– మారేడుమిల్లి ఘాట్‌లో లోయలో పడ్డ ప్రైవేటు బస్సు
– తొమ్మిది మంది దుర్మరణం
– తీర్థయాత్రలు చేస్తుండగా ఘటన
– రాష్ట్రపతి, ప్రధాని, సిఎం సహా పలువురు దిగ్భ్రాంతి
చింతూరు, మోతుగూడెం (అల్లూరి జిల్లా)
వారంతా కొద్ది రోజులుగా తీర్థయాత్రలు చేస్తున్నారు. వివిధ జిల్లాల్లోని పలు ఆలయాలను దర్శించుకుని భద్రాచలం బయలుదేరారు. ఎప్పటిలాగే రోజంతా సందడిగా గడిపిన వారు రాత్రి అయ్యేసరికి నిద్రపోయారు. తెల్లవారుతుండగా ఊహించని కుదుపు. అల్లూరి జిల్లా మారేడుమిల్లి – చింతూరు ఘాట్‌లోని వనదుర్గ ఆలయ సమీపంలో శుక్రవారం తెల్లవారుజాము మూడున్నర గంటలకు వారు ప్రయాణిస్తున్న శ్రీ విఘ్నేశ్వర ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి పెద్ద లోయలో తలకిందులుగా పడిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. వారిలో నలుగురు పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. మిగతావారంతా గాయపడ్డారు. వారంతా చింతూరు, భద్రాచలంల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని, సిఎం సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసుల కథనం ప్రకారం… ఈ నెల ఆరున చిత్తూరు నుంచి 35 మంది ప్రైవేటు ట్రావెల్ బస్సులో బయలుదేరారు. కోటప్పకొండ, అమరావతి, మంగళగిరి, విజయవాడ, ద్వారకా తిరుమల, భీమవరం, పాలకొల్లు, అంతర్వేది, కోటిపల్లి, పెనుగొండ, ద్రాక్షారం, అన్నవరం, అరసవల్లి, శ్రీకూర్మం, సింహాచలం, అరకులోయ ప్రాంతాలకు వెళ్లి వివిధ ఆలయాలను దర్శించుకున్నారు. తిరిగి గురువారం సాయంత్రం ఐదు గంటలకు అరకులోయ నుంచి భద్రాచలంలోని రాములవారి దర్శనానికి వెళ్తుండగా మారేడుమిల్లి ఘాట్‌లోని వనదుర్గ ఆలయ సమీపంలో బస్సు అదుపు తప్పి 30 అడుగుల లోయలో పడిపోయింది. అందరూ నిద్ర మత్తులో ఉండగానే ఈ హఠాత్ప్రరిణామం చోటుచేసుకుంది. చుట్టూ చీకటి. ఏం జరిగిందో తెలుసుకునేలోపు విగతజీవులుగా తమవారు కనిపించారని క్షతగాత్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనా స్థలం దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ప్రమాద సమాచారం బయట ప్రపంచానికి చేరడానికి చాలా ఆలస్యం జరిగింది. ఫోన్ సిగల్స్ కూడా బాధితులకు అందని పరిస్థితి. గాయాలపాలైన వారు తమ వద్ద ఫోన్లతో అతికష్టమ్మీద సమాచారం తెలపడంతో చింతూరు మండల కేంద్రం నుంచి 108 వాహనం చాలా సేపటికి ఘటనా స్థలానికి చేరుకుంది. క్షతగాత్రులను ముందుగా చింతూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను ఇక్కడికే తీసుకొచ్చారు.
మృతుల వివరాలు
ఈ ప్రమాదంలో శైలజా రాణి, శ్యామల, పి.సునంద, శివ శంకర్ రెడ్డి, ఎస్‌వి.నాగేశ్వరరావు, కె.కృష్ణ, శ్రీకళ, దొరబాబు, కృష్ణకుమారి మృతి చెందారు. వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన వారు ఐదుగురు, తిరుపతి, తెనాలికి చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున, బెంగళూరుకు చెందిన ఇద్దరు ఉన్నారు. క్షతగాత్రుల్లో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. వారిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదానికి కారణమేంటి?
వారం రోజులుగా అల్లూరి జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. పొగ మంచూ విపరీతంగా కురుస్తోంది. వేకువజామున ఎదురుగా ఉన్న పరిసరాలు, రోడ్డు సైతం కనిపించడం లేదు. ఇదే పరిస్థితి మారేడుమిల్లి ఘాట్‌లో శుక్రవారం నెలకొంది. పైగా డ్రైవర్‌కు అనుభవం లేకపోవడం బస్సును కంట్రోల్ చేయలేకపోయినట్టు తెలుస్తోంది.
మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా
బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, సిఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలతోపాటు క్షతగాత్రులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియాగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఘటనా స్థలాన్ని రాష్ట్ర మంత్రులు అనిత, గుమ్మడి సంధ్యారాణి, మడింపల్లి రాంప్రసాద్, రంపచోడవరం ఎంఎల్‌ఎ మిరియాల శిరీషాదేవి, రాష్ట్ర ఎస్‌టి కమిషన్ చైర్మన్ చోళ బొజ్జి రెడ్డి సందర్శించారు. చింతూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బస్సు ప్రమాద బాధితులను కలెక్టర్ దినేష్ కుమార్‌తో కలిసి పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ ప్రమాదంపై ఒక కమిటీని వేసి సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు.
బస్సు ప్రమాదంపై సిపిఎం దిగ్భ్రాంతి
భద్రాచలం సమీపంలో తులసిపాక వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో పలువురు మృతి చెందడంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. బాధితులకు అండగా సిపిఎం అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందించాలని ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే స్థానిక నాయకత్వానికి, కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వం తక్షణ సాయం అందించి క్షతగాత్రులను, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రమాదంలో గాయపడిన వారిని సిపిఎం ఎఎస్‌ఆర్ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పల్లపు వెంకట్ తదితరులు పరామర్శించారు. ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలి : సిపిఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించాలని కోరారు.
వైఎస్ జగన్ సంతాపం
ప్రమాదంలో పలువురు మృతిచెందడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.



