– నెల కిందట కువైట్ లో ఆచూకీ లేకుండా పోయిన ఈశ్వర
– ప్రజాభవన్ ప్రవాసి ప్రజావాణిలో విన్నవించిన కుటుంబ సభ్యులు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని హాస కొత్తూర్ గ్రామానికి చెందిన గిరిజన యువకుడు ఈశ్వర్ రాష్ట్ర ప్రభుత్వ చొరవతో మంగళవారం స్వదేశానికి చేరుకున్నాడు. గత నెల రోజుల కిందట కువైట్ దేశంలో భూక్య ఈశ్వర్ ఆచూకీ లేకుండా పోయాడు. విషయం తెలియకపోవడంతో ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు అయోమయానికి గురయ్యారు. కువైట్ లో ఈశ్వర కనిపించకుండా పోయిన విషయాన్ని అతని భార్య సుగుణ గ్రామానికి చెందిన స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా స్థానిక బాల్కొండ నియోజకవర్గం ఇన్చార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.
ఆయన సూచనల మేరకు కువైట్ లో ఆచూకీ లేకుండా పోయిన ఈశ్వర్ కుటుంబ సభ్యులను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కిషన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పడిగెల ప్రవీణ్ హైదరాబాద్ తీసుకువెళ్లాడు. ప్రజాభవన్ లో ప్రవాసి ప్రజావాణిలో ఇన్చార్జిగా ఉన్న రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, రాష్ట్ర గల్ఫ్ అడ్వైజరి కమిటీ వైస్ చైర్మన్ మంద భీమ్ రెడ్డి లను కలిసి వినతి పత్రం అందజేశారు. వెంటనే వారు సంబంధిత ప్రభుత్వ అధికారులకు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. దీనికి ప్రభుత్వం స్పందించి అక్కడ కువైట్లో ఉన్న మన దేశ ఎంబసీ అధికారులతో మాట్లాడారు. వారు కువైట్ అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లగా అక్కడి పోలీసుల చెరలో ఉన్న ఈశ్వర్ ఆచూకీ కనుగొన్నారు.
ఎంబసీ అధికారులు కువైట్ అధికారులతో మంతనాలు జరిపి ఈశ్వర్ ను స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేశారు. నెల రోజుల క్రితం ఆచూకీ లేకుండా పోయిన ఈశ్వర్ ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వ చొరవతో క్షేమంగా స్వదేశానికి, స్వగ్రామానికి చేరుకున్నాడు. ఇంటికి చేరిన ఈశ్వర్ ను కిషన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పడిగెల ప్రవీణ్ వారి ఇంటికి వెళ్లి యోగక్షేమాలని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఈశ్వర్ భార్య సుగుణ మాట్లాడుతూ తన భర్త స్వగ్రామానికి రావడానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.



