- చెత్త ఆటోలో కుర్చీలు, కూలర్లు తరలించడంపై స్థానికుల ఆరోపణలు
- నవతెలంగాణ-రాయికల్
- రాయికల్ పట్టణంలో మున్సిపల్ సామాగ్రిని రాత్రి వేళలో చెత్త తరలించే ఆటోలో తీసుకెళ్తున్న ఘటనపై స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గతంలో అద్దెకు తీసుకున్న పాత మున్సిపల్ భవనంలో మిగిలిపోయిన కుర్చీలు, కూలర్లు,స్టూల్లు వంటి సామాగ్రిని రాత్రి సమయంలో తరలిస్తున్నట్లు వారు చెబుతున్నారు.
మున్సిపల్‌లో పనిచేసే ఓ ఉద్యోగి గుట్టుచప్పుడు కాకుండా పాత భవనంలో ఉన్న సామాగ్రిని కొత్త మున్సిపల్ భవనానికి తరలిస్తున్నామని చెప్పి,వాస్తవానికి వాటిని బయట వ్యక్తులకు విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెత్త తరలించే ఆటోలోనే ఈ సామాగ్రిని తరలించడం అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు.
ఈ ఆరోపణలపై మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజును నవతెలంగాణ వివరణ కోరగా.. పాత భవనం యజమాని ఖాళీ చేయాలని కోరడంతో మధ్యాహ్న సమయంలో కొంత సామాగ్రిని తరలించిన విషయం వాస్తవమేనని తెలిపారు. సామాగ్రిని కొద్దికొద్దిగా కొత్త భవనానికి తరలిస్తున్నామని, అయితే రాత్రి వేళలో తరలింపు విషయంపై తనకు స్పష్టత లేదని చెప్పారు. ఏవైనా అవకతవకలు జరిగితే విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.



