– ప్రాణం పోయినా సరే ట్రాక్టర్ ఇవ్వాలి అని మూర్ఖంగా ప్రవర్తించిన బాబా పై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కే చంద్రశేఖర్
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లాలోని రాజంపేట ఫారెస్ట్ అధికారి బాబా వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాట్రాజ్ సుభాష్ ను సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు పరామర్శించి, మీకు మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దీనికి బాధ్యుడైన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకునేంతవరకు మీ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.
అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఫారెస్ట్ అధికారిగా ఉన్నటువంటి బాబా కాట్రోత్ సుభాష్ రాజంపేట మండలం జోగ్రం గుట్ట తండాకు చెందిన గిరిజన రైతులను గత కొంతకాలంగా డబ్బుల కోసం వేధిస్తున్నాడని తెలిపారు. ఆయనకు అనుకూలంగా లేకపోవడంతో పలుమార్లు తప్పుడు కేసులు పెట్టించి జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ, కోర్ట్ ఆర్డర్లు ఉన్నప్పటికీ, మీ కొట్టుతో మాకు సంబంధం లేదని, పాత కేసులు ఉన్నాయని, ఇసుక ట్రాక్టర్ ఇస్తావా.. డబ్బులు ఇస్తావా… బెదిరించారని తెలిపారు. అయినా సదరు రైతు ఇవ్వకపోవడంతో దీనిపైన ఏమీ అవగాహన లేని రాజంపేట ఎస్సై పోలీసులతో చేరుకొని ఓ స్మగ్లర్ రౌడీ షీట్లను ట్రీట్ చేసినట్టు ఇంటి చుట్టూ తిరుగుతూ గల్ల పట్టి తీసుకొచ్చి అందరి ముందు అవమానకరంగా ప్రవర్తించారని వెల్లడించారు.
అంతే కాకుండా చస్తే చావు.. మాకేంటని బెదిరించడం జరిగిందన్నారు. ఈ అవమానం భరించలేని కాట్రోత్ సుభాష్ వెంటనే పురుగుల మందు తాగి పడిపోయాడు. అయినా ఈ ప్రాణం పోతే మాకేంది.. నీ ట్రాక్టర్ కావాలి అని వేధించి మూర్ఖంగా ప్రవర్తించిన ఇతనిపై జిల్లా ఎస్పీ ఈ కేసును సుమోటో కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఫారెస్ట్ అధికారులకు గతంలో ప్రజా సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అనేకసార్లు ఇతని ప్రవర్తన గురించి విన్నవించినప్పటికీ అధికారులు అవి పెడచెవులో పెట్టి ఈరోజు అమాయక గిరిజన రైతు ప్రాణం మీదికి తీసుకువచ్చారని, అతడికి ఏమి జరిగినా ఫారెస్ట్ అధికారి బాబా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం అన్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఇదే బాబా అడవి సంపదను అమ్ముకుంటున్నాడని, ఇంతకుముందు మహిళలను బూతులు మాట్లాడి, రావే పోవే.. పక్కలోకి రమ్మన్నారని గిరిజన మహిళలు బహిరంగంగానే ఆరోపణలు చేశారు. చట్టం అని చెప్పుకున్న తిరిగే అధికారులు ఈయనపై చర్యలు తీసుకోవాలని ఈ సమస్యపై జిల్లా వ్యాప్త ఉద్యమాన్ని నిర్మిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మోహన్, రజనీకాంత్, భాను, దశరథ్, కాట్రో రవి, కాట్రోతి జయరాం తదితరులు పాల్గొన్నారు.