నిర్దేశించుకున్న లక్ష్యంలో 83.16 శాతం పూర్తి
ప్రస్తుత ఆర్థికంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రూ.7,097 కోట్ల ఆదాయం
గతేడాదితో పోలిస్తే 2.70శాతం వృద్ధిరేటు
91,637 ఈవీలకు రూ.769.81కోట్ల పన్ను మినహాయింపు
కాలుష్యరహిత రవాణాపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర రవాణశాఖ ఆర్థికంగా పుంజుకుంటోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆశాజనకమైన ఆదాయాన్ని నమోదు చేసింది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా ఆదాయాన్ని ఆర్జించడంలో శాఖ అధికారులు సఫలీకృతమయ్యారు. ప్రధానంగా శాఖాపరంగా చేపట్టిన పక్కా ప్రణాళికలు, పౌర సేవల్లో పారదర్శకత ఫలితంగా ఆదాయం ఆశించిన స్థాయిలో నమోదు అయింది.
లక్ష్యం దిశగా పరుగులు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రవాణా శాఖ రూ.8,535 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకోగా.. ఇప్పటివరకు రూ.7,097.38 కోట్లు సమకూరాయి. అంటే నిర్ణీత లక్ష్యంలో రవాణా శాఖ 83.16 శాతం ఆదాయాన్ని ఇప్పటికే సాధించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈసారి 2.70 శాతం వృద్ధి రేటును నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.
పర్యావరణ హితం.. ఎలక్ట్రిక్ వాహనాలకు ఊతం
కాలుష్య నివారణే ధ్యేయంగా ప్రభుత్వం విద్యుత్ వాహనాల(ఈవీ) వినియోగాన్ని పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు రవాణా శాఖ ఈ ఏడాది రికార్డు స్థాయి మినహాయింపులు ఇచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు చేసిన 91,637 ఎలక్ట్రిక్ వాహనాలపై రూ.769.81 కోట్ల జీవిత కాలపు పన్నును ప్రభుత్వం మినహాయించింది. ఇది పర్యావరణ పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి నిదర్శనమని, ప్రోత్సాహకాల కారణంగా వాహనదారుల్లో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ఆసక్తిని పెంచుతున్నాయని ఆ శాఖ అధికార వర్గాల సమాచారం.
ముందుకు సాగుతున్న రవాణ శాఖ
పన్నుల వసూళ్లే కాకుండా, నిబంధనలు పాటించని వాహనదారులపై కూడా రవాణశాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. దీనివల్ల క్రమశిక్షణ పెరగడమే కాకుండా, చలాన్లు, తనిఖీల ద్వారా గణనీయమైన ఆదాయం సమకూరుతోంది. రానున్న నెలల్లో మిగిలిన లక్ష్యాలను కూడా సకాలంలో పూర్తి చేసేందుకు రవాణా శాఖ పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోంది. టెక్నాలజీని వాడుకుంటూ పౌరులకు మెరుగైన సేవలు అందించడమే తమ ప్రాధాన్యతని రవాణా శాఖ స్పష్టం చేసింది.
ఆదాయం ఏ రూపంలో ఎంతంటే..
ప్రధానంగా జీవిత కాలపు పన్ను రూపంలో అత్యధిక ఆదాయం సమకూరింది. వివిధ విభాగాల వారీగా ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. జీవిత కాలపు పన్ను రూపంలో రూ.4,714.63 కోట్లు రాగా, త్రైమాసిక పన్నుల రూపంలో రూ 961.02 కోట్లు, ఫీజులు, సర్వీస్ చార్జీల ద్వారా రూ.820.09 కోట్లు వచ్చాయి. చలాన్ల రూపంలో రూ.310.80 కోట్లు, తనిఖీల ద్వారా రూ.212.49 కోట్లతోపాటు గ్రీన్‌ట్యాక్స్ రూపంలో రూ.78.35 కోట్లు ఆర్జించింది.



