Tuesday, January 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యులుగా ట్రాన్స్‌జెండర్లు

మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యులుగా ట్రాన్స్‌జెండర్లు

- Advertisement -

నామినేట్‌ చేసే దిశగా పాలక వర్గాలు ఆలోచించాలి
విద్యా, ఉద్యోగాల్లో వికలాంగుల కోటాను వారితోనే భర్తీ చేస్తాం
తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో కోత
రాబోయే బడ్జెట్‌ సమావేశాల్లో చట్టం : వికలాంగులకు ఉచిత పరికరాల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో కోఆప్షన్‌ సభ్యులుగా ట్రాన్స్‌జెండర్లకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో వికలాంగులకు అత్యాధునిక పరికరాల ఉచిత పంపిణీతో పాటు బాల భరోసా పథకం, ప్రణామ్‌ డే కేర్‌ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్లకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా వారి సమస్యలపై వారే మాట్లాడుకునే అవకాశం కలుగుతుందన్నారు. కొత్తగా ఎన్నిక కాబోయే మున్సిపాల్టీ, కార్పొరేషన్‌ పాలక వర్గాలు ఆ దిశగా సముచిత నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తోందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు మానవీయ కోణంలో సహకారం అందిస్తోందని సీఎం తెలిపారు.

వికలాంగులు ఒకరినొకరు పెండ్లి చేసుకుంటే రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ”ప్రభుత్వ ఉద్యోగాల్లో వికలాంగులకు సముచిత స్థానం ఇస్తాం. విద్య, ఉద్యోగాల భర్తీలో వారి కోటాను వారికే కేటాయిస్తున్నాం. క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇటీవల పారా ఒలంపిక్‌ క్రీడల్లో రాణించిన అమ్మాయికి గ్రూప్‌ 1 ఉద్యోగం ఇచ్చాం. ప్రభుత్వం కల్పించే అవకాశాలను ఉపయోగించుకుంటూ ఎదగాలి. వైకల్యాన్ని లెక్కచేయకుండా ఈ ప్రాంత నాయకులైన పీవీ, నీలం సంజీవరెడ్డి స్థాయికి చేరిన జైపాల్‌రెడ్డిని స్ఫూర్తిగా తీసుకోండి. పోటీ ప్రపంచంలో తాము వెనకబడ్డామన్న ఆలోచన లేకుండా అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నాం. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను ఉపయోగించుకుని ఆత్మస్థైర్యంతో జీవితంలో ఎదగండి” అని వికలాంగులకు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ప్రతి నెలా జీతంలో 10 నుంచి 15 శాతం తల్లిదండ్రులకు అందించేలా చట్టం తెస్తామని సీఎం ప్రకటించారు.

రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికి నూటికి నూరు శాతం వైద్యం అందించాలన్నదే తమ విధానమని పేర్కొన్నారు. ”వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో హెల్త్‌ పాలసీని తీసుకురాబోతున్నాం. తెలంగాణ సమాజం సామాజిక న్యాయం, సమాన అవకాశాలను కోరుకుంటోంది. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కులగణన నిర్వహించాం. తెలంగాణ ఒత్తిడికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన నిర్వహించేందుకు అంగీకరించింది. తెలంగాణ కులగణన మోడల్‌ను దేశం అనుసరిస్తోంది. 30 ఏండ్లుగా సాధ్యం కాని ఎస్సీ వర్గీకరణను చేసి చూపించాం. రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా, పేదల సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం” అని సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేండ్లలో వికలాంగులకు రూ.60 కోట్లు కేటాయిస్తే మా ప్రభుత్వం కేవలం రెండేండ్లలోనే రూ.100 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ భావి భారత పౌరులు ఆరోగ్యంగా ఎదగాలన్న సంకల్పంతో ‘బాల భరోసా’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదేండ్ల లోపు వయస్సున్న చిన్నారుల్లో శారీరక, మానసిక లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించి నివారించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని వివరించారు. మారుతున్న జీవనశైలి, మైక్రో కుటుంబాల నేపథ్యంలో ఒంటరితనంతో బాధపడుతున్న వద్ధులకు ఊరటనిచ్చేలా ప్రణామ్‌ డే కేర్‌ సెంటర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన 37 కేంద్రాల్లో, సోమవారం 18 కేంద్రాలను ప్రారంభించామని అన్నారు. పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి దనసరి అనూసయ సీతక్క మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. గతంలో ఈ శాఖకు మంత్రిగా ఉన్నప్పుడు వారి ఉపాధి కోసం జాబ్‌ పోర్టర్‌ను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ మాట్లాడుతూ వికలాంగులు, చిన్నారులు, వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. రాష్ట్ర చరిత్రలో మొదటి సారీగా ఒకే సారి రూ.50 కోట్ల విలువైన పరికరాలను వారికి అందిస్తున్నామని తెలిపారు. వికలాంగుల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బలరామ్‌ నాయక్‌, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -