Tuesday, October 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంత్రిబుల్‌ ఆర్‌ బాధిత రైతులు, సీపీఐ(ఎం) నేతల అరెస్ట్‌

త్రిబుల్‌ ఆర్‌ బాధిత రైతులు, సీపీఐ(ఎం) నేతల అరెస్ట్‌

- Advertisement -

హెచ్‌ఎండీఏ ఎదుట ధర్నాకు వెళ్లకుండా అడ్డగింత
నవతెలంగాణ- విలేకరులు

త్రిబుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చాలంటూ బాధిత రైతులు సోమవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ ఎదుట ధర్నాకు తరలివెళ్తుండగా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉదయమే సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీని హైదరాబాద్‌లో కొద్దిసేపు హౌస్‌ అరెస్టు చేశారు.
యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలంలో త్రిబుల్‌ఆర్‌ బాధిత రైతులు, సీపీఐ(ఎం) నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో సీపీఐ(ఎం)నాయకులు దోనూరు నర్సిరెడ్డి, జి.శ్రీనివాసచారి, దోడయాదిరెడ్డి, కడతాల భిక్షం, బద్దుల వెంకటయ్య, గాజుల అంజయ్య, సుదర్శనాచారి, రైతులు పల్లె పుష్పారెడ్డి, పల్లె పుల్లారెడ్డి, గుండె మల్లేష్‌, వర్థం నాగార్జున తదితరులు ఉన్నారు.

భువనగిరి పట్టణంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధను పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో సీపీఐ(ఎం) పట్టణ వన్‌ టౌన్‌ కార్యదర్శి డాక్టర్‌ మల్లు గౌతమ్‌రెడ్డిని, సోషల్‌ మీడియా రాష్ట్ర నాయకులు ఎండి అంజద్‌ ఉన్నారు. మర్రిగూడ మండలంలో సీపీఐ(ఎం) నాయకులను, త్రిబుల్‌ఆర్‌ భూనిర్వాసితులను పోలీసులు అరెస్టు చేశారు.
సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం సామలపల్లిలో రింగ్‌రోడ్డు కోసం భూములు కోల్పోయిన రైతులు.. హెచ్‌ఎండీఏ ఎదుట ధర్నాకు వెళ్లకుండా పోలీసులు ముందుస్తు అరెస్టు చేశారు. రైతుల అరెస్టులను సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య ఖండించారు. రింగ్‌రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని, అలైన్‌మెంట్‌ మార్చాలని డిమాండ్‌ చేశారు.

త్రిబుల్‌ ఆర్‌ రోడ్డు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హెచ్‌ఎండీఏ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వగా.. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల నుంచి పార్టీ నాయకులు, బాధిత రైతులు పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. షాద్‌నగర్‌, ఆమనగల్‌, మాడుగుల, తలకొండపల్లి, వికారాబాద్‌ జిల్లా వివిధ మండలాల నుంచి పార్టీ నాయకులు, భూ నిర్వాసిత రైతులు తరలివెళ్లారు. ఈ క్రమంలో తలకొండపల్లిలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గుమ్మడి కురుమయ్యతోపాటు పలువురిని అరెస్టు చేసి స్థానిక పీఎస్‌కు తరలించారు. బొంరాస్‌పేటలో జిల్లా నాయకులు బుస్స చంద్రయ్యను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -