సుంకం తగ్గించడంతో రూ.1500కు పడిపోయిన పత్తి ధర
ఏటా తెలంగాణ రైతులు రూ.5,286 కోట్లు నష్టపోయే ప్రమాదం
25 ఏండ్లలో మన దేశ రైతులు నష్టపోయింది అక్షరాలా రూ.111 లక్షల కోట్లు : కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేశ్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో మనదేశాన్ని అమెరికాకు మోడీ తాకట్టు పెడుతున్నారనీ, దీనివల్ల రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం జరుగబోతున్నదని కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు, విత్తన కార్పొరేషన్ చైర్మెన్ అన్వేశ్‌రెడ్డి తెలిపారు. పత్తి దిగుమతులపై 11 శాతం సుంకం తగ్గించడంతో తెలంగాణలోని రైతులు క్వింటా పత్తిపై సగటున రూ.1000 నుంచి రూ.1500 వరకు నష్టపోయారని పేర్కొన్నారు. ఇలా అన్ని రకాల పంటలపై తెలంగాణ రైతులు ఏటా రూ.5,286 కోట్ల మేర నష్టపోయే ప్రమాదముందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం సుంకాలు తగ్గించడం, వాణిజ్య ఒప్పందాలతో తెలంగాణ రైతులపై పడబోతున్న ప్రభావాన్ని గణాంకాలతో వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
మన దేశంలో రైతులు కనీస మద్దతు ధర కంటే 30 నుంచి 40 శాతం తక్కువ ధరకు పంటలను అమ్ముకుంటున్నారని తెలిపారు. ఈ స్థితిలో మన దేశ మార్కెట్లోకి ద్వారాలు తెరిస్తే ఎక్కువ సబ్సిడీలు పొందుతున్న అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడి మార్కెట్లను ముంచెత్తి మన రైతుల జీవనోపాధిని దెబ్బతీసే ప్రమాదముందని హెచ్చరించారు. వ్యవసాయ వనరుల నిర్వహణ (2020) సర్వే ప్రకారం..ఒక అమెరికా రైతు ఏటా సగటున 66,314 డాలర్ల సబ్సిడీ పొందుతున్నారని తెలిపారు. ఆ సబ్సిడీలే అక్కడి రైతులకు రక్షణ కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో 2000-01 నుంచి 2024-25 మధ్య కాలంలో మన దేశ రైతులు 111 లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారని ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేటివ్, డెవలప్‌మెంట్ సంస్థ పేర్కొందని తెలిపారు.
అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల (సోయాబీన్, మక్క, పత్తి మొదలైనవి)దిగుమతిపై తీసుకునే విధాన నిర్ణయాలు ప్రపంచ మార్కెట్ ధరలను ప్రభావితం చేస్తాయనీ, దీని వల్ల భారత్‌లో, ముఖ్యంగా తెలంగాణలో పంటల ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నూనెగింజలు, ఆహార ధాన్యాల దిగుమతితో మన రాష్ట్రంలోని సోయాబీన్, వేరుశనగ, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, ఉల్లి, బాదం, జీడిపప్పు, ఎర్రజొన్నలు, పప్పుధాన్యాలు పండించే రైతులపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. మన పంటలు అమెరికాకు ఎగుమతి చేస్తే అనేక కారణాలు, సాకులు చూపెట్టి తిరస్కరిస్తున్నప్పుడు మన దేశంలోకి ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ఎలా దిగుమతి చేసుకుంటారని ప్రశ్నించారు.
తెలంగాణపై ప్రత్యక్షంగా పడబోయే ప్రభావం.. కేంద్ర వివక్ష
అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతితో తెలంగాణలోని 30 నుంచి 40 శాతం స్థూల పంట విస్తీర్ణానికి ప్రమాదం పొంచి ఉందని అన్వేశ్‌రెడ్డి హెచ్చరించారు. దీనివల్ల రాష్ట్రంలోని 24 నుంచి 30 లక్షల రైతు కుటుంబాల జీవితాలు ప్రమాదంలో పడతాయని తెలిపారు. తెలంగాణ రైతులు తమ వార్షిక ఆదాయంలో రూ.5,286 నష్టపోతారనీ, ఇది రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్‌లో నాల్గోవంతు అని తెలిపారు. పీఎం కిసాన్‌కు రూ.63,500 కోట్లు కేటాయించగా…తెలంగాణకు వచ్చింది మాత్రం రూ.2,500 కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల లోపేనని ఎత్తిచూపారు.
ఐటీ, ఫార్మా రంగాల నుంచి ఆశిస్తున్న రూ.8,500 -రూ.12,500 కోట్లు వ్యవసాయ నష్టాలను భర్తీ చేయడానికి సరిపోవని స్పష్టం చేశారు. వ్యవసాయం మీద ఆధారపడ్డ 24 నుంచి 30 లక్షల కుటుంబాలు, 2-3 లక్షల ఐటీ/ఫార్మా ఉద్యోగుల మధ్య సంఘర్షణ ఆర్థిక, రాజకీయ ప్రభావాలను చూపుతాయని తెలిపారు. జన్యుమార్పిడి పంటల కాలుష్యంతో వ్యవసాయ స్వావలంబనకు పూడ్చలేని నష్టం ఉంటుందని పేర్కొన్నారు. అమెరికా నుంచి చేసుకున్న ఒప్పందంలో నుంచి పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, జొన్న పంటల దిగుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జన్యుమార్పిడి ఆహార ఉత్పత్తుల దిగుబడులను పూర్తిగా నిషేధించాలని కోరారు.
అమెరికాతో వాణిజ్య ఒప్పందం రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



