పంచాయతీరాజ్ చట్టాలపై అవగాహన
నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామపంచాయతీల్లో కొత్త పాలక వర్గాలు ఇటీవల కొలువుదీరాయి. నూతన సర్పంచులకు పల్లె పాలనపై అవగాహన కల్పించడంతోపాటు పంచాయతీరాజ్ చట్టాలపై చైతన్యం కలిగించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా మండల పరిధిలోని సర్పంచులకు రైతు వేదికలో ఈ నెల 19 నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం సంబంధిత గైడ్లైన్స్ పుస్తకాలను సిద్ధం చేశారు. సర్పంచులకు శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే హైదరాబాద్ లో జిల్లాల వారీగా సంబంధిత అధికారు లకు ట్రైనింగ్ ఇచ్చారు.
విధులు, నిధులు, నాయకత్వ లక్షణాలపై..
మండల స్థాయి అధికారుల బృందం ఈనెల 19 నుంచి 24 వరకు సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, కార్యదర్శులకు శిక్షణ ఇస్తారు. ప్రాథమిక లక్ష్యాలు, నాయకత్వ లక్షణాలు, పారిశుధ్యం, సమావేశాలు, స్టాండింగ్ కమిటీల ఏర్పాటు, రికార్డుల నిర్వహణ, వనమహోత్సవం, నిధులపై ఆడిట్, ఆర్థిక ప్రణాళిక తదితర అంశాలపై పట్టు సాధించేలా ప్రోత్సహించనున్నారు. పంచాయతీలకు వచ్చిన ప్రతీ పైసా దుర్వినియోగం కాకుండా పారదర్శకంగా ఖర్చు చేసేందుకు అవసరమైన మెలకువలు నేర్పిస్తారు.
ఆదర్శ పంచాయతీలుగా అగ్రపథంలో నిలిచేలా శిక్షణ ఇవ్వనున్నారు. పల్లె సీమల అభివృద్దే లక్ష్యంగా నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ముందుకు సాగేందుకు శిక్షణ శిబిరాలు దోహదపడనున్నాయి.
24 అంశాలపై అవగాహన
మండలంలో 15 గ్రామ పంచాయతీల్లో గెలిచిన 15 మంది సర్పంచులు,15 మంది ఉప సర్పంచ్ వీలు,128 మంది వార్డు సభ్యులకు 24 అంశాలపై అవ గాహన కల్పిస్తారు. గ్రామసభల నిర్వహణ, పంచాయతీ సమావేశాలు, ప్రజారోగ్యం, ఉపాధి పథకం, వ్యవసాయం, జనన, మరణాల నమోదు తదితరాల అంశాలపై అవగాహన కల్పిస్తారు. కొత్త పాలక వర్గాలకు విధులు, బాధ్యతలు, నిధుల ఖర్చు, ఆదర్శ పంచాయతీలుగా ఎలా తీర్చాలనే సందేహాలు తొలగిస్తే పల్లెల్లో మెరుగైన పాలన అందనుంది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ పాలకవర్గాలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.



