అంతర్గాం టీటీఎస్ గ్రామంలో ఘటన
ఐదుగురిపై అట్రాసిటీ కేసు నమోదు
విచారణ చేస్తున్నాం : ఏసీపీ మర్ద రమేష్
నవతెలంగాణ-రామగుండం
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం టీటీఎస్ గ్రామ సర్పంచ్‌గా ఇటీవల ఎన్నికైన అంగోతు రవినాయక్‌పై అదే గ్రామానికి చెందిన ప్రత్యర్థి, అతని అనుచరులు దాడి చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసులు నమోదయ్యాయి. ఇందుకు సంబంధించి ఏసీపీ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14న రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో రవినాయక్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శంకర్‌రెడ్డిపై 78 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. గెలుపు అనంతరం సర్పంచ్ రవినాయక్ గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలుపుతూ ర్యాలీ తీస్తుండగా శంకర్‌రెడ్డి, అతని అనుచరులు గీట్ల సంతోష్‌రెడ్డి, సాగర్‌రెడ్డి, సాయి కిషోర్ గౌడ్, సత్తయ్య గౌడ్ దాడి చేశారు. కులం పేరుతో దూషిస్తూ దాడికి దిగడంతోపాటు మరణాయుధాలు సైతం తీసుకొచ్చినట్టు రవినాయక్ పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే, తమపైనా రవినాయక్, ఆయన అనుచరులు ప్రతిదాడి చేశారని శంకర్‌రెడ్డి అనుచరులు కౌంటర్ ఫిర్యాదు చేయగా.. పోలీసులు రవినాయక్‌పైనా కేసు నమోదు చేశారు. దీనిపై రవినాయక్ మాట్లాడుతూ.. గెలుపును జీర్ణించు కోలేని కొంతమంది శంకర్‌రెడ్డిని రెచ్చగొట్టి తనపై కులంపేరుతో దూషించి దాడి చేశారన్నారు. ఈ దాడిని ప్రతిఘటిస్తే.. వారిపై దాడి చేసినట్టు ఆరోపిస్తూ తనపై శంకర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు. పోలీసులు సరైన విచారణ చేపట్టి న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, కానీ వ్యక్తిగతంగా తీసుకొని దాడులకు పాల్పడితే ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం నెరవేరదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులను ఎవరూ ప్రోత్సహించొద్దని విన్నవించారు. ఈ ఘటనలో నిందితులపై అట్రాసిటీ కేసు నమోదైనట్టు గోదావరిఖని ఏసీపీ మర్ద రమేష్ తెలిపారు.
గిరిజన సర్పంచ్‌పై దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



