నవతెలంగాణ – జడ్చర్ల: 44వ జాతీయ రహదారి మాచారం పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైడ్రోక్లోరిన్ యాసిడ్ లోడ్ తో వెళ్తున్న ట్యాంకర్ ను వెనుక నుండి జగన్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ట్యాంకర్ లోని కెమికల్ మంటలు అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. జడ్చర్ల పట్టణ సీఐ కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం… చిత్తూరు నుండి హైదరాబాద్ కు 26 మంది ప్రయాణికులతో బయలుదేరింది జగన్ ట్రావెల్ బస్సు. జడ్చర్ల పట్టణంకి చేరుకోగానే మాచారం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ముందుగా వెళుతున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ ను వెనక నుండి జగన్ ట్రావెల్ బస్సు వేగంగా ఢీకొంది.
దీంతో ట్యాంకర్ కెమికల్ లీకై రోడ్ మీద పడడంతో పొగలు కముకున్నాయి. వెంటనే తేరుకున్న బస్సు డ్రైవర్ బస్సులో ప్రయాణికులను అప్రమత్తం చేయగా అందరూ ఎగ్జిట్ డోర్ల ద్వారా కిందికి దిగారు. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కెమికల్ లీకేజీ ద్వారా వస్తున్న పొగలను అదుపులోకి తెచ్చారు.
విషయం తెలిసిన పట్టణ సీఐ కమలాకర్ ఘటనా స్థలానికి చేరుకొని ఇరువైపులా ట్రాఫిక్ ను నిలిపివేసి బస్సు ప్రమాద బాధితులను మరో వాహనంలో హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనతో 44వ జాతీయ రహదారి పై ఇరువైపులా సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామైంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలతో హడలెత్తిన ప్రజలు మరోసారి జడ్చర్లలో బస్సు ప్రమాదం జరిగి బస్సులో పొగలు వస్తుండడంతో మరో ఘోర ప్రమాదం జరిగిందోనని ఒకింత తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అటు పోలీస్ అధికారులతో పాటు పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.



