మాదక ద్రవ్యాల ముఠాలను అరికట్టే సాకుతో వామపక్ష పాలనలో ఉన్న వెనెజులాపై దాడులు చేసేందుకు అమెరికా సన్నాహాలు చేసింది. ఏ క్షణమైనా విరుచుకుపడవచ్చని వార్తలు వస్తున్నాయి. అధ్యక్షుడు మదురోను గద్దె దింపటం తమ లక్ష్యం కాదని చెబుతున్నప్పటికీ ఎవరూ నమ్మటం లేదు. అమెరికా దుర్మార్గాన్ని ప్రతిఘటించేందుకు సరిహద్దులో మదురో కూడా మిలిటరీని మోహరించినట్లు వార్తలు వచ్చాయి. వెనెజులా భూభాగంలో ఉన్న మాదకద్రవ్యాల మాఫియాలపై మిలిటరీ దాడులు చేస్తారా అన్న విలేకరి ప్రశ్నకు మీరే చూస్తారుగా అంటూ ట్రంప్ చెప్పటాన్ని బట్టి అమెరికా ఆంతర్యం స్పష్టంగా కనిపిస్తున్నది. కొద్ది రోజుల క్రితం కరీబియన్ సముద్రంలో ఒక పడవపై అమెరికా మిలిటరీ దాడి చేసి పదకొండు మందిని చంపివేసింది. వారికి మదురోకు సంబంధాలు ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నది. వెనెజులా నుంచి వచ్చిన ఆ మోటార్ బోట్‌లో మాదకద్రవ్యాలు ఉన్నట్లు స్వయంగా ట్రంప్ కథ చెప్పాడు. ఆ ముఠా అమెరికాలో హింసాత్మక చర్యలకు, మాదక ద్రవ్యాల వ్యాప్తి, సామూహిక హత్యలు, అమ్మాయిల అక్రమరవాణాకు పాల్పడుతున్నదని ఆరోపించాడు. ఆ తరువాత పోర్టారికోకు పది ఎఫ్ 35 రకం యుద్ధ విమానాలను అమెరికా తరలించింది. తప్పుడు సాకులతో అమెరికా దాడులకు పూనుకున్నదని మదురో శుక్రవారం చెప్పారు. మారణాయుధాలను గుట్టలుగా పోసినట్లు ప్రచారం చేసి ఇరాక్ మీద దాడులు చేసినట్లుగానే తమపై అమెరికా దుర్మార్గానికి పాల్పడేందుకు పూనుకున్నదన్నాడు. అనేక దేశాలతో పోల్చితే తమ దేశం ద్వారా రవాణా అవుతున్న మాదకద్రవ్యాలు స్పల్పమని చెప్పాడు. అమెరికన్లు వెనక్కు తిరిగి పోలేని చోటికి చేరుకుంటున్నారని హెచ్చరించారు. మదురోను అరెస్టు చేసేందుకు వీలు కలిగే సమాచారం ఇచ్చిన వారికి ఐదు కోట్ల డాలర్లు ఇస్తామని ఆగస్టు నెలలో అమెరికా ప్రకటించిన అంశం తెలిసిందే. 1998లో హ్యూగో ఛావెజ్ నాయకత్వంలో వామపక్షాలు అధికారానికి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలను కూలదోసేందుకు మితవాద నేతలకు అనేక రకాలుగా అమెరికా సాయం చేసినప్పటికీ ఓటర్లు తిరస్కరించారు. విధించిన ఆంక్షలు పనిచేయటం లేదు. ఇప్పుడు మాదకద్రవ్యాల పేరుతో మరోకుట్రకు తెరలేపారు.
కరీబియన్ అంతర్జాతీయ జలాల్లో ఉన్న పడవను ఆపేందుకు, ప్రాణాలతో దాన్లో ఉన్నవారిని పట్టుకొనేందుకు అమెరికా మిలిటరీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. నేరుగా కాల్పులు జరిపి చంపివేయటం ద్వారా తాను తలచుకొంటే ఏ దేశంపై అయినా యుద్ధాన్ని ప్రకటిస్తామని, ఎవరినైనా మట్టుబెడతామనే బెదిరింపు సందేశాన్ని ఆప్రాంత దేశాలకు పంపినట్లయింది. తమకు పూర్తి అధికారాలు, సత్తా ఉందని ఈ ఉదంతంపై విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించాడు. పడవపై దాడి ఉదంతానికి ఒక రోజు ముందు మదురో మాట్లాడుతూ అమెరికన్లు అవాస్తవాలు చెబుతున్నారని వారు వెనెజులా చమురు, గ్యాస్‌ను ఉచితంగా దోచుకొనేందుకు వస్తున్నారని అందుకోసం ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడతారని హెచ్చరించాడు. 1898లో స్పెయిన్‌తో యుద్దాలకు తప్పుడు ప్రచారం చేశారని, 1964లో వియత్నాంపై దాడికి టోంకిన్ గల్ఫ్ కల్పిత ఉదంతాన్ని, 2003 ఇరాక్‌పై మారణాయుధాల గుట్టల గురించి ప్రచారం చేశారని అన్నాడు. మోనికా లెవెన్సీతో తన అక్రమ సంబంధ ఉదంతం నుంచి అమెరికన్లను పక్కదారి పట్టించేందుకు నాటి అధ్యక్షుడు బిల్‌క్లింటన్ సూడాన్ మీద దాడి చేయించాడని ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ అలాంటి కుంభకోణంలో జెఫ్రి ఎప్‌స్టెయిన్ ఫైళ్లలో కూరుకుపోయాడని అన్నాడు.
తన ప్రత్యర్ధులైన ఇరాన్, లెబనాన్, హుతీ, హిజ్‌బుల్లా, హమస్ అగ్రనేతలను ఒక పథకం ప్రకారం మట్టుబెడుతున్న క్రమంలో ఇజ్రాయెల్ తాజాగా ఎమెన్ ప్రధాని, మంత్రులను హతమార్చటాన్ని చూశాము. ఈ దుర్మార్గాలన్నింటికీ అమెరికా, ఇతర పశ్చిమదేశాల సంపూర్ణ మద్దతు ఉంది. లాటిన్ అమెరికాలో వామపక్ష నేతలు అమెరికాకు కొరకరాని కొయ్యలుగా మారిన పూర్వరంగంలో వారిని హతమార్చేందుకు అమెరికా చూస్తున్నది, దాని లక్ష్యంగా మదురో ఉన్నాడని వేరే చెప్పనవసరం లేదు. అమెరికా గద్దెపై ఎవరున్నా అదే చేస్తున్నారు. రెండవసారి అధికారానికి వచ్చిన మరుసటి రోజే విదేశీ ఉగ్రవాద సంస్థలను మాదకద్రవ్యాల మాఫియాలుగా చిత్రిస్తూ ట్రంప్ ఉత్తరువులు జారీ చేశాడు. ఆ ముసుగులో వెనెజులా సమీపానికి మిలిటరీని దించుతున్నాడు. ఇతర దేశాల్లో జోక్యం చేసుకొనేందుకు మిలిటరీకి అధికారమిస్తూ రహస్య ఉత్తరువులు ఇచ్చినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక రాసింది. వెనెజులా చమురు కొనుగోలు చేయవద్దని, దాన్ని రవాణా చేయవద్దంటూ ఆంక్షలు విధించింది. ట్రంప్‌కు చిత్తశుద్ధి ఉంటే అమెరికాలో విచ్చలవిడిగా దొరుకున్న మాదకద్రవ్యాలు, వాటిని సరఫరా చేసే వారి మీద కేంద్రీకరించాలి. ఒక అంచనా ప్రకారం అమెరికాలో 200 నుంచి 750బిలియన్ డాలర్ల మేరకు మాదకద్రవ్యాల విక్రయాలు జరుగుతుంటే ప్రాణావసరమైన ఔషధాల లావాదేవీలు 600 బిలియన్ డాలర్లు, చమురు లావాదేవీల విలువ 400 బి.డాలర్లు మాత్రమే అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పవచ్చు. మరోమాటలో చెప్పాలంటే ప్రపంచంలో మాదక ద్రవ్యాలను అత్యధికంగా వినియోగిస్తున్న, వాటి తయారీకి అవసరమైన ఔషధ సంబంధిత రసాయనాలు, ఆయుధాలను ప్రపంచానికి ఎక్కువగా సరఫరా చేస్తున్నది అమెరికా అన్నది నమ్మలేని నిజం. ఈ అక్రమ లావాదేవీల్లో అమెరికాలోని బడా బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. అమెరికన్ పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఇదంతా సాగుతుందా? తన విధానాలు, కార్పొరేట్ల దోపిడీని ప్రశ్నించకుండా యువతను మత్తులో ముంచే ఎత్తుగడ కూడా దీని వెనుక ఉందన్నది స్పష్టం. ఐరాస 2025 ప్రపంచ మాదకద్రవ్యాల నివేదికలో వెనెజులా గురించి చేసిన ప్రస్తావన చాలా పరిమితంగా ఉంది. అక్కడ మాదక ద్రవ్యాల సాగు లేదా తయారీ దాదాపు లేదని పేర్కొన్నది.
కరీబియన్ ప్రాంతంలో అమెరికా మిలిటరీ మోహరింపు వెనుక బ్రెజిల్లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. చైనాలోని తియాన్‌జిన్‌లో జరిగిన చారిత్మ్రాక షాంఘై సహకారం సంస్థ 25వ సమావేశంలో షీ జింపింగ్, నరేంద్రమోడీ, పుతిన్ కలయిక అమెరికా విధాన నిర్ణేతలకు వణుకుపుట్టించింది. వెంటనే గుక్క తిప్పుకోలేకపోయిన ట్రంప్ నాలుగు రోజుల తరువాత భారత్‌ను చైనాకు కోల్పోయినట్లు ఉక్రోషంతో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ సమావేశం ముగిసిన వారం రోజుల్లోనే బ్రిక్స్ సమావేశాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోయాడు. వెనెజులా పేరుతో కరీబియన్ సముద్రంలో ఉద్రిక్తతలకు తెరతీశాడు. సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్సుద్వారా బ్రిక్స్ సదస్సును బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డిసిల్వా ప్రారంభించాడు. కరీబియన్ ప్రాంతంలో అమెరికా యుద్ద నావలు ఉద్రిక్తతకు కారణం అవుతున్నాయని చెప్పాడు. వెనెజులా మీద దాడికి సన్నాహాల్లో ఉన్నట్లు కనిపిస్తున్న దన్నాడు. డోనాల్డ్ ట్రంప్‌ను సంతుష్టీకరిం చేందుకు బ్రిక్స్ సమావేశానికి డుమ్మాకొట్టిన ప్రధాని నరేంద్రమోడీ విదేశాంగ మంత్రి జై శంకర్‌ను పంపారు.
చైనా అధ్యక్షుడు షీ జింపింగ్ మాట్లాడుతూ బ్రిక్స్ దేశాల మధ్య సహకారం మరింతగా పెరగాలని పిలుపునిచ్చాడు. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల తయారీ అక్రమరవాణా సమస్యలు ఉన్నాయి. ఒక దేశం మీదకు యుద్ధ సన్నాహాల మాదిరి కరీబియన్ సముద్రంలో అమెరికా యుద్ద నావలను దించింది. వాటిలో నాలుగున్నరవేల మంది మెరైన్లు, నావికులను మోసుకువెళ్లే నౌక, నియంత్రిత క్షిపణులను ప్రయోగించే మూడు డెస్ట్రాయర్లు ఇతర నౌకలు, మరోచోట పది యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇది వెనెజులాను బెదిరించేందుకు, దాడి చేసేందుకు అన్నది తెలిసిందే. ఇటీవలి కాలంలో ఎక్కడా అమెరికా ప్రత్యక్ష దాడుల్లో పాల్గొన్న ఉదంతాలులేవు. ఇతర దేశాలతో దాడులు చేయించటం, వాటికి ఆయుధాలు విక్రయించి లబ్దిపొందే విధానాన్ని అనుసరిస్తున్నది. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో మరోమారు విజయం సాధించిన నికొలస్ మదురో ప్రభుత్వాన్ని అమెరికా ఇంతవరకు గుర్తించలేదు. తాము బలపరిచిన ప్రతిపక్ష అభ్యర్థి గోన్‌జాలెజ్‌కు ఎక్కువ ఓట్లు వచ్చినట్లు అమెరికా చెప్పుకుంది. అమెరికా గనుక దాడులకు పాల్పడితే తాము ప్రతిఘటించేందుకు సిద్దంగా ఉన్నామని, మిలిటరీతో పాటు లక్షలాది మంది పౌరులను దించుతామని మదురో హెచ్చరించాడు. దాదాపు ఇరవై ఐదువేల మంది సైనికులను కొలంబియా సరిహద్దులకు, చమురు శుద్ది కర్మాగారాలు ఉన్న ప్రాంతాలకు, సముద్రతీరానికి తరలించటమే గాక దేశవ్యాపితంగా డ్రోన్లు ఎగురవేయటంపై ఆంక్షలు విధించాడు. తమ జలాల్లో నౌకా దళం పహారా కాస్తుందని రక్షణ మంత్రి ప్రకటించాడు. ప్రస్తుతం మిలిటరీలో లక్షా 23వేల మంది సైనికులు ఉన్నారు. వీరు గాక మరో రెండులక్షల ఇరవైవేల మంది ప్రజాసాయుధులు ఉన్నట్లు మదురో ప్రకటించాడు. దేశంలో అమెరికా వ్యతిరేక భావనలను ముందుకు తేవటంతో పాటు పరిసర దేశాల మద్దతు పొందేందుకు వెనెజులా నాయకత్వం పూనుకుంది. గతంలో మిత్రదేశంగా ఉన్న సమయంలో వెనెజులాకు అమెరికా నాలుగవ తరం ఎఫ్ 16 యుద్ద విమానాలను సరఫరా చేసింది. ఇప్పుడు వాటితోనే కరీబియన్ సముద్రంలో ఉన్న అమెరికా యుద్ధ నావల చుట్టూ చక్కర్లు కొట్టించారు. నియంతల పాలనా కాలంలో చమురు నిల్వలపై కన్ను, కమ్యూనిజాన్ని విస్తరించకుండా చూసేందుకు వెనెజులా ఆ ప్రాంతంలో ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో అమెరికా యుద్ధ విమానాలను అందచేసింది. అయితే అనూహ్యంగా ఛావెజ్ రంగంలోకి రావటంతో వెనెజులా బద్దశత్రువుగా మారింది. ఛావెజ్ అధికారానికి వచ్చిన తరువాత చైనా, రష్యాలతో మిలిటరీ సంబంధాలను పెట్టుకున్నాడు. ఒక దశలో తమపై విధించిన ఆంక్షలకు ప్రతిగా ఎఫ్16 విమానాలను ఇరాన్‌కు విక్రయిస్తామని ఛావెజ్ అమెరికన్లను హెచ్చరించాడు.2013 నుంచి నికోలస్ మదురో అధికారంలో కొనసాగుతూ చావెజ్ బాటను అనుసరిస్తున్నాడు. కరీబియన్ సముద్రంలో అమెరికా మోహరించిన నాలుగున్నరవేల మందితో వెనెజులాను స్వాధీనం చేసుకోవటం లేదా దాడి చేసే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. అమెరికా దాడులకు గురైన ఇతర దేశాలకు భిన్నంగా ప్రజాసాయుధులను కూడా వెనెజులా దింపే అవకాశం ఉంది. ఇరుగు పొరుగు లాటిన్ అమెరికా దేశాలలో ఎక్కువ భాగం అమెరికా చర్యను ఖండించాయి. అమెరికా ఆంక్షలను ఖాతరు చేయకుండా చైనా చమురు దిగుమతి చేసుకోవటమే గాక వెనెజులాలో చమురు వెలికితీసేందుకు కూడా ముందుకు వచ్చింది. చైనా నుంచి మిలిటరీ జెట్లను కొనుగోలు చేసేందుకు మదురో ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయినప్పటికీ అమెరికా మిలిటరీ శక్తితో పోలిస్తే వెనెజులా బలం ఒక లెక్కలోనిది కాదు. దాని బలం, బలగం మదురోకు మద్దతు ఇస్తున్న జనం, ఇరుగు పొరుగుదేశాల సంఘీభావమే !
ఎం కోటేశ్వరరావు
8331013288