– టీజీఎడబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి అలుగు వర్షిణి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తోందనీ, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లోని అన్ని పాఠశాలల్లో ప్రవేశాలన్నీ మెరిట్ ఆధారంగా జరుగుతున్నాయని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి డాక్టర్ విఎస్ అలుగు వర్షిణి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని డీఎస్‌ఎస్ భవన్‌లో ఆమె విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఐదో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు అన్ని సీట్లు ఇప్పటికే భర్తీ అయ్యాయని తెలిపారు. ప్రామాణికమైన పరీక్షల ద్వారా తయారైన మెరిట్ జాబితాల ప్రకారమే ఎంపికలు జరిగాయని వివరించారు. ”తల్లిదండ్రులు ఎవరూ మోసపోవద్దు. సీటు కోసం ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్వరూ సీటు కల్పించలేరు, మెరిట్‌కు మాత్రమే సీటు దక్కుతుందని” అని ఆమె స్పష్టం చేశారు. ఖాళీగా ఉన్న ఇంటర్మీడియట్ కోర్సులకు జులై 31న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు తెలిపారు. బుధవారం నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో ఖాళీ సీట్ల జాబితా ఉంచుతామని చెప్పారు. అభ్యర్థులు దరఖాస్తు చేసేటప్పుడు పదో తరగతి మార్కుల మెమో, బర్త్ సర్టిఫికెట్ లేదా ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్, కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల లోపుగా ఉండాలని సూచించారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సహా ఇతర గుర్తింపు పొందిన బోర్డుల విద్యార్థులు కూడా అర్హులేనని తెలిపారు. ప్రవేశాల విధానంలో 75 శాతం సీట్లు ఎస్సీ విద్యార్థులకు, 25 శాతం ఇతర వర్గాలకు కేటాయించినట్టు వెల్లడించారు. మెరిట్ ప్రకారం అర్హులైన వారికీ ప్రాతినిధ్యం కల్పించడమే తమ లక్ష్యమని ఆమె వివరించారు. ప్రత్యేక పరిస్థితుల్లో అర్హత ఉన్న విద్యార్థులకు మాత్రమే, సంబంధిత జిల్లా స్థాయి కమిటీల అనుమతి మేరకు అవసరమైన ధృవపత్రాలతో ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. సంక్షేమ గురుకులాల్లో విద్యార్థులకు ఆహార సరఫరా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టినట్టు వెల్లడించారు. పిల్లలకు నాణ్యమైన, పోషకాహార భోజనాలు అందించేందుకు కేంద్రీకృత కొనుగోలు విధానాన్ని ( సెంట్రలైజడ్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ) రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. కొత్త విధానంలో జిల్లా కలెక్టర్ల సమక్షంలో, జిల్లా కొనుగోలు కమిటీల పర్యవేక్షణలో డైట్ ప్రొవిజన్స్, కూరగాయలు వంటి వస్తువులు జిల్లా స్థాయిలో కొనుగోలు చేస్తారన్నారు. మాంసం వంటి వస్తువుల కోసం మండల స్థాయిలో టెండర్లు నిర్వహిస్తారనీ, అర్హత కలిగిన టెండర్లలో లాటరీ విధానాన్ని అనుసరించి విక్రేతల ఎంపిక జరుగుతుందని తెలిపారు. కొనుగోలు ప్రక్రియలో స్థానిక మహిళా సంఘాలు, మండల మహిళా సమాఖ్యలు, యువజన సంఘాలను భాగస్వాములుగా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
విద్యారంగంలో పారదర్శకతకు ప్రాధాన్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES