Saturday, September 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగిరిజన ఉపాధ్యాయులకు పదోన్నతులివ్వాలి

గిరిజన ఉపాధ్యాయులకు పదోన్నతులివ్వాలి

- Advertisement -

టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి డిమాండ్‌
గిరిజన సంక్షేమ కార్యాలయం వద్ద ధర్నా


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలంటూ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌ యూటీఎఫ్‌) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి మాట్లాడుతూ పండిట్‌, పీఈటీ పోస్టులను అప్‌ గ్రేడ్‌ చేయాలనీ, అప్‌ గ్రేడెడ్‌ ఆశ్రమ పాఠశాలలకు పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు ఉపాధ్యాయులకు (సీఆర్టీలకు) ఐదు నెలలుగా బకాయి పడిన వేతనాలు చెల్లించాలని తదితర సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వేసవి సెలవులకు ముందు నుంచి అనేక ప్రాతినిధ్యాలు చేసినా ప్రమోషన్ల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. స్కూల్‌ ఎడ్యుకేషన్‌లో పండిట్‌ పీఈటీ పోస్టులు అప్‌గ్రేడ్‌ చేసినా కేవలం 400 పోస్టులు ఉన్న గిరిజన పాఠశాలల్లో అప్‌గ్రేడ్‌ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

ఐదు నెల్లుగా సీఆర్టీలకు జీతాలు ఇవ్వకుంటే వారెలా బతకాలో చెప్పాలని నిలదీశారు. టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ వెంకట్‌ మాట్లాడుతూ ప్రజాపాలనలో కూడా పోలీసు నిర్బంధం కొనసాగుతోందని గుర్తు చేశారు.టీఎస్‌యూటీఎప్‌ నాయకులను, కార్యకర్తలను హౌస్‌ అరెస్టు, ప్రివెంటివ్‌ అరెస్టు పేరుతో హైదరాబాద్‌ రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. అరెస్టులకు భయపడేది లేదనీ, సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం గిరిజన సంక్షేమ అధికారులు సంఘం ప్రతినిధి బృందాన్ని పిలిచి చర్చలు జరిపారు. సంక్షేమ శాఖ మంత్రి, కార్యదర్శితో చర్చించి పదోన్నతుల ప్రక్రియను ప్రారంభిస్తామనీ, సీిఆర్టీల కొనసాగింపు ఉత్తర్వులు ఇచ్చామనీ, రెండు రోజుల్లో వేతనాలు విడుదల చేస్తామనీ, అప్‌గ్రేడేషన్‌, నూతన పోస్టుల మంజూరుపై ఆర్థిక శాఖకు మరోసారి ప్రతిపాదనలు పంపుతామని చెప్పారు. అనంతరం సచివాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ కుమార్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌ లను కలిసి సమస్యలపై చర్చించారు. రాష్ట్ర కార్యదర్శి వెంకటప్ప, రాష్ట్ర కమిటీ సభ్యులు రాందాస్‌, కిషోర్‌ సింగ్‌, పి నాగేశ్వరరావు, టి బాలు, డి శ్రీనివాస్‌, డి నాగేశ్వరరావుతోపాటు పలువురు గిరిజన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -