ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్..
నవతెలంగాణ -జన్నారం
గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు అందరికీ ఆదర్శం అని,వాటికి సంబంధించిన రచనలు పుస్తకాలను భావి తరాలకు అందించేలా వాటిని మాతృ భాషలోకి అనువదించి భద్రపరచాలి అని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం హైద్రాబాద్ లోని గిరిజన సంక్షేమ శాఖ వారిచే నిర్వహించబడుతున్న గిరిజన సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణ సంస్థను సందర్శించారు.
అందులో ఉన్న రచనలు, పుస్తకాలను పరిశీలించారు.హైమన్ డార్ఫ్ అనే రచయిత గిరిజనుల గురించి, గిరిజనుల సంస్కృతి జీవిన విధానాలు గురించి రచించిన “ది రాజ్ గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్” అనే పుస్తకం చదివి ముగ్ధుడై భావి తరాలకు ఈ రచనలు, ఈ జ్ఞాన సంపద అందించేలా వాటిని స్థానిక భాషల్లోకి అనువదించి భద్రపరచాలి అని అధికారులను ఆదేశించారు. మన సంస్కృతి, జీవన విధానాలు భవిష్యత్ తరాలకు ఆదర్శం అని అన్నారు. లైబ్రరీలో ఉన్న గిరిజన కళాకృతులు, పెయింటింగ్ లను పరిశీలించి వాటి అమ్మకాలు ఎలా జరుగుతున్నాయి అని అడిగి తెలుసుకొన్నారు. ప్రజలకు చేరువ చేసే విధంగా గిరిజన ఉత్పత్తుల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని కోరినట్టు తెలిపారు.