Sunday, January 18, 2026
E-PAPER
Homeనెమలీకనిజమైన విద్య

నిజమైన విద్య

- Advertisement -

ఈ రోజు మా బడిలో చాలా హడావిడిగా ఉంది. ఎవరో పెద్ద అధికారి మా బడికి వస్తున్నారని తెలిసింది.
మా హెడ్‌ మాస్టర్‌ గారు ముందురోజే తరగతి గదులు, పాఠశాల ఆవరణ, ఆటస్థలం శుభ్రంగా ఉండాలని ఆదేశించారు. అలాగే పిల్లలందరూ పరిశుభ్రంగా రావాలని చెప్పారు. మా ఉపాధ్యాయులు పరీక్షల గురించి, క్రమశిక్షణ గురించి పదే పదే చెప్పారు.
అందరిలోనూ ఒక చిన్న భయం ఉంది. అలాగే, ఆయన్ని కలవాలని ఆసక్తి కూడా ఉంది.
సరిగ్గా ఉదయం పది గంటలైంది. అధికారి మా ప్రధానోపాధ్యాయుడితో కలిసి మా తరగతి గదిలోకి వచ్చారు.
ఆయన ముఖం చాలా గంభీరంగా ఉంది. ఆయన రాగానే మా టీచర్‌ సైగ చెయ్యడంతో మేమందరం లేచి ”నమస్కారం సార్‌” అని బిగ్గరగా అరిచాం.

ఆయన మా వైపు ఒకసారి చూసి, టీచర్‌ కూర్చునే కుర్చీలో కూర్చున్నారు. మా టీచర్‌ ఆయనకు ఏదో చెబుతుంటే, అధికారి చేయి ఎత్తి ఆపి, మమ్మల్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు.
”పిల్లలారా, మీకు ఒక సాధారణ ప్రశ్న. ప్రపంచంలో మొట్టమొదటి అంతరిక్షంలోకి వెళ్లిన వ్యక్తి ఎవరు?” అని ప్రశ్నించారు.
ప్రశ్న వినగానే మేము ఉత్సాహంగా చేతులు పైకెత్తాం. ఆయన మనోజ్‌ను చూపించి ”నువ్వు చెప్పు” అన్నారు.
వాడు లేచి ”సార్‌, నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌” అని అన్నాడు. అది విన్న అధికారి ”తప్పు” అని చెప్పారు.
వెంటనే నా పక్కన కూర్చున్న సతీష్‌ లేచి, ”సార్‌, యూరీ గగారిన్‌” అని గట్టిగా చెప్పాడు.
అధికారి నవ్వి ”నీకూ తెలియదా? అది కూడా తప్పు. పురాణాలలో ఆయన గురించి ఉంది” అంటూ పిల్లలందరి వైపు చూశాడు.

ఆ మాట వినగానే క్లాసులో సన్నని గుసగుసలు మొదలయ్యాయి. మా టీచర్‌ కూడా ఆశ్చర్యపోయి ”సార్‌…” అని ఏదో చెప్పబోయారు.
కానీ, అధికారి ”ఆపండి!” అనడంతో గది అంతా నిశ్శబ్దం గా మారిపోయింది. ఆ అధికారి ఏమి చెబుతారో అని అంతా ఉత్సుకతతో ఉన్నారు.
”మొట్టమొదటగా అంతరిక్షంలోకి వెళ్ళింది హనుమాన్‌.
ఈ జాతీయ అంతరిక్ష దినోత్సవం రోజు మీరు మన సంస్కృతిని, సంప్రదాయాలను తెలుసుకోవాలి” అని గంభీరంగా చెప్పారు.
పిల్లలంతా అయోమయంగా ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ టీచర్‌ వైపు దృష్టి నిలిపారు. టీచర్‌ ఏదో చెప్పబోయారు. కానీ, ఆ అధికారి టీచర్‌ ని వారించారు.

”ఈ పిల్లలకు సరైన జ్ఞానం అవసరం. నేను చెబుతా శ్రద్దగా వినండి. హనుమాన్‌ చిన్నప్పుడు సూర్యుడిని చూసి పండు అనుకున్నాడు. దాన్ని మింగడానికి ఆకాశంలోకి వెళ్ళాడు. ఆకాశం అంటే ఏంటి? అంతరిక్షమే కదా?
ఇప్పుడు చెప్పండి. యూరీ గగారిన్‌ కంటే ముందే అంతరిక్షంలోకి ఎవరు వెళ్లారు? అని ప్రశ్నించాడు.”
పిల్లలు ఎవరూ సమాధానం చెప్పలేదు.
”మన హనుమాన్‌ అంటే మనం ఆంజనేయుడు, హనుమంతుడు అని పిలుచుకునే హనుమాన్‌ మొదట అంతరిశంలోకి వెళ్లాడు. అవునా” అని గద్దించినట్లు అన్నాడు.
అధికారి మాటలకు సతీష్‌ ఆవేశంతో లేచి నిలబడ్డాడు. ”సార్‌, యూరీ గగారిన్‌ అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యక్తి. 1961 ఏప్రిల్‌ 12న అంతరిక్షం నుంచి భూమి ఎలా కనిపిస్తుందో చెప్పాడు. అది నిరూపించ గల శాస్త్రీయ నిజం.

కానీ, మీరు చెప్పిన హనుమాన్‌ పాత్ర పురాణాల్లో ఉంది. అది పురాణ కల్పన, నిజం కాదు” అని గబగబా స్పష్టంగా చెప్పాడు.
సతీష్‌ అలా ధైర్యంగా మాట్లాడటం అధికారికి చాలా కోపం తెప్పించింది. ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి.
”ఒరేరు! నేనెవరో తెలుసా? నాకే ఎదురు మాట్లాడతావా..? బయటకు పో..” అని ఆవేశంతో కోపంతో గట్టిగా అరిచారు.
సతీష్‌ తల వంచకుండా ”సర్‌, మీరు నిజం పక్కన పెట్టి పుక్కిటి పురాణాలు నిజమని నమ్మించడం సరికాదు. మీరు కోపం తెచ్చుకోకుండా చెప్పండి. హనుమాన్‌ అంతరిక్షంలోకి వెళ్లారని మీరు నిరూపించగలరా?” అని సూటిగా ప్రశ్నించాడు. మళ్ళీ తనే ”కానీ, యూరీ గగారిన్‌ 27 ఏళ్ళ వయసులో 108 నిమిషాలు భూమి చుట్టూ ప్రయాణించాడు. మానవుడు బరువు లేని వాతావరణంలో తినగలడని, తాగగలడని ధృవీకరించాడు. అతని అనుభవాలు, ఫొటోలు, వీడియోలు, ఆధారాలు అన్నీ ఉన్నాయి. అది చరిత్ర. మాకు మూఢనమ్మకాలు నేర్పించకండి సార్‌. మాకు రుజువులు లేని కట్టు కథలు వద్దు. చరిత్ర వేరు. పురాణాలు వేరు. పురాణాలు నమ్మకం మీద నడుస్తాయి. ఆ కథలకు భౌతిక ఆధారాలు ఉండవని మీకు తెలియనిది కాదు కదా సార్‌” అని అందరి వైపు చూస్తూ గట్టిగా అన్నాడు.

అధికారికి నోట మాట రాలేదు. ఆయన ముఖంపై ఆశ్చర్యం, కోపం కలిసిన భావాలు కనిపించాయి.
ఈలోగా మా టీచర్‌ సతీష్‌ భుజంపై చేయి వేసి, ”సతీష్‌, కూర్చో” అని సైగ చేశారు. కానీ సతీష్‌ వెనక్కి తగ్గలేదు.
సతీష్‌ చెప్పింది సరైన జవాబు అని నాకు తెలుసు. మా మిత్రులందరికీ తెలుసు. అయినా, అధికారి చెప్పింది తప్పు సతీష్‌ చెప్పిందే సరైనదని అనలేకపోయాం. పైగా ఎదురు మాట్లాడిన సతీష్‌ని పై అధికారి దండిస్తాడేమోనని భయపడ్డాను.

”సత్యం అనేది ఎప్పటికీ ఒక్కటే ఉంటుందనీ, వాస్తవానికి కల్పనకు మధ్య తేడాలను గుర్తించడం మాకు నేర్పిన మీరే…” అంటూ టీచర్‌ మొహం చూసి నిశ్శబ్దంగా కూర్చున్నాడు.
ఆరోజు ఆ అధికారి మా పదవ తరగతి గదిలో ఉండలేకపోయారు. ముఖం చిన్నబుచ్చుకుని వెళ్లిపోయారు. సాయంత్రం స్కూల్‌ అయిపోయిన తర్వాత, మా టీచర్లు అందరూ సతీష్‌ను పిలిచి అభినందించారు.
”నువ్వు చేసింది చాలా గొప్ప పని సతీష్‌. నిజం కోసం, నిజాన్ని చెప్పడానికి నువ్వు ధైర్యంగా నిలబడ్డావు. అదే నిజమైన విద్య” అని ఒక టీచర్‌ చెప్పారు.
ఆ రోజు నేను ఒక కొత్త పాఠం నేర్చుకున్నా. నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి.

శాంతి ప్రభోద

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -