Friday, September 12, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌ సన్నిహితుడి కాల్చివేత

ట్రంప్‌ సన్నిహితుడి కాల్చివేత

- Advertisement -

ఉటా (అమెరికా) : యువ రిపబ్లికన్‌ ఓటర్లను సమీకరించడంలో కీలక పాత్ర పోషించిన కన్సర్వేటివ్‌ కార్యకర్త, దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నిహితుడు చార్లీ కిర్క్‌ బుధవారం హత్యకు గురయ్యారు. ఉటా వ్యాలీ యూనివర్సిటీ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా ఆయనను కాల్చి చంపారు. ‘ఇది మన రాష్ట్రానికి చీకటి రోజు. దేశానికి విషాదకరమైన రోజు’ అని ఉటా గవర్నర్‌ స్పెన్సర్‌ కాక్స్‌ తెలిపారు. ఇది రాజకీయ హత్యేనని ఆయన చెప్పారు. అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో పాటు మాగా ఉద్యమ ప్రముఖులు కిర్క్‌ను ‘అమరవీరుడి’గా అభివర్ణించారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, న్యాయం, అమెరికా ప్రజల కోసం కిర్క్‌ పోరాడారని ట్రంప్‌ చెప్పారు. కాల్పులకు ముందు…యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన శిబిరం కింద నిలబడిన కిర్క్‌ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. గత పది సంవత్సరాల కాలంలో ఎంతమంది అమెరికన్‌ ట్రాన్స్‌జెండర్లు మాస్‌ షూటర్లుగా ఉన్నారో మీకు తెలుసా అని ఓ వ్యక్తి ప్రశ్నించగా చాలా మంది అని కిర్క్‌ బదులిచ్చారు. ఆ వ్యక్తి మరోసారి అదే ప్రశ్న వేయగా ‘ముఠా హింసను లెక్కించాలా వద్దా’ అని అడిగారు. కాల్పుల ఘటనలో కిర్క్‌ ఒక్కరే గాయపడ్డారని అధికారులు ధృవీకరించారు. సంఘటనకు సంబంధించి సామాజిక మాధ్యమాలలో కన్పిస్తున్న వీడియో ఫుటేజ్‌ ప్రకారం…కిర్క్‌ మెడపై కాల్పులు జరిగాయి.

ఆ సమయంలో ఆయన చేతిలో మైక్రోఫోన్‌ ఉంది. మెడ నుంచి రక్తం కారుతుండగా కిర్క్‌ వెనక్కి పడిపోయారు. ఆ వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించగా మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన వెంటనే యూనివర్సిటీని మూసివేశారు. క్యాంపస్‌లో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అమెరికా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అతి పెద్ద ఉతా వ్యాలీ యూనివర్సిటీలో సుమారు 47 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తొలుత వార్తలు వచ్చినప్పటికీ నిందితుడి ఆచూకీ ఇంకా తెలియలేదని అధికారులు చెప్పారు. ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశామని, ఆ తర్వాత విడిచిపెట్టామని ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ తెలిపారు. కాల్పులకు తెగబడింది ఒక వ్యక్తి మాత్రమేనని అధికారులు చెప్పారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి అక్కడికి సమీపంలోని ఓ భవనంలో దాక్కుని కార్క్‌పై కాల్పులు జరిపాడని యూనివర్సిటీ చెబుతోంది. అయితే దీనిని పోలీసులు ధృవీకరించలేదు. దుందడుగు అనుభవజ్ఞుడిగా ఉన్నాడని, కార్క్‌ మెడ పైన గురి పెట్టి కాల్చాడని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. కాల్పుల జరిగిన వెంటనే భయాందోళనలకు గురైన ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీయడం కన్పించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -