- Advertisement -
- – బస్టాండ్ మలుపు వద్ద మృత్యువై వచ్చిన ఆర్టీసీ బస్సు..
- – తోపుడు బండ్ల సందులో నలిగిపోయిన నిండు ప్రాణం
- నవతెలంగాణ – పరకాల
- పరకాల పట్టణ నడిబొడ్డున బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం, ఫుట్‌పాత్ ఆక్రమణలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ములుగు జిల్లాకు చెందిన ఓ వృద్ధురాలు ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడి మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.
- అడ్డంగా ఆక్రమణలు.. వెరసి ప్రమాదం
- వరంగల్-2 డిపోకు చెందిన బస్సు హనుమకొండ నుంచి భూపాలపల్లి వైపు వెళ్తూ పరకాల బస్టాండ్‌లోకి మలుపు తీసుకుంటున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఈ ఘటనకు ప్రధాన కారణం బస్టాండ్ ప్రవేశ ద్వారం వద్ద పేరుకుపోయిన తోపుడు బండ్లు మరియు పండ్ల వ్యాపారుల ఆక్రమణలేనని స్పష్టమవుతోంది.రోడ్డు మలుపు వద్ద ఇరుకుగా ఉండటం, దానికి తోడు వ్యాపారుల తోపుడు బండ్లు ఉండటంతో డ్రైవర్‌కు రోడ్డుపై నడుస్తున్న రాధమ్మ (70) కనిపించలేదు.బస్సు మలుపు తిరుగుతున్న వేగంలో రాధమ్మను బుస్సు బలంగా డీకొట్టింది. ఆమె ఒక్కసారిగా బస్సు కింద పడిపోవడంతో ముందు చక్రం ఆమెపై నుండి వెళ్ళడంతో రాదమ్మ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
- అధికారుల పర్యవేక్షణ లోపంపై విమర్శలు
- ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ సెంటర్‌లో ఇష్టారాజ్యంగా తోపుడు బండ్లు పెడుతున్నా మున్సిపల్, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. “అధికారుల ఉదాసీనత వల్లే సామాన్యుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి” అంటూ స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా అధికారులు హెచ్చరించలేదని వారు వాపోతున్నారు.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలు పాల్సావ్‌పల్లికి చెందిన తోట రాధమ్మగా గుర్తించి వారి బంధువులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, డ్రైవర్ అజాగ్రత్తతో పాటు అక్కడ ఉన్న పరిస్థితులపై కూడా ఆరా తీస్తున్నారు.ఈ ఘటనతోనైనా అధికారులు కళ్ళు తెరిచి బస్టాండ్ పరిసరాల్లో ఉన్న ఆక్రమణలను తొలగించి, పాదచారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తారో లేదో వేచి చూడాలి.
- Advertisement -

