హైదరాబాద్ అంటే ఒకప్పుడు చారిత్రక వైభవం గుర్తొచ్చేది. దాని ఆనవాళ్లయిన పురాతన కట్టడాలు, సంస్కృతి మనసును పులకరింపజేసేవి. కానీ, నేడు ‘ట్రాఫిక్ జాం’ నగరానికి పర్యాయపదంగా మారిపోయింది. ఉదయం ఆఫీస్‌కు వెళ్లేందుకు బయట అడుగుపెట్టిన నగరవాసికి ప్రతిరోజూ చిన్నపాటి సర్కస్ తప్పదు. గూగుల్ మ్యాప్ చెప్పే నలభై నిమిషాల సమయం వాస్తవ జీవితంలో గంటన్నరకు పైగా సాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సాప్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి మొదలుకుంటే సామాన్య కూలీ వరకు ప్రతిఒక్కరూ రోజుకు సగటున రెండుమూడు గంటల అమూల్యమైన సమయం రోడ్లపైనే వదిలేస్తున్న పరిస్థితి. అభివృద్ధి అంటే కాంక్రిట్ గోడలు, అద్దాల మేడలు నిర్మించడమే కాదు, పౌరుడి ప్రయాణం సాఫీిగా సాగడం కూడా. ప్రస్తుతం ఇంటినుంచి ఆఫీస్ దూరం కంటే, ట్రాఫిక్‌లో గడిపే సమయమే పెద్దసమస్యగా మారింది. రోడ్లపై ప్రయాణించాలంటేనే జంకుతున్న దుస్థితి నెలకొంది.గమ్యం చేరడానికి గంటల తరబడి రోడ్లపై వేచిచూడటం పౌరుల సగటు జీవనప్రమాణాలను కూడా దెబ్బతిస్తోంది.ఏదైనా అత్యవసరమైతే ఎలా వెళ్లాలన్న ఆలోచనే మనిషిని భయాందోళనలో పడేస్తోంది. ఇది కేవలం రోడ్లపై కాదు, ఆరోగ్యంపై, మనసుపై, ఆర్థిక వ్యవస్థపై కూడా తన ముద్ర వేస్తోంది.
హైదరాబాద్ అంటే దేశానికి బ్రాండ్ అంబాసిడర్‌గా చెప్పుకునేలా చేస్తామనే పాలకవర్గాల వాగ్దానాలకు కొదవలేదు. ఒకరేమో ఆకాశహార్మ్యాలు నిర్మించి సింగపూర్‌లా మారుస్తామన్నారు. మరొకరు ఫ్యూచర్‌సిటీ కలలు కంటున్నారు. ఆలోచన మంచిదే, ఆచరణలో పెట్టడమే కష్టం! ఎందుకంటే, ట్రాఫిక్ స్తంభనకు పాలకుల వైఫల్యమే కారణం. రాజధానికి ఉద్యోగ, ఉపాధి కోసం వలసలు పెరిగిన నేపథ్యంలో వాహనాల సంఖ్య కూడా అంతే రెట్టింప వుతోంది. 2010లో సుమారు 35 లక్షల వాహనాలు రోడ్లపై తిరిగేవి. కానీ, నేడు ఆ సంఖ్య కోటి ఐదు లక్షలు దాటడం ఆశ్చర్యకరం. పదిహేనేళ్ల వ్యవధిలోనే వాహనాలు మూడింతలు పెరిగాయి. మరి రహదారులు విస్తరిం చబడ్డాయా? అంటే లేదనే చెప్పాలి. వాహనాలు పెరిగిన వేగంతో పోలిస్తే, రోడ్ల వెడల్పు, కొత్త ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్టుగానే సాగుతోంది. ప్రజలు ప్రతిరోజూ గంటల తరబడి ట్రాఫిక్‌లో గడపాల్సి వస్తోంది. టైంకు చేరుకోవాలన్న ఆతృతలో కుటుంబంతో, పిల్లలతో గడిపే సమయం కూడా లేకుండా పోతోంది.
దేశంలో ఇప్పటివరకు ట్రాఫిక్‌లు రద్దీ ఉన్న నగరాల్లో ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు ఉండేవి. వాటి స్థానంలో హైదరాబాద్ కూడా చేరిపోయింది. ఒక నగరం ముందుకెంత సాగుతుందో కాకుండా, ఎంతసేపు ‘నిలబడు’ తోందో కూడా అభివృద్ధికి ప్రమాణంగా మారుతోంది. ఇది మన ఉత్పాదకశక్తిని కూడా నీరుగారుస్తోందని నిపుణుల అభిప్రాయం. దీనికి అనారోగ్యం అదనం. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లతో కాలుష్యం పెరిగి గాలి నాణ్యత క్షీణి స్తోంది. పదేళ్ల కిందట 60- 80 మధ్య ఉన్న ఎక్యూఐ ఇప్పుడు సగటున 110-180 వరకు పెరిగింది. శీతాకాలంలో ఇది మూడు వందలు దాటుతోంది. వాహనాలనుంచి ఎగిసే పొగతో శ్వాసకోస సమస్యలు, అలర్జీలు, హృద్రోగాలు పెరుగుతున్నాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు వ్యాధుల బారిన పడుతున్నారు. గతంతో పోలిస్తే నలభై నుంచి అరవైశాతం వ్యాధులు పెరిగినట్టు అంచనా. ఇది నగరంలో మనిషి జీవించే పరిస్థితి లేదని చెప్పే సూచిక. ఇదంతా చూసినప్పుడు మనిషి సగటు ఆయురార్థం జీవితకాలంలో మూడు నాలుగేళ్లు తగ్గుతుందని వైద్యుల భావన. పైగా ట్రాఫిక్‌లో గడిపే సమయం పెరిగేకొద్దీ మానసిక ఒత్తిడి, చిరాకు, అలసట-ఇది దీర్ఘకాలంలో సగటు ఆయుష్షుపై కూడా ప్రభావం చూపుతుంది.
ఇకపోతే పుట్‌పాత్‌లు ఆక్రమణకు గురికావడం, పాదచారులు నడవలేకుండా ఉండటం, మెట్రోపిల్లర్లు, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద అస్తవ్యస్తమైన ట్రాఫిక్ వ్యవస్థ కూడా నగరవాసుల్ని ప్రమాదం, అభద్రతలో పడేసే కారణాలు. ఇందులోనే మరో విషయం. మన పండగలు. సంస్కృతి సంప్రదయాల్ని ఎవరూ కాదనలేరు. మత విశ్వాసాలు వ్యక్తిగతం. కానీ, ఇటీవల శ్రీరామనవవి, హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా చేసిన హంగామా రహదారి వ్యవస్థను మరింత క్లిష్టతరం చేసింది. కిలోమీటర్ల పొడవునా ర్యాలీలు, వినోదాలు, విందులతో రోడ్లపై ట్రాఫిక్ స్తంభిస్తోంది. పోలీసులు దారి మళ్లింపులు చేపట్టినా చుట్టూ కిలోమీటర్ల దూరంతో గమ్యస్థానానికి చేరుకోవాల్సి వస్తోంది. ఉత్సవాల పేరుతో చేసే ఖర్చు, భక్తి పేరుతో పోటీ ప్రదర్శనలు, శబ్ద కాలుష్యం ఆందోళన కలిగిస్తున్నది. పండగల అసలు ఉద్దేశం సామరస్యాన్ని పెంచడమే కానీ, అసౌకర్యాన్ని కలిగించడం కాదు. దీన్ని నగరవాసులు గమనించాలి. ఇప్పటికైనా ప్రజారవాణాను బలపరిచే అంశాలపై సర్కార్ దీర్థకాలిక దృష్టి సారించాలి. ఇతర దేశాల్లోలాగా స్మార్ట్ సిగలింగ్ వ్యవస్థను పరిశీలించాలి. సామాన్యులకు అందుబాటులో ఉండేలా మెట్రోను విస్తరించాలి. లేదంటే భవిష్యత్తులో భాగ్యనగరమంటే ‘స్తంభించిన నగరం’గా చెప్పుకోవాల్సి వస్తుంది.
ట్రా’ఫికర్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



