సీపీఐ వందేండ్ల చరిత్రను ప్రజలకు చెప్పేందుకు మూడు జాతాలు : రాష్ట్రస్థాయి కవులు, కళాకారుల శిక్షణా తరగతుల ముగింపు సభలో పల్లా వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గొప్ప కళాకారులు, నాయకులు ఎదగడానికి దోహదపడిన వేదిక తెలంగాణ ప్రజానాట్యమండలి(టీపీఎన్‌ఎమ్) అని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. సీపీఐ వందేండ్ల ఉత్సవాల సందర్భంగా అభ్యుదయ రచయితల సంఘం(అరసం), తెలంగాణ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో కవులు, రచయితలు, కళాకారులకు శిక్షణా తరగతులు హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో రెండు రోజుల పాటు నిర్వహించారు. ఆదివారం జరిగిన ముగింపు సభలో పల్లావెంకట్‌రెడ్డి మాట్లాడుతూ..సీపీఐ వందేండ్ల చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జోడేఘాట్, బాసర, గద్వాల నుంచి మూడు జాతాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. భారత స్వాతంత్ర, తెలంగాణ సాయుధ రైతాంగ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటాల్లో సీపీఐ పాత్ర కీలకమైనదని చెప్పారు. నిజాంకు వ్యతిరేకంగా భూపోరాటాలను, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, ప్రజల, కార్మికుల హక్కుల కోసం పోరాటాలను రావి నారాయణ రెడ్డి, మఖ్దూం మొయినుద్దీన్ , బద్దం ఎల్లారెడ్డి వంటి అనేకమంది ముందుండి నడిపించారని గుర్తుచేశారు.
సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, వంటి కవులు, కళాకారులు చైతన్య గీతాలను పాడుతూ ప్రజలను చైతన్యం చేశారని తెలిపారు. వందేండ్ల భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రను ప్రజలకు పాటలు, నాటిక ద్వారా చెబుతూ చైతన్యపర్చాలని టీపీఎన్‌ఎమ్ కళాకారులకు పిలుపునిచ్చారు. ఒక గొప్ప బహిరంగ సభ పెట్టాలంటే నాయకులకంటే కళాకారుల పాత్రనే అతి ముఖ్యమైనదని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ..ప్రజల్లో మార్పు, చైతన్యం తీసుకొచ్చేలా పాటలు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, ప్రజానాట్యమండలి ఇన్‌చార్జి కలవేని శంకర్ మాట్లాడుతూ..నాయకుల ఉపన్యాసాల కంటే పాట ప్రజలను ఎక్కువ ప్రభావితం చేస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ.నర్సింహ, టీపీఎన్‌ఎమ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ, టీపీఎన్‌ఎమ్ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.



