీకరణ జరుగుతున్న దేశాలు ఉత్పత్తి చేసిన సరుకులకు మార్కెట్‌ను కల్పించడం కోసం తన మార్కెట్‌లోకి అనుమతించాలి. తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోడానికి సైనిక వ్యయాన్ని చేపట్టాలి. తరచూ వాస్తవంగా యుద్ధాలు చేయాలి. ఈ అన్ని కారణాల రీత్యా సామ్రాజ్యవాద శిబిరానికి నాయకుడిగా ఉన్న దేశం వాణిజ్యలోటును కలిగి వుండడం అనేది పెట్టుబడిదారీ విధానంలో ఒక తప్పనిసరి నియమం.
ఆ విధంగానే మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు కాలంలో బ్రిటన్ మొత్తమ్మీద యూరప్‌లోని ప్రధాన దేశాలతో, అమెరికా, కెెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా దేశాలతో కలిపి పోల్చినప్పుడు వాణిజ్య లోటును, పెట్టుబడుల లోటును (దేశంలోకి వచ్చే పెట్టుబడుల కన్నా బయటకు పోయే పెట్టుబడులు ఎక్కువగా ఉంటే అది పెట్టుబడుల లోటు) కలిగివుండేది. కానీ ఇంత లోటును కలిగివున్నప్పటికీ, బ్రిటన్ ఎన్నడూ విదేశీ రుణాలు తీసుకోలేదు. పైగా, ప్రపంచం మొత్తంగా చూసుకుంటే రుణాలు ఇచ్చే పరిస్థితిలోనే ఉండేది. సామ్రాజ్యవాదం తొలుత సమశీతోష్ణ మండల ప్రదేశాల్లో స్థిరపడింది. ఆ తర్వాత ఉష్ణ మండల దేశాలను తన వలసలుగా చేసుకుంది. కొత్తగా పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రవేశించిన దేశాల ఉత్పత్తులతో ఎదురైన పోటీలో గాని, బ్రిటన్‌లోనే దేశీయంగా పెరిగిన పోటీలో నిలదొక్కుకోలేకపోతున్న ఉత్పత్తులను కాని తన స్వాధీనంలో ఉన్న వలస దేశాల మార్కెట్లకు అమ్మడం ద్వారా ప్రయోజనం పొందింది. ఇక తన వలస దేశాలు సంపాదించిన విదేశీ మారకద్రవ్య నిల్వలను అమాంతం స్వాధీనం చేసేసుకుంది.
కొత్తగా పారిశ్రామికీకరణ జరిగిన దేశాలకు అవసరమైన ముడి సరుకులను అమ్మడం ద్వారా వలస దేశాలు ఆ విదేశీ మారకద్రవ్య నిల్వలను సంపాదించుకున్నాయి. దాన్ని కాస్తా స్వాధీనం చేసుకున్న బ్రిటన్ దానికి బదులుగా ఆ వలసదేశాలకు ఏమీ చెల్లించలేదు. (ఈ వ్యవహారాన్ని ”సంపద హరణం లేదా డ్రెయిన్ ఆఫ్ వెల్త్ అని ఇండియాలోని సామ్రాజ్యవాద వ్యతిరేక రచయితలు పేర్కొన్నారు. ఈ విషయాన్ని మార్క్స్ సైతం ఎన్.ఎఫ్.డేనియల్‌సన్ అనే రష్యన్ నరోద్నిక్ ఆర్థికవేత్తకు రాసిన లేఖలో పేర్కొన్నాడు) సామ్రాజ్యవాద శిబిరానికి నాయకుడిగా తన పాత్రను బ్రిటన్ ఈ విధంగా తన వలస రాజ్యాల సంపదను కొల్ల గొట్టడం ద్వారా ఎటువంటి ఇబ్బందులూ తనకు లేకుండా పోషించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కాలంలో సామ్రాజ్యవాద శిబిరానికి నాయకత్వ పాత్ర అమెరికాకు దక్కింది. ఐతే, బ్రిటన్‌కు గతంలో ఉండినట్టు ఇప్పుడు అమెరికాకు వలసలు ఏవీ లేవు. ఏ వలసదేశాల మార్కెట్లూ తన ప్రభావం కింద లేవు. కాని నాయకత్వ పాత్ర నిర్వ హించాలంటే మాత్రం వాణిజ్యలోటును నడపాల్సిందే. అందుచేత ఒక అసంగత పరిస్థితి ఏర్పడింది. ప్రపంచంలోని పెట్టుబడిదారీ వ్యవస్థకు నాయకుడిగా ఉన్న దేశమే ప్రపంచంలో అత్యంత రుణగ్రస్త దేశంగా ఉంది.
ఇది అమెరికాకు వెంటనే పెద్ద సమస్యగా పరిణమించలేదు. అమెరికా నుండి ప్రవహించే డాలర్లను, లేదా డాలర్ల ప్రాతిపదికన ఉన్న ఆస్తులను తమవద్ద నిల్వ ఉంచుకోడానికి తక్కిన ప్రపంచం మొత్తం సుముఖంగా ఉండేది. ఎందుకంటే డాలర్ల రూపంలో దాచుకోవడం అంటే బంగారం రూపంలో దాచుకోవడమేనన్న విశ్వాసం ఉండేది. ఐతే మధ్యలో 1970 దశకపు తొలి సంవత్సరాలలో డాలర్లను వదుల్చుకుని బంగారం కొనుగోలు చేయడానికి ప్రపంచం పరుగులెత్తింది. బ్రెట్టన్‌వుడ్ విధానంలో ఒక ఔన్సు బంగారాన్ని 35 డాలర్లకు కొనుగోలు చేయవచ్చు. ప్రపంచం యావత్తూ ద్రవ్యోల్బణం వ్యాపించినందున డెబ్బయిలలో డాలర్లను మార్చి బంగారం రూపంలో నిల్వ చేయసాగారు. ఆ తర్వాత బ్రెట్టన్‌వుడ్ వ్యవస్థ బంగారం ధరను డాలర్లలో నిర్ధారించే పద్ధతిని విడనాడింది. అప్పుడు మళ్లీ డాలర్ మీద ప్రపంచం విశ్వాసం బలపడింది. మళ్లీ సంపన్నులు డాలర్ల రూపంలో తమ సంపదను నిల్వ ఉంచుకోవడం ప్రారంభించారు. బ్రెట్టన్‌వుడ్ విధానం అంతమైనప్పటికీ, అమెరికా నాయకత్వ పాత్ర మాత్రం చెక్కు చెదరకుండా కొనసాగింది.
వలసలు లేనందువలన నాయకత్వపాత్ర పోషించడం సవాలుగా మారినప్పటికీ దాని పర్యవసానంగా ఎటు వంటి సంక్షోభమూ అమెరికా నాయకత్వానికి తలెత్తలేదు. కాని ఆ వైరుధ్యం మాత్రం కొనసాగింది. తక్కిన ఇతర కారణాల మాట ఎలా ఉన్నా, డాలర్‌పై విశ్వాసం నిలబడడానికి ఒక కారణం అమెరికాలో ద్రవ్యోల్బణం ఎప్పుడూ ఎక్కు వగా ఉండదన్న నమ్మకమే. సంపనుల్ని డాలర్ వైపునుంచి పక్కకు మళ్లకుండా నిలిపి వుంచేది ఆ నమ్మకమే. ద్రవ్యోల్బణం అమెరికాలో ఎప్పుడూ అదుపులో ఉంటుంది అన్న నమ్మకానికి కారణం శ్రామిక శక్తి విలువ డాలర్లలో చూసుకు న్నప్పుడు ఎప్పుడూ పరిమితిలోనే ఉంటుంది అన్న విశ్వాసమే. ఆ విశ్వాసానికి కారణం అమెరికాలో ఎప్పుడూ తగినంత నిరుద్యోగం ఉంటుందని, ప్రస్తుతం ప్రపంచంలో అతి ముఖ్యమైన ముడివనరు అయిన చమురు మార్కెట్ మీద అమెరికా పెత్తనం కొనసాగుతుందన్న నమ్మకం. ఈ నమ్మకాలు దెబ్బతినే అవకాశాలు మాత్రం ఎప్పుడూ ఉన్నాయి.
ఎప్పుడైతే ఇరాన్, రష్యా, వెనిజులా వంటి చమురు ఉత్పత్తిచేసే దేశాలు అమెరికాతో ప్రతికూల సంబంధాలలోకి అడుగుపెట్టాయో, అవి అమెరికా ఆంక్షలకు లక్ష్యాలుగా మారాయి. ఆ ఆంక్షల కారణంగా ఆ దేశాలు తక్కిన దేశాలతో చమురు సరఫరాకు డాలర్ రూపంలో కాకుండా వేరే కరెన్సీలలో ఒప్పందాలు కుదుర్చుకోవడం ప్రారంభించాయి. దీనివలన డాలర్ ఆధిపత్యం దెబ్బతినడం మొదలైంది. రానున్న కాలంలో అది సంక్షోభానికి దారి తీయగల అవకాశాలు పెరిగాయి. పైగా, అంతకంతకూ రుణగ్రస్తం కావడం అమెరికాకు రుచించడం లేదు. ఆ రుణాలను బాండ్ల రూపంలో తమ వద్ద ఉంచుకోడానికి ఇతరులు సిద్ధంగానే ఉన్నప్పటికీ అమెరికాకు ఈ పరిస్థితి ఆమోదయోగ్యంగా లేదు. అందుచేత అమెరికా, ట్రంప్ ప్రభుత్వం చివరికి ఎలాగైనా అమెరికా వాణిజ్యలోటును మొత్తంగానే అదుపు చేయాలని, తన రుణాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాయి.
తక్కిన ప్రపంచ దేశాలనుండి అమెరికాకు వచ్చే దిగుమతులమీద అధిక సుంకాలను విధించడం కూడా తన వాణిజ్య చెల్లింపు లోటును తగ్గించుకోవడం కోసమే. అమెరికన్ ఇంధనాన్ని గతంలో అమెరికాలోనే నిల్వ ఉంచుకునే వారు. ఇప్పుడు దాన్ని అమ్మడానికి నిర్ణయించుకున్నారు. ఇది కూడా వాణిజ్యలోటును లేకుండా చేసుకోవడం కోసమే. వలసలను చేజిక్కించుకోవడం కోసం ప్రయత్నం చేయడం మరొక రూపం. ముఖ్యంగా విలువైన ఖనిజ సంపదను కలిగి వున్న దేశాలమీద అమెరికా ఎక్కువ దృష్టి పెడుతోంది. ఈ విలువైన వనరులను కొల్లగొట్టి తన వాణిజ్యలోటును పూడ్చుకోవాలని చూస్తోంది. (గతంలో వలసలుగా ఉన్న దేశాల నుండి సంపదను తరలించుకు పోయినట్టే). ఇవి తప్ప వేరే ఉద్దేశ్యాలేవీ అమెరికా చర్యల వెనుక లేవని చెప్పడం కాదు, ఈ చర్యలన్నింటి వెనుకా ఉన్న ఉమ్మడి లక్ష్యాన్ని ప్రధానంగా గుర్తించేటట్లు చేయడమే నా ఉద్దేశ్యం.
ఉదారవాద మేధావులు ప్రస్తుతం అమెరికా అతి దూకుడుగా వ్యవహరిస్తున్నందుకు ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్‌నే ప్రధాన కారకుడని నిందిస్తున్నాయి. ట్రంప్‌నకు, ఇతర అధ్యక్షులకు మధ్య ఏ తేడా లేదని కాదు. ట్రంప్ ఒక నయా ఫాసిస్టు, తక్కినవాళ్లు మహా అయితే కరుడుగట్టిన మితవాదులు. అంతే. కానీ కేవలం ట్రంప్‌ను మాత్రమే నిందించడం అంటే మొత్తం వ్యవస్థలోని బలహీనతలను పట్టించుకోకపోవడమే ఔతుంది. ట్రంప్ వెనిజులా మీద తీసుకున్న చర్య ట్రంప్ దూకుడును మాత్రమే కాక, ప్రత్యక్షంగా వలసలు కలిగివుంటేనే పెట్టుబడిదారీ వ్యవస్థ సవ్యంగా మనగలుగుతుంది అన్న వాస్తవాన్ని కూడా వెల్లడి చేస్తోంది. ట్రంప్‌నకు ఈ వాస్తవం ఎటువంటి తార్కిక యోచనా లేకుండానే తెలుసు. నయా ఉదారవాద విధానాలు, ప్రపంచ వనరులపై సంపన్న పెట్టుబడిదారీ దేశాల అదుపు వంటి పద్ధతులద్వారా ఇంతవరకూ పెత్తనాన్ని చెలాయించగలిగారు. కాని ఆ పద్ధతులేవీ కూడా ప్రత్యక్షంగా వలసలు కలిగివుండడంతో పోల్చితే సగానికి కూడా చాలవు.
ఉదారవాదం ఏదైతే విశ్వసిస్తుందో దానికి ప్రస్తుత పరిస్థితి పూర్తి వ్యతిరేకం. గతంలో వలస దోపిడీ జరిగివుండొచ్చు. కానీ, అది పెట్టుబడిదారీ విధానానికి సహజంగా సంక్రమించిన ధోరణి కాదని ఉదారవాదం భావిస్తుంది. అంతర్జాతీయ సహకారం ద్వారా పెట్టుబడిదారీ వ్యవస్థ సాఫీగా పని చేసుకుపోగలదని భావిస్తుంది. పెట్టు బడిదారుల నడుమ వర్గ సహకారాన్ని, సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో సంక్షేమ విధానాలను కూడా నిరంతరాయంగా కొనసాగించవచ్చునని ఉదారవాదం భావిస్తుంది. ఉదారవాదం ఇలా ఆదర్శవంతంగా చిత్రించిన పెట్టుబడిదారీ వ్యవస్థ రూపంతో పోల్చితే ట్రంప్ ప్రవర్తన అందులో ఇమిడేదిగా లేదు. దానికి కారణం ట్రంప్ ఒక పనికిమాలినవాడు కావడం అని అనుకోకూడదు. ఉదార వాదం ఆదర్శవంతంగా రూపొందించిన పెట్టుబడి దారీ వ్యవస్థ చిత్రమే పనికి మాలినది కావడం అసలు కారణం. వర్తమానంలో పెట్టుబడిదారీ వ్యవస్థ అవసరాలకు తగినట్టుగానే ట్రంప్ నడత ఉంది.
అంటే, మానవాళిని ఒక అసాధారణ రీతిలో ప్రమాద పరిస్థితుల్లోకి నెడుతున్నది డొనాల్డ్ ట్రంప్ కాదు. పెట్టుబడిదారీ విధానమే ఆ పనిచేస్తోంది. ప్రజాస్వామ్యం, వలస విధానానికి ముగింపు, సంక్షేమరాజ్యం వంటి చారిత్రికమైన ముందుడగులన్నీ పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా కార్మికవర్గం జరిపిన పోరాటాల ఫలితమే. ఆ కాలంలో సోషలిస్టు శిబిరం నుండి సవాలు పొంచివుండడం కూడా కారణమే. ఇప్పుడు ఆ పురోగామి చర్యలన్నింటినీ తిప్పి వెనక్కి మళ్లించడానికి చూస్తున్నారు. సోషలిస్టు సవాలు ఇప్పుడు వెనక్కి పోవడంతో ఈ ప్రయత్నాల వేగం పెరుగుతోంది. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థ దూకుడు, చారిత్రిక పురోగమన చర్యలను వెనక్కు మళ్లించడానికి జరుగు తున్న ప్రయత్నాలు సోషలిజం ఆవశ్యకతను సూచిస్తున్నాయి. సామ్రాజ్యవాదం మునిగిపోకుండా నిలబెట్టడానికి ట్రంప్ బరితెగించి చేస్తున్న వీరంగాలు చూస్తుంటే మానవాళి ముందు ఆటవిక సమాజమా లేక సోషలిజమా అనేది ఎంచుకోవలసిన సమయం వచ్చిందన్న రోజా లక్సెంబర్గ్ మాటలు ఎంత సరైనవో స్పష్టంగా బోధపడుతోంది.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్



