హద్దులు దాటితే వాహనదారుడి ఖాతా నుంచే చలాన్లు కట్
విద్యార్థి దశలోనే అవగాహన కల్పించాలి
ప్రతి మూడు నిమిషాలకు ఓ నిండు ప్రాణం బలి
రవాణా శాఖ బలోపేతానికి ‘ఉన్నతస్థాయి కమిటీ’
సైబర్ క్రైంపై రాష్ట్ర పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించాలి : ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రోడ్డు ప్రమాదాలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన సమస్యగా పరిగణిస్తోందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేయాలని అధికారులను ఆదేశించారు. చలాన్లకు ముందే నిబంధనలు అమలు చేయాలని తెలిపారు. నిబంధనలు పాటించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరిగి, ప్రాణ నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రూల్స్ బ్రేక్ చేసిన వాహనదారులపై చలాన్లు వేయడం, మళ్లీ డిస్కౌంట్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. చలాన్లపై డిస్కౌంట్లు వద్దు…వాహనదారుడి బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా చలాన్ల డబ్బులు కట్ అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో బ్యాంకులతో అనుసంధానం కావాలని పోలీస్‌శాఖను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర పోలీస్ శాఖ నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రవాణా శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల్లో కొంత మంది ఈ ఉద్యోగాన్ని డిమోషన్‌లా భావిస్తున్నారని అన్నారు.
డీజీస్థాయి లేదా అదనపు డీజీస్థాయి అధికారి పర్యవేక్షణలో రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తామని తెలిపారు. సమాజంలో నేరాల విషయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మన దేశంలో ప్రతి నిమిషం ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోందని, ప్రతి మూడు నిమిషాలకు ఓ నిండు ప్రాణం బలవుతోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధంలో సైనికుల కంటే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నియంత్రణను రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతా అంశంగా తీసుకుంటోందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రముఖులు కూడా తమ బిడ్డలను కోల్పోయి ద్ణుఖంలో మునిగిపోతున్నారని గుర్తు చేశారు. రోడ్డు సేఫ్టీపై విద్యార్థి దశలోనే అవగాహన కల్పించాల్సిన అవసరముందని చెప్పారు. మైనర్లు వాహనంతో రోడ్డుపైకి రావడం వల్లే కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. వారికి వాహనాలను ఇవ్వకుండా తల్లిదండ్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు. మద్యం తాగి బండి నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాకు గురైన చెరువులను కాపాడుతున్నామని సీఎం గుర్తు చేశారు. చెరువుల విస్తీర్ణం తగ్గిపోవడంతో చిన్న వర్షాలకే సమీప నివాసాలు మునిగిపోతున్నాయని గుర్తు చేశారు. కబ్జాకు గురైన చెరువుల పరిరక్షణకు హైడ్రాను తీసుకొచ్చామని చెప్పారు. ఇప్పుడు సైబర్ క్రైం అనేది అతి పెద్ద నేరంగా మారిందని తెలిపారు. మన తేరుకునే లోపే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయని చెప్పారు. సైబర్ క్రైంను అరికట్టేందుకు స్పెషల్ ఫోకస్ పెట్టామని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. సమాజానికి డ్రగ్స్ అతిపెద్ద శత్రువు అని తెలిపారు. డ్రగ్స్ మహమ్మారి ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. డ్రగ్స్, గంజాయి నియంత్రణలో ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు గుర్తింపు దక్కిందని సీఎం అభినందించారు. కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు రాజ్‌ఠాకూర్, నవీన్ యాదవ్, డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర పోలీసున్నతాధికారులు హాజరయ్యారు.
ట్రాఫిక్ రూల్స్ కఠినతరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



