Thursday, February 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం12న దేశవ్యాప్త సమ్మెకు గిరిజన సంఘాల సంపూర్ణ మద్దతు

12న దేశవ్యాప్త సమ్మెకు గిరిజన సంఘాల సంపూర్ణ మద్దతు

- Advertisement -

వీబీ జీఆర్‌ఏఎంజీ’ని రద్దు చేయాలి : ఎస్వీకేలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఈనెల 12న కార్మిక సంఘాలు తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మెకు గిరిజన సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రప్రభుత్వం రద్దు చేయడాన్ని నిరసించాయి. ఈ ఇదే అంశంపై బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మనాయక్‌ అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ శ్రీరాంనాయక్‌ సమావేశ తీర్మానాన్ని ప్రవేశ పెడుతూ కేంద్రం కోట్లాది మంది గిరిజనులు, దళితులు, పేదల ఉపాధి హామీ హక్కులను కాలరాసేలా ఆ చట్టాన్ని రద్దు చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది ఆదివాసీ, గిరిజన కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా తీసుకొచ్చిన వీబీ జీ రామ్‌జీ కార్పొరేట్లు, భూస్వాములు, ధనవంతుల ప్రయోజనాలను కాపాడేలా ఉందన్నారు. గత చట్టంలో 90 శాతం నిధులు కేంద్రమే భరించేదని తెలిపారు. కానీ నూతన చట్టంలో 60 శాతం నిధులే ఇస్తామని మిగిలిన 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలనే నిబంధన ఉపాధి హామీని సమాధి చేయడమేనన్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. వ్యవసాయ సీజన్‌ కాలంలో 60 రోజులపాటు ఉపాధి పనులను నిలిపివేయాలనడం సరైందికాదన్నారు. నోటిఫై చేసిన ప్రాంతాల్లోని పనులు కల్పించాలనే నిబంధనలతో 125 రోజులు పని కల్పిస్తామనే హామీ బూటకమన్నారు. మహాత్మా గాంధీని చంపిన గాడ్సే వారసులే అధికారంలో ఉండటంతో పేరును తొలగించి బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీని మరోసారి హత్య చేసిందని విమర్శించారు. కొత్తగా తీసుకొచ్చిన వీబీ జీ రామ్‌జీ పథకాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో గిరిజన సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్‌ అంజయ్య నాయక్‌ మాట్లాడుతూ గిరిజనులను మరింత పేదరికంలోకి నెట్టేలా కేంద్రం ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసిందన్నారు. ఆనాటి యూపీఏ ప్రభుత్వంపై వామపక్ష పార్టీల ఒత్తిడి వలన పోరాడి సాధించిన ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం పేదల ఉపాధి హామీని హరించడమేనని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌. వెంకట్రాములు మాట్లాడుతూ రాష్ట్రంలో 60 లక్షల మంది ఉపాధి హామీ పథకం కింద జాబు కార్డులు కలిగి ఉన్నారని తెలిపారు. ఉపాధి హామీ చట్టం రాకముందు దళితులు, గిరిజనులు పేదలు సుదూర ప్రాంతాలు, పట్టణాలకు వలసలు వెళ్లేవారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక గ్రామాల్లో అంబలి కేంద్రాలు వెలిసేవనీ, అటువంటి పరిస్థితి నుంచి ఉపాధి హామీ చట్టం 2006లో వచ్చిన తర్వాత పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడి వలసల నివారణకు దోహదపడిందని ఎన్నో నివేదికలు గుర్తించాయని తెలిపారు. తెలంగాణ ప్రదేశ్‌ ఎరుకల హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.రఘు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల హక్కులను కాలరాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఆల్‌ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు టి మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ గిరిజనులకు తీవ్ర ఇబ్బందులు కలిగే చేసే విధంగా ఉపాధి హామీ చట్టాన్ని రద్దు కోసం ఈనెల 12 జరగనున్న దేశ వ్యాప్త సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో షెడ్యూల్‌ ట్రైబ్‌ ఓయూ జేఏసీ నాయకులు రవీందర్‌ నాయక్‌, సురేష్‌ నాయక్‌, ఆల్‌ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్కినాయక్‌, విష్ణు నాయక్‌, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌, డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటా రమేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు రజనీకాంత్‌, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం బాలునాయక్‌, రంగారెడ్డి జిల్లా నాయకులు ఎం.గోపీ నాయక్‌ తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతనం కొన్ని తీర్మానాలు ఆమోదించారు. ‘నెల 5 నుంచి 10 వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించాలనీ, 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా మండల కేంద్రాల్లో నిరసనలు తెలపాలనీ, 18 నుంచి తండాలల్లో ప్రచార యాత్రలు, ఉపాధి పనులు చేసే గిరిజన కూలీలతో సమావేశాలు, ఆందోళనలు నిర్వహించాలి’ అని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -