Friday, December 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకేటీఆర్‌ పర్యటనలో విషాదం..గుండెపోటుతో ఫొటోగ్రాఫర్‌ మృతి

కేటీఆర్‌ పర్యటనలో విషాదం..గుండెపోటుతో ఫొటోగ్రాఫర్‌ మృతి

- Advertisement -

వీడియో జర్నలిస్టు దామోదర్‌ మరణం పట్ల కేసీఆర్‌ దిగ్భ్రాంతి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జీడిమెట్ల ప్రాంతంలో కేటీఆర్‌ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ఆయన పర్యటనను చిత్రీకరిస్తున్న ఓ జాతీయ ఛానల్‌ కెమెరామెన్‌ గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే అతన్ని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతిచెందాడు. మృతుడిని దామోదరగా గుర్తించారు. వీడియో జర్నలిస్టు దామోదర్‌ మరణం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సంతాపం తెలిపారు. ఇండియా టుడే జాతీయ న్యూస్‌ చానెల్‌లో పనిచేస్తున్న ఆయన తాను పార్టీని స్థాపించిన తొలినాటి నుంచి తెలంగాణ ఉద్యమ వార్తల కవరేజీలో చురుగ్గా పాల్గొనే వారని గుర్తు చేశారు. విధి నిర్వహణలో ఉన్న దామోదర్‌ అకాల మరణం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

దామోదర్‌ భౌతికకాయానికి కేటీఆర్‌ నివాళి
హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఉన్న వీడియో జర్నలిస్టు దామోదర్‌ భౌతికకాయాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె తారక రామారావు (కేటీఆర్‌) సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దామోదర్‌ మరణం పట్ల సంతాపం, కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇలాంటి విషాద సమయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని పేర్కొన్నారు.

మృతి పట్ల హరీశ్‌రావు విచారం
వీడియో జర్నలిస్టు దామోదర్‌ ఆకస్మిక మరణం పట్ల మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబం ధైర్యంతో ఉండాలని కోరారు. వీడియో జర్నలిస్టు మరణం పట్ల బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సంతాపం తెలిపారు.

టీఎస్‌పీజేఏ సంతాపం
ఆజ్‌తక్‌ జాతీయ చానెల్‌ వీడియో జర్నలిస్టు దామోదర్‌ గుండెనొప్పితో మరణించడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అనుమళ్ల గంగాధర్‌, ప్రధాన కార్యదర్శి కె నరహరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తోటి జర్నలిస్టులు, ఫొటోజర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులతో ఆయన కలిసిమెలిసి ఉండే వారని తెలిపారు. ఆయన అకాల మరణం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఆయన మరణం పట్ల సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు.

బాధాకరం : టీడబ్ల్యూజేఎఫ్‌
ఆజ్‌తక్‌ వీడియో జర్నలిస్టు దామోదర్‌ ఆకస్మిక మరణం బాధాకరమని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సమాఖ్య (టీడబ్ల్యూజేఎఫ్‌) తెలిపింది. ఆయన మరణం పట్ల ఆ సంఘం అడ్‌హక్‌ కమిటీ కన్వీనర్‌ పి రాంచందర్‌, ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య సంతాపం తెలిపారు. దామోదర్‌ మరణం పట్ల హైదరాబాద్‌ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (హెచ్‌యూజే) అధ్యక్షులు బి అరుణ్‌కుమార్‌, కార్యదర్శి బి జగదీశ్వర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -