ఎయిర్ ఇండియాకు రూ.1 కోటి జరిమానా
న్యూఢిల్లీ : సాధారణంగా అనుమతి పత్రాలు లేకుండానే బస్సులు, ఆటోలు లాంటి వాహనాలను మాత్రమే తిప్పడం, ప్రమాదాల బారిన పడటాన్ని చూస్తుంటాం. కానీ భారత్‌లో అప్పుడప్పుడు విమానాలు కూడా సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా పలు రూట్లలో తిరుగుతు న్నాయి. ఈ కోవలోనే ఎయిరిండియా విమాన ఘటన రుజువు చేస్తోంది. అవసరమైన ఎయిర్‌వర్తీనెస్ సర్టిఫికేషన్ (ఏఆర్‌సీ) లేకుండా ఎయిర్‌బస్ ఎ320 నియో విమానాన్ని నడిపినందుకు టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.1 కోటి జరిమాన విధించింది. గతేడాది కనీసం ఎనిమిది రూట్లలో విమనాన్ని తిప్పిందనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్టు డిసెంబర్ 2న డైరెక్టరేట్ డీజీసీఏ ప్రకటన చేయగా.. తాజాగా జరిమానా విధించినట్టు ఆ వర్గాలు తెలిపాయి.
‘2025లో స్వచ్ఛందంగా నివేదించబడిన ఒక ఘటనకు సంబంధించి డీజీసీఏ జారీ చేసిన ఉత్తర్వును అంగీకరిస్తున్నాం. గుర్తించిన లోపాలన్నీ ఇప్పటికే పరిష్కరించబడ్డాయి. అధికార యంత్రాంగం తో చర్చించడం జరిగింది” అని ఎయిరిండియా తెలిపింది. ఏఆర్‌సీ అనేది విమానం నిర్వహణ రికార్డులు, ఫిట్‌నెస్ ప్రమాణాలకు అనుగుణంగా సమగ్రంగా సమీక్షించిన తర్వాత ఏటా ఈ సర్టిఫికెట్ జారీ చేయబడుతుంది. 2025 నవంబర్ 26తో గడువు ముగిసిన ఎయిర్‌వర్తీనెస్ రివ్యూ సర్టిఫికేట్‌తో ఎయిర్‌బస్ ఎ320 నియోను ఎనిమిది రెవెన్యూ సెక్టార్‌లలో ప్రయాణికులతో కూడిన సర్వీసులు కొనసాగించినట్టు ఎయిరిండియా స్వయంగా తెలిపింది.



