సీఎం హింసను ప్రోత్సహిస్తున్నారు : మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మోసాలు చేయడం, ద్రోహం చేయడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డీఎన్‌ఏలోనే ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో విమర్శించారు. సమైక్యవాదుల కొమ్ముకాస్తూ, స్వరాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కు పెట్టిన చరిత్ర ఆయనదని ఆరోపించారు. చంద్రబాబు తరపున ఎమ్మెల్యేల ను కొనేందుకు నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడని తెలిపారు. సీఎం పదవి అనుభవిస్తూనే, కేంద్రంలోని బీజేపీతో చీకటి స్నేహాలు చేస్తూ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వంచిస్తున్నాడని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా బనకచర్ల లాంటి ప్రాజెక్టుల కోసం పొరుగు రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తున్నాడని విమర్శించారు.
ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ జెండా దిమ్మెలను కూల్చాలని ఒక ముఖ్యమంత్రి బహిరంగంగా పిలుపునివ్వడమంటే రాష్ట్రంలో శాంతిభద్రతలను ప్రత్యక్షంగా దెబ్బతీయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులు, ఆస్తుల విధ్వంసానికి పిలుపునివ్వడం రేవంత్ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఇలాంటి చర్యలతో తెలంగాణలో అరాచకాన్ని సృష్టించాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డిలు తప్పు పట్టారు. సీఎంపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



