Saturday, July 26, 2025
E-PAPER
Homeజాతీయంరాజస్థాన్‌లో విషాదం

రాజస్థాన్‌లో విషాదం

- Advertisement -

కుప్పకూలిన ప్రభుత్వ పాఠశాల భవనం
ఏడుగురు విద్యార్థులు మృతి
35 మందికి గాయాలు
ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటున్న స్థానికులు
ఐదుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌
జైపూర్‌ :
రాజస్థాన్‌లో శుక్రవారం పెనువిషాదం చోటు చేసుకుంది. చదువుకోవడానికి ఉయాన్నే పాఠశాలకు వెళ్లిన చిన్నారులు ఇక ఇంటికి తిరిగిరానేలేదు. తల్లిదండ్రులు, బంధువులకు తీరని శోకం మిగులుస్తూ పాఠశాలలోనే తుదిశ్వాస విడిచారు. పాఠశాల భవనం కుప్పకూలడంతోనే తరగతి గదిలోనే కన్నుమూశారు. రాజస్థాన్‌లోని ఝలావర్‌ జిల్లాలోని పిప్లోడ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘోరం జరిగింది. 6, 7 తరగతులు ఉన్న పాఠశాల భవనంలోని భాగం కుప్పకూలడంతో ఏడుగురు విద్యార్థులు మృతి చెందారు. 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటననా స్థలంలోనే ఐదుగురు అక్కడక్కడే మరణించారు. మరో ఇద్దరు చికిత్సకు తరలిస్తుండగా మరణించారు. ఉదయం 7:45 గంటల సమయంలో భారీ శబ్ధంతో భవనం కూలిపోవడం విన్న స్థానికులు అక్కడకు చేరుకుని శిథిల్లాలో చిక్కుకుని ఉన్న చిన్నారులను వెలికితీశారు. గాయపడిన చిన్నారులను ఆసుపత్రులకు తరలించారు. తరువాత అత్యవసర సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాద సమయంలో పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఉన్నట్లు స్థానికులు చెప్పారు. ముందుగా గాయపడిన 35 మంది చిన్నారులందర్నీ స్థానిక మనోహర్తన ఆసుపత్రికి తరలించారు. వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఝలావర్‌ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు.
కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగానే పాఠశాలను భవనం కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు. అయితే స్థానికులు మాత్రం గత ఏడాది నుంచి పాఠశాల భవనం కూలిపోయే స్థితిలో ఉందని, పాఠశాల పరిస్థితి గురించి తహసీల్దార్‌, సబ్‌-డివిజనల్‌ మేజిస్ట్రేట్‌కు సమాచారం ఇచ్చామని, ఎన్నిసార్లు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఇది పరిపాలన నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగింది’ అని స్థానిక నివాసి బాల్కిషన్‌ మీడియాకు తెలిపారు. పాఠశాల విద్యార్థులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. పాఠశాల భవనం నిర్వహణ సక్రమంగా లేదని, భవనం గోడలపై మొక్కలు మొలిచాయని, గోడల నుంచి నిరంతరం నీరుకారేదని తెలిపారు.
అయితే రాజస్థాన్‌లోని బిజెపి ప్రభుత్వం మాత్రం ఈ ప్రమాదానికి ఉపాధ్యాయులనే బలిపశువులను చేయాలన్ని చూస్తోంది. ఐదుగురు ఉపాధ్యాయల్ని సస్పెండ్‌ చేసినట్లు రాష్ట్ర విద్యామంత్రి మదన్‌ దిలావర్‌ ప్రకటించారు. అలాగే ఈ సంఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ సోషల్‌ మీడియాలో ఈ ఘటనపై స్పందించారు. పాఠశాల భవనం కూలిపోయన ఘటన హృదయ విచారకరమైనదని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.కాగా, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు పట్టున్న ఈ జిల్లాలో ఇటీవల ఇలాంటి సంఘటనలు తరుచూ జరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో బికనీర్‌లో నీటిట్యాంక్‌ కూలిపోవడంతో ముగ్గురు చిన్నారులు మరణించారు. తరువాత బార్మర్‌లోని చోహ్తాన్‌ బ్లాక్‌లో పాఠశాల గోడకూలి ఒక విద్యార్థి మరణించాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -