నవతెలంగాణ ఆర్మూర్ : దేశ స్వాతంత్ర్యం కోసం అలుపెరగని పోరాటం చేసి అమరులైన భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్‌గురుకి 95వ వర్ధంతిని పట్టణంలోని యానం గుట్ట సుందరయ్య కాలనీలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి కూతాడి ఎల్లయ్య మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య పోరాటంలో వీరి త్యాగాలు చిరస్మరణీయమని తెలిపారు. బ్రిటిష్ పాలనలో జరిగిన అణచివేతలకు వ్యతిరేకంగా యువ విప్లవకారులు పోరాడిన విధానం ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుందని అన్నారు.
1919 ఏప్రిల్ 13న పంజాబ్ రాష్ట్రంలోని జలియన్‌వాలా బాగ్‌లో బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ ఆధ్వర్యంలో జరిగిన కాల్పుల్లో వేలాది నిరపరాధులు మరణించడం దేశ చరిత్రలో విషాదకర ఘట్టమని పేర్కొన్నారు. లాలా లజపత్ రాయ్ మరణానికి కారణమైన ఘటనకు ప్రతీకారంగా భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లు బ్రిటిష్ అధికారిపై దాడి చేయగా, బ్రిటిష్ ప్రభుత్వం వీరిని అరెస్ట్ చేసి 1931 మార్చి 23న ఉరి శిక్ష అమలు చేసింది. అనంతరం వారి శవాలను కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా నదిలో పడవేయడం జరిగింది. వారి ఆశయాలు, ఆలోచనలు మనందరం కొనసాగించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
అలాగే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ప్రతి మహిళకు ₹2500 ఆర్థిక సహాయం అందించాలని, ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ₹12,500 జీవన భృతి ఇవ్వాలని కోరారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగ క్యాలెండర్‌ను వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. అలాగే అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు భూమన్న, సుందరయ్య కాలనీ శాఖ కార్యదర్శి శాయిదా బేగం, సాయిలు, చుక్కల పద్మ, మస్రత్ బేగం, రజియా, సమీరా, షాబీరా బేగం, వాజిద్ అలీ, కుమార్ తదితరులు పాల్గొన్నారు.



