నవతెలంగాణ – బజార్ హాత్నూర్
సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలు ఆదివాసీ గ్రామాలు అని ఎంపీ గోడం నగేష్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం మండలంలోని జాతర్ల గ్రామంలోని మినీ స్టేడియంలో దండారి (గుస్సాడీ) సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గుస్సాడీ ల వాయిద్యాలకు ముందుగా పూజలు నిర్వహించి గుస్సాడి నృత్యాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ అడవి బిడ్డల సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా దండారి ఉత్సవాలు ఉన్నాయని, గుస్సాడీ నృత్యాలు ఎంతో కనువిందు చేశాయని, ఆదివాసీ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను సాధ్యమైనంత వరకు త్వరితగతిన పరిష్కరిస్తానని ఆయన పేర్కొన్నారు.
అనంతరం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజాన్ మాట్లాడుతూ.. ఆదివాసీ యువకులు అన్ని రంగాల్లో రాణించాలని, ఆదివాసుల సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడే బాధ్యత ప్రతి యువకుడి పైన ఉందని పేర్కొన్నారు. అనంతరం ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ ప్రతి ఏడు దీపావళి పండుగను పురస్కరించుకొని మండలంలోని అన్ని గ్రామాల దండారి దండారి లతో కలిసి జాతర్ల గ్రామం లో పెద్ద ఎత్తున దండారి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందం కలిగిస్తుందని, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఆయన ధన్యవాదాలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి పెందూర్ ఈశ్వర్, ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం చైర్మన్ మేకల వెంకన్న, మండలంలోని ఆయా గ్రామాల పటేళ్లు, సార్ మెడీలు, నాయకులు అల్క గణేష్, నాణం రమణ తదితరులు పాల్గొన్నారు.
