– గవర్నర్‌కు గిరిజన సంఘాల వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 2027 జనాభా లెక్కల్లో గిరిజన తెగలకు సంబంధించి మతం కాలమ్‌లో షెడ్యూల్ ట్రైబ్ లేక ప్రకృతి ఆరాధకులుగా ప్రత్యేక క్యాటగిరీగా గుర్తించాలని గవర్నర్‌కు గిరిజన సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, తెలంగాణ గిరిజన సంఘం నేతలు మాజీ పార్లమెంట్ సభ్యులు మిడియం బాబూరావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, ఉపాధ్యక్షులు బండారు రవికుమార్, టీజీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరాంనాయక్ గవర్నర్‌ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. రాష్ట్రంలో 33 తెగల గిరిజనులున్నారనీ, వీరు ప్రధానంగా ఐదో షెడ్యూల్ ప్రాంతంలో 1180 షెడ్యూల్డ్ గ్రామాలు, మైదాన ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో నివసిస్తున్నారని తెలిపారు. ఆదివాసీ గిరిజన తెగల్లో కోయ, గోండి, కొలామి, లంబాడా, ఎరుకల భాషలను వారి సొంత మాండలికాల్లో మాట్లాడుతారని పేర్కొన్నారు. వీరు మాట్లాడే భాషలకు లిపి లేకపోవడం వల్ల వాటి ఉనికి దెబ్బతింటున్నదని తెలిపారు. ఆదివాసీ గిరిజన తెగలు తరతరాలుగా పూర్వీకుల నుండి కొండలు, నదులు, చెట్లు, జంతువులు, ప్రకృతిని దైవంగా కొలుస్తారని గుర్తు చేశారు. ఇవి వారి వారి తెగల సంప్రదాయ మతపరమైన ఆచారాలుగా కొనసాగుతున్నాయని తెలిపారు. వీరు విగ్రహారాధన కాకుండా ప్రకృతినే ఆరాధ్య దైవంగా కొలుస్తారని పేర్కొన్నారు.
తెగల సంస్కృతి, ఆచారాలు, క్రతువులు పాటిస్తూ ఇతర మతాల ఆచారాలకు దూరంగా ఉంటారని గుర్తు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా వారు ఇతర మతాల ప్రభావంలో పడుతున్నారనీ, దీనివల్ల ఆదివాసీ గిరిజన తెగల స్వంత సాంస్కృతిక, సామాజిక అస్థిత్వం ప్రమాదంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటివరకు జరిగిన జనాభా లెక్కల్లో ఇతర మతపరమైన ఆచారాలలో నమోదు చేయబడ్డారనీ, వారు వేర్వేరు ఆదివాసీ గిరిజన విశ్వాసాలు, ఆచారాలకు చెందినవారనే వాస్తవాన్ని ఇది అస్పష్టం చేస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2027లో చేపడుతున్న జనాభా లెక్కల్లో మతం అనే క్యాటగిరిలో షెడ్యూల్ తెగలు, ప్రకృతి ఆరాధకులుగా ప్రత్యేక కాలమ్‌ను చేర్చేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగు సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నాన్ షెడ్యూల్‌లో ఉన్న వెయ్యి గిరిజన గ్రామాలను షెడ్యూల్‌లో చేర్చాలని కోరారు. రాష్ట్రంలో ఐదో షెడ్యూల్ ప్రాంతానికి ఆనుకుని ఉన్న 50 శాతం నుండి 100శాతం గిరిజన జనాభా కలిగిన నాన్ షెడ్యూల్ గ్రామాలను షెడ్యూల్ ప్రాంతంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ గ్రామాల్లో గిరిజనులు ఐటీడీఏ పథకాలు పొందలేకపోతున్నారని తెలిపారు. వారి భూములకు 1/70, పీసా చట్టాల అమలుకు నోచుకోవడం లేదని గుర్తు చేశారు. తెగ సర్టిఫికెట్ పొందడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
గిరిజన తెగలను ప్రత్యేక క్యాటగిరీగా గుర్తించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES