నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో ఒక సైనిక మందుగుండు సామగ్రి కర్మాగారంలో జరిగిన భారీ పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘోర దుర్ఘటనలో 19 మంది సిబ్బంది గల్లంతయ్యారు. వారంతా మరణించి ఉండవచ్చని అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ విస్ఫోటనం ధాటికి ఫ్యాక్టరీ పూర్తిగా నామరూపాల్లేకుండా పోయింది. నాష్‌విల్‌కు సుమారు 60 మైళ్ల దూరంలోని బక్స్‌నోర్ట్ పట్టణ సమీపంలో ఉన్న ‘యాక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్’ అనే కర్మాగారంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పేలుడు తీవ్రత ఎంతగా ఉందంటే, మైళ్ల దూరంలోని ఇళ్లు సైతం కంపించిపోయాయి. దట్టమైన పొగతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ప్రమాద స్థలాన్ని చూసిన హంఫ్రీస్ కౌంటీ పోలీస్ అధికారి క్రిస్ డేవిస్, “అక్కడ వర్ణించడానికి ఏమీ మిగల్లేదు. అంతా ధ్వంసమైపోయింది. నా కెరీర్‌లోనే ఇంతటి విధ్వంసకరమైన పరిస్థితిని చూడలేదు” అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు అక్కడకు చేరుకున్నప్పటికీ, మరిన్ని పేలుళ్లు సంభవించే అవకాశం ఉండటంతో మొదట లోపలికి వెళ్లడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. అనంతరం, పేలుడు పదార్థాల నిపుణులతో కలిసి శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. “ఈ ఘటనలో కొందరు మరణించారని మేము నిర్ధారించగలం” అని డేవిస్ తెలిపారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించే ప్రక్రియ కొనసాగుతోందని, ఇది తమకు నరకంలా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిలో తనకు దగ్గరివారైన మూడు కుటుంబాలు ఉన్నాయని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, పరిసర ప్రాంతాల్లో ఏవైనా గుర్తుతెలియని శకలాలు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.