– ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై తల్లి ఆత్మహత్య
– భర్త వివాహేతర సంబంధం, వేధింపులే కారణం
నవతెలంగాణ -కూకట్‌పల్లి
భర్త వేధింపులు, కుటుంబ కలహాలతో విసిగివేసారిన ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను చంపి.. ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. బాలానగర్ ఏసీపీ నరేష్‌రెడ్డి, కూకట్ పల్లి ఎస్‌హెచ్‌ఓ సుబ్బారావు, బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలి పిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట్ మాణిక్యతండాకు చెందిన బోడ ప్రవీణ్‌కు అదే మండలంలోని పదహారుచింత తండాకు చెందిన ఎస్.బానోత్ స్రవంతి(27)తో 13ఏండ్ల కిందట వివాహం జరిగింది. వీరికి కార్తీక్(10), కౌశిక్(8) ఇద్దరు పిల్లలు. ప్రవీణ్ కుటుంబం కూకట్‌పల్లిలోని కైత్లాపూర్ గ్రామం రాఘవేంద్ర సొసైటీలో నివాసం ఉంటోంది. స్థానికంగా డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. అతను వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, భార్యను నిత్యం వేధించేవాడు. దాంతో స్రవంతి మనస్తాపం చెంది.. ఇటీవల స్వగ్రామంలో జరిగిన కుటుంబ పంచాయితీలో తనకు విడాకులు కావాలని కోరింది. అయితే, తాను మారుతానని ప్రవీణ్ హామీ ఇచ్చాడు. అలాగే అతని తండ్రి మనవళ్ల పేరుపై కొంత భూమి రాశాడు. దంపతులు సోమవారం కూకట్‌పల్లికి తిరిగి వచ్చారు. మళ్లీ వేధింపులు మొదలవ్వడంతో స్రవంతి మంగళవారం ఇద్దరు కొడుకులను ముందుగా చంపి.. ఆ తర్వాత ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన ప్రవీణ్ తలుపు తట్టగా భార్య తీయకపోవడంతో.. స్థానికుల సహాయంతో తలుపులు బద్దలు కొట్టారు. లోపల ముగ్గురూ విగతజీవులుగా కనిపించారు. కూకట్‌పల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
భర్త వేధింపులే కారణం : మృతురాలి అన్న
తన చెల్లెలు, పిల్లల ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణమని మృతురాలి అన్న లక్ష్మణ్ నాయక్ ఆరోపించారు. ప్రవీణ్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని వేధిస్తున్నాడని, విడాకులు కావాలని స్రవంతి కుటుంబ పంచాయితీలో చెప్పిందని తెలిపారు. అయితే, పెద్దల సమక్షంలో మారుతానని అతను హామీ ఇవ్వడంతో సోమవారం కూకట్‌పల్లికి తిరిగి వచ్చారన్నారు. కానీ తిరిగి వేధింపులు కొనసాగడంతో మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడిందని కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.
కూకట్‌పల్లిలో విషాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



