రాష్ట్రవ్యాప్తంగా 83 మంది బీడీఓలు ట్రాన్స్‌ఫర్
ఎన్నికల సంఘం నిర్ణయం
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు (ఏఆర్‌ఓలు)గా పని చేస్తున్న 83 మంది బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ల (బీడీఓలు)ను ట్రాన్స్‌ఫర్ చేసింది. అలాగే పలు పోలీస్ స్టేషన్లలో ఆఫీసర్స్-ఇన్-చార్జ్ (ఓసీ)లుగా విధులు నిర్వర్తిస్తున్న 174 మందిని కూడా బదిలీ చేసింది. అయితే పారద్శక ఎన్నికల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈసీఐ వెల్లడించింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు 24 రోజుల సమయం ఉన్నదన్న తరుణంలో ఎన్నికల సంఘం ఈ చర్యలు చేపట్టడం గమనార్హం.
మొత్తం 294 స్థానాలు కలిగి ఉన్న రాష్ట్ర అసెంబ్లీకి ఏప్రిల్ 23, ఏప్రిల్ 29న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 83 మంది బీడీఓల బదిలీ, పోస్టింగ్‌లను అమలు చేయాలని ఈసీఐ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ను ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో బీడీఓలను బదిలీ చేస్తూ పోస్టింగ్‌లు ఇవ్వాలన్న పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) మనోజ్ అగర్వాల్ ప్రతిపాదన మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కాగా ఎన్నికల సంఘం ఇప్పటికే పలువురు సీనియర్ ఉన్నతాధికారులను బదిలీ చేసిన విషయం విదితమే. ఇందులో చీఫ్ సెక్రెటరీ నందిని చక్రవర్తి, హౌం సెక్రెటరీ జె.పి మీనాలతో పాటు డీజీపీ పీయూశ్ పాండే, కోల్‌కతా సీపీలు వంటి పలువురు ఐపీఎస్ అధికారులు ఉన్నారు.



