సీపీఐ(ఎం) జిల్లా నాయకులు పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట : శిక్షణ ఏదైనా ఆ వ్యక్తుల పనిలో నాణ్యత పెంపుదల కు దోహద పడుతుందని, అలాగే సీపీఐ(ఎం) నిర్వహించే రాజకీయ శిక్షణా తరగతులతో పార్టీ నాయకుల, కార్యకర్తలకు, సాధారణ సభ్యులకు వారి పార్టీ పనిలో చురుకుదనం పెంచుతుంది అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు. పార్టీ మండల కమిటీ ఆద్వర్యంలో పార్టీ సభ్యులకు మండల స్థాయి శిక్షణ తరగతులను మండలంలోని వినాయకపురం లోగల ఉమా చంద్ర ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ముందుగా పార్టీ పతాకాన్ని పుల్లయ్య ఆవిష్కరించిన అనంతరం మండల కార్యదర్శి సోడెం ప్రసాద్ అద్యక్షతన జరిగిన శిక్షణా తరగతుల ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. రాజకీయ శిక్షణా తరగతులను ప్రతీ సభ్యుడు సద్వినియోగం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
బలవంతపు అశాస్త్రీయ అనుసరణ, ఆచరణలే మతోన్మాదం – సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు అర్జున్
ఒక వ్యక్తి లేదా సమూహం తమ మత విశ్వాసాలను అత్యంత తీవ్రంగా,సంకుచితంగా అనుసరించడం,ఆచరించడం, ఇతర మతాల పట్ల లేదా భిన్న అభిప్రాయాల పట్ల తీవ్ర అసహనం,ద్వేషం,హింసను ప్రేరేపించడం,ప్రదర్శించడం. తమ మతమే గొప్పదని,తమ నమ్మకాలు మాత్రమే సరైనవని,మిగిలినవన్నీ తప్పని బలంగా విశ్వసించడం తో పాటు,ఆ నమ్మకాలను ఇతరులపై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించడమే మతోన్మాదం అని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్ అన్నారు. పార్టీ మండల కమిటీ ఆద్వర్యంలో పార్టీ సభ్యులకు రెండు రోజులు పాటు నిర్వహించే మండల స్థాయి శిక్షణా తరగతుల్లో ఆయన మొదటి రోజు శుక్రవారం “మతం – ఉన్మాదం” అనే పాఠ్యాంశాన్ని బోధించారు. జిల్లా కమిటీ సభ్యులు బి.చిరంజీవి ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్న ఈ తరగతుల్లో అర్జున్ బోధిస్తూ అసహనం,వివక్ష,హింస,బలవంతపు మత మార్పిడులు,నిరంకుశత్వం మతోన్మాదం లక్షణాలు అన్నారు.
మతోన్మాదాన్ని నిర్మూలించడం అనేది ఒక సంక్లిష్టమైన, దీర్ఘకాలిక ప్రక్రియ అని,దీనికి బహుళ స్థాయిలలో కృషి అవసరం అన్నారు. ఇది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి పౌరుడి భాగస్వామ్యం కూడా అవసరం తెలిపారు. లౌకిక విద్యను ప్రోత్సహించడం,వివిధ మతాలపై అవగాహన కలిగి ఉండటం,అన్ని మతాల సారాన్ని,వాటిలోని సహనం, ప్రేమ,మానవత్వం వంటి విలువలను బోధించడం తద్వారా ఇతర మతాల పట్ల గౌరవం పెంపొందించడం మే మార్గం అని తెలిపారు. విమర్శనాత్మక ఆలోచన, యువతలో విమర్శనాత్మక ఆలోచన,చట్టం తో సుపరిపాలన,చట్టాల కఠినమైన అమలు, అల్ప సంఖ్యాకులు హక్కుల పరిరక్షణ,లౌకికవాద సూత్రాలను పాటించడం,
సామాజిక,సాంస్కృతిక మార్పు,మత సామరస్యాన్ని పెంపొందించడం లాంటి చర్యలు చేపట్టడంతో మత సామరస్యాన్ని పెంపొందించుకోవచ్చు అన్నారు. మత పెద్దల పాత్ర,మీడియా పాత్ర,కళలు,సాహిత్యం, ఆర్థిక మరియు సామాజిక న్యాయం,పేదరికం,నిరుద్యోగం తగ్గించడం,సామాజిక న్యాయం కీలకంగా వ్యవహరిస్తాయి అని తెలిపారు. “పార్టీ విశిష్టత – పార్టీ కార్యక్రమం” అనే అంశాన్ని పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ బోధించారు. మతాలకు,కులాలకు అతీతంగా,పేదప్రజల పక్షాన పోరాడే ఏకైక పార్టీ సీపీఐ(ఎం) మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు ముల్లగిరి గంగరాజు,మడిపల్లి వెంకటేశ్వరరావు,మడకం గోవిందు,కారం సూరిబాబు,తగరం నిర్మల పాల్గొన్నారు.