8 మంది మృతి
బిలాస్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో మంగళవారం రెండు రైళ్లు ఢీ కొన్నాయి. పాసింజర్ రైలు, గూడ్స్ రైలుతో ఢీ కొన్న ఘటనలో ఆరుగురు మరణించగా, ఐదుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కోర్బా జిల్లాలోని గెవ్రా నుంచి పాసింజర్ రైలు బిలాస్‌పూర్‌కు వెళుతోంది. గటోరా, బిలాస్‌పూర్ రైల్వే స్టేషన్ల మధ్య పాసింజర్ రైలు వెనుక నుండి గూడ్స్ రైలులోకి దూసుకుపోయింది. ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలు వ్యాగన్ పైకి ప్రయాణికుల రైలు కోచ్ ఒకటి పూర్తిగా ఎక్కేయడం కనిపిస్తోంది. కోచ్ కింద చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి హైడ్రాలిక్ కట్టర్‌లను ఉపయోగిస్తున్నారు. బిలాస్‌పూర్ రైల్వేచీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుస్కర్ విపుల్ విలాస్‌రావు విలేకర్లతో మాట్లాడుతూ, రైళ్ళ వేగానికి సంబంధించి అడిగిన ప్రశ్నలకు స్పందించారు. ఒకే ట్రాక్‌పై ఒక రైలు వెనుక మరో రైలు వెళ్ళఢమనేది సాధారణ కార్యకలాపాల్లో భాగమేనని చెప్పారు. అయితే రైల్వే భద్రతా కమిషనర్ విచారణ జరిపిన తర్వాత గానీ సరైన కారణాన్ని వెల్లడించలేమని అన్నారు.
నష్టపరిహారం
మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10లక్షలు చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5లక్షలు, స్వల్ప గాయాలైన వారికి లక్ష చొప్పున నష్టపరిహారాన్ని రైల్వే ప్రకటించింది. హెల్ప్‌లైన్‌లను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఈ ఘటనపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా బిలాస్ పూర్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు చెప్పారు.



