పెద్దల కోసం పేద రైతులను బలి చేయొద్దు
భూములు కోల్పోతున్న రైతులకు భూమికి భూమి ఇవ్వాలి
27న సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ధర్నాను జయప్రదం చేయండి : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
త్రిబుల్ ఆర్ అలైన్‌మెంట్ వెంటనే మార్చి రైతులకు న్యాయం చేయాలని సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కొండాపూర్ మండలం మారేపల్లి, రాంపూర్ తండా, శివ్వన్న గూడెం గ్రామాల్లో త్రిబుల్ ఆర్‌లో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశ మయ్యారు. పచ్చని పంటలు పండే ఈ చేను వదిలి మేము ఎలా బతకాలని సీపీఐ(ఎం) నాయకులతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవనాధారమయిన పొలాలు విడిచి తాము ఉండలేమని, తమ ప్రాణాలైనా వదులుతాము కానీ భూములు వదులుకోబోమని రైతులు తెలిపారు. ఈ సందర్బంగా జయరాజు మాట్లాడుతూ.. త్రిబుల్ ఆర్‌లో పెద్దల భూముల కోసం పేద రైతులను బలి చేయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రైతులు ధైౖర్యంగా ఉండాలని, మీకు అండగా సీపీఐ(ఎం) ఉంటుందని తెలిపారు. పెద్దల భూములు కాపాడటా నికి మండలంలో అత్యధికంగా బడుగు, బలహీన వర్గాల, పేదల భూములే పోతున్నాయని అన్నారు. ప్రభుత్వం, అధికారులు ప్రయివేటు వ్యక్తుల వెంచర్ల ను కాపాడేందుకు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. త్రిబుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చాలని, తప్పనిసరి పరిస్థితుల్లో భూములు తీసుకోవాల్సి వస్తే భూమికి బదులు భూమి కొనివ్వాలని, బహిరంగ మార్కెట్ ప్రకారం ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద త్రిబుల్ ఆర్ బాధితుల పక్షాన సీపీఐ(ఎం) చేపట్టనున్న ధర్నాకు రైతులు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్, జిల్లా కమిటీ సభ్యులు కృష్ణ, కొండాపూర్ మండల కార్యదర్శి రాజయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.