Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుకృష్ణాష్టమి వేడుకల్లో విషాదం

కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం

- Advertisement -

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురు
రామంతపూర్‌లోని గోకుల్‌నగర్‌లో ఘటన
గాంధీ ఆస్పత్రిలో బాధితులకు మంత్రి శ్రీధర్‌బాబు పరామర్శ
మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
ఎస్పీడీసీఎల్‌ సీఎండీకి నిరసన సెగ
నవతెలంగాణ-సిటీబ్యూరో

శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న విద్యుద్ఘాతం ఘటనతో హైదరాబాద్‌ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా రామంతపూర్‌లోని గోకులేనగర్‌లో శ్రీకృష్ణుని విగ్రహం కలిగిన రథం బండి ఊరేగింపులో వాహనానికి విద్యుత్‌తీగలు తగిలి అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి మరొకరు మృతి చెందారు. ఘటనా స్థలాన్ని పలువురు రాజకీయ నేతలు, ఎమ్మెల్యేలు, అధికారులు పరిశీలించి వివరాలు సేకరించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఆదివారం రాత్రి యాదవ్‌ సంఘం ఫంక్షన్‌ హాల్‌ నుంచి ఊరేగింపు చేపట్టారు. గోకులేనగర్‌ నుంచి ప్రారంభమైన రథయాత్రలో డప్పులు కొట్టేవారు, లైటింగ్‌, సౌండ్‌ సిస్టమ్‌కు చెందిన వారితోపాటు దాదాపు 250 మంది వరకు యువకులు పాల్గొన్నారు.

రాత్రి ఏడు గంటలకు ప్రారంభమైన రథయాత్ర ఈసేవా, ఓల్డ్‌ రామంతపూర్‌ మీదుగా, తిరిగి అర్ధరాత్రి 12గంటలకు గోకులేనగర్‌కు చేరింది. కొద్దిసేపట్లో ఊరేగింపు ముగుస్తుందన్న సమయంలో రథం ముందుకు కదలకుండా మొరాయించింది. రథం లాగుతున్న వాహనానికి రిపేర్‌ వచ్చింది. దాంతో వాహనాన్ని పక్కన పెట్టి రథం బండిని యువకులు చేతులతో లాగుతూ ముందుకు కదిలారు. ఈ క్రమంలో రథానికి పైన విద్యుత్‌ వైర్లు తగిలాయి. దాంతో తొమ్మిది మంది విద్యుద్ఘాతానికి గురయ్యారు. ఆ సమయంలో దాదాపు 70 మంది వరకు సమీపంలో ఉన్నారు. వారిలో కొందరు దూరంగా పడిపోయారు. కొందరు కరెంట్‌ షాక్‌తో కొట్టుకోవడాన్ని గమనించిన స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. ఆ తర్వాత వెంటనే తేరుకుని ఒక్కరిద్దరిని కాపాడగలిగారు. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స చేపట్టారు. అయితే, అప్పటికే ఐదుగురు మృతిచెందారు. మరో నలుగురిని స్థానికంగా ఉన్న ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు.

అందులో ఒకరు పరిస్థితి విషమించి మృతి చెందారు. మృతిచెందిన వారిలో ఓల్డ్‌ రామంతపూర్‌కు చెందిన కృష్ణ యాదవ్‌(24), శ్రీకాంత్‌రెడ్డి(35), ఓల్డ్‌రామంతపూర్‌కు చెందిన సురేష్‌ యాదవ్‌(34), హబ్సిగూడకు చెందిన రుద్ర వికాస్‌(39), రాజేంద్రరెడ్డి(39) ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో అంబర్‌పేట్‌కు చెందిన గణేష్‌ ఉస్మానియాలో చికిత్స పొందుతుండగా, ఓల్డ్‌రామంతపూర్‌కు చెందిన ఎస్‌.రవీంద్రయాదవ్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రామంతపూర్‌కు చెందిన మహేష్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా, వి.శ్రీనివాస్‌ (కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గన్‌మెన్‌) నాగోల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న ఉప్పల్‌ పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

స్థానికంగా విషాదఛాయలు
విద్యుద్ఘాతంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న స్థానికులు, మృతుల బంధువులు, స్నేహితులు భారీగా తరలివచ్చారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా : మంత్రి శ్రీధర్‌బాబు
విద్యుద్ఘాతం మృతులకు సంబంధించి బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో బాధిత కుటుంబాలను మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటన చాలా బాధాకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేబుల్‌ వైర్‌ ద్వారా కరెంట్‌ సరఫరా జరిగి ప్రమాదం చోటుచేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారన్నారు. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో దర్యాప్తునకు ఆదేశించామని, నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కేబుల్‌ వైర్లు, కరెంటు తీగలపై స్పెషల్‌ డ్రైవ్‌కు ఆదేశాలు జారీ చేశామన్నారు.

స్థానికంగా ఆందోళన
విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఈ ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబీకులు, స్నేహితులు, బంధువులు సోమవారం రామంతపూర్‌ ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేశారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన ఉప్పల్‌ సివిల్‌, ట్రాఫిక్‌ పోలీసులు ఎక్కడికక్కడా బారికేడ్లన ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను మళ్లించారు.

పరిశీలించిన పలువురు నేతలు
సంఘటనా స్థలాన్ని జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌ శాఖ అధికారులతోపాటు పలువురు రాజకీయ నాయకులు పరిశీలించారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేయాలంటూ ఉప్పల్‌ ఎమ్మెల్యే బీఎల్‌ఆర్‌, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, కాలేరు వెంకటేష్‌, ముఠాగోపాల్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం, అధికారుల బాధ్యతారాహిత్యంతోనే ఈ ఘటన జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా కాకుండా కోటి రూపాయలు ప్రకటించాలని, బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాబోయే గణేష్‌ ఉత్సవాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని కోరారు. ఇదిలావుండగా కాంగ్రెస్‌ ఉప్పల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పరమేశ్వర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షలు రాంచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్‌వీఎస్‌ రెడ్డి, సుభాష్‌రెడ్డితోపాటు పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించారు.

ఎస్పీడీసీఎల్‌ సీఎండీకి నిరసన సెగ
దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ చైర్మెన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముషారఫ్‌ ఫరూఖీకి నిరసన సెగ తగిలింది. రామంతపూర్‌లో ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరిస్తున్న సీఎండీపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని, అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్‌ వైర్లు, ఎలక్ట్రిక్‌ పోల్స్‌ను చూపించారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడం కారణంగానే ఇంతమంది ప్రాణం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం లేదు టీజీ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ
రామంతపూర్‌లో ఘటన నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ చైర్మెన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముషారఫ్‌ ఫరూఖీ సోమవారం ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఇందుకు గల పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెండు బిల్డింగ్‌లను అనుసంధానం చేస్తూ నిరుపయోగంగా పడి ఉన్న స్టార్‌ కేబుల్‌ వైర్‌ తెగి 11 కేవీ ఓవర్‌ హెడ్‌ లైన్‌ మీదుగా జారి ఐరన్‌ ఫ్రేమ్‌తో రూపొందించిన రథానికి తగిలిందని, ఆ కేబుల్‌లో ఉన్న కాపర్‌ వైర్‌ ద్వారా విద్యుత్‌ ప్రసరణ జరగడంతో ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు వివరించారు. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారని, ఈ ఘటనలో విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం లేదని అధికారులు తెలిపారు. ఘటన జరిగిన ప్రదేశంలో 11 కేవీ లైన్‌ 20 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉందని, దీనికి తోడు గతంలోనే ఎల్‌టీ ఓవర్‌హెడ్‌ లైన్‌ స్థానంలో ఏబీ కేబుల్‌ను అమర్చామన్నారు. ఈ ఘటనకు బిల్డింగులను అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేసిన కేబుల్‌ వైరే ప్రధాన కారణమని తెలుసుకున్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేసి నివేదిక అందించాల్సిందిగా హబ్సిగూడ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ ప్రతిమ షోమ్‌ను సీఎండీ ఆదేశించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad