రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురి సంతాపం
మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించిన జార్ఖండ్ ప్రభుత్వం
న్యూఢిల్లీ : జార్ఖండ్ మాజీ ముఖ్మమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపకుల్లో ఒకరైన శిబూ సోరెన్ (81) సోమవారం కన్నుమూశారు. ఆయన కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోషల్ మీడియా పోస్టు ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. కిడ్నీ సంబంధిత సమస్యతో శిబూ సోరెన్ నెల రోజులకు పైగా దేశ రాజధానిలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత 38ఏండ్లుగా జార్ఖండ్ ముక్తి మోర్చా నేతగా కొనసాగుతున్న శిబూను పార్టీ వ్యవస్థాపక పోషకుడుగా గుర్తించారు. ఆయన మృతికి సంతాపసూచకంగా జార్ఖండ్ ప్రభుత్వం మూడు రోజులు సంతాపదినాలు ప్రకటించింది. శిబూ గౌరవార్ధం మంగళవారం ప్రభుత్వ పాఠశాలలు మూతపడనున్నాయి. జేఎంఎం పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ పతాకాన్ని అవనతం చేశారు. ఆయన మృతి వార్త తెలియగానే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, కేరళ, తెలంగాణా సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు సంతాపం ప్రకటించారు. ప్రధాని, రాష్ట్రపతి, ప్రతిపక్ష నేతలు ఆస్పత్రికి వెళ్ళి భౌతికకాయాన్ని సందర్శించారు. ఆదివాసీల హక్కుల కోసం, సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేసిన నేత అని కొనియాడారు. జార్ఖండ్ ప్రజల మనస్సుల్లో ఆయన ఎప్పటికీ నిలిచిపోతారని పేర్కొన్నారు. శిబూ భౌతిక కాయం ప్రత్యేక విమానంలో సోమవారం సాయంత్రానికల్లా రాంచి చేరుకుంది. వెంట ముఖ్యమంత్రి హేమంత్‌సోరెన్ దంపతులు వున్నారు. విమానాశ్రయం వెలుపల, రహదారుల పొడవునా వేలాదిమంది ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు తమ ప్రియతమ నేతకు నివాళులు అర్పించేందుకు వేచివున్నారు. ప్రజా నేత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటుకు ఆయన చేసిన విశేష కృషిని గుర్తు చేసుకున్నారు.
ఆదివాసీ నేత, జార్ఖండ్ మాజీ సీఎం శిబూ సోరెన్ కన్నుమూత
- Advertisement -
- Advertisement -