బీహార్ రోడ్డు ప్రమాదంలో 13మంది మృతి
బస్సు, పికప్ ట్రక్కు ఎదురెదురుగా ఢీ
కతిహార్ : బీహార్‌లోని కతిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వస్తున్న బస్సు అదుపుతప్పి, మొదట ఇద్దరు బైక్ రైడర్లను ఢీకొట్టి, ఆ తర్వాత ఒక పికప్ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్క డే మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం, కోధా పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్‌గడా చౌక్ సమీపంలో జాతీయ రహదారి 31పై ప్రమాదం చోటుచేసుకుంది. పికప్ ట్రక్కులో గిరిజన వర్గానికి చెందిన వారు ఒక జాతర నుంచి తిరిగి వస్తున్నారు. ఎదురుగా వేగంగా వస్తున్న బస్సు పికప్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దీంతో వ్యాన్ నుజ్జునుజ్జు అయింది. పలువురు అక్కడికక్కడే మరణించారు.
అతివేగమే ప్రమాదానికి కారణమా?
ఘటన జరిగిన వెంటనే స్థానికులు కోధా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గ్రామస్తుల సాయంతో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి పంపించారు. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానిక నివాసి దిలీప్ కుమార్ ఆరోపించారు. డ్రైవర్ బస్సును అతివేగంగా నడుపుతున్నాడని, దుర్ఘటనకు పూర్తి బాధ్యత బస్సు డ్రైవరే వహించాలని అన్నారు.



