– ఈ ఏడాది 1.6 శాతమే
– టారిఫ్‌లతో జీడీపీ పతనమే..!
– ప్రపంచ పురోగతిపైనా ప్రభావం
– ఓఈసీడీ రిపోర్ట్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆర్థిక విధానాలు ఆ దేశ వృద్ధితో పాటు ప్రపంచ జీడీపీపైనా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) వెల్లడించింది. ట్రంప్ టారిఫ్‌లతో ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తోందని ఓ రిపోర్ట్‌లో తెలిపింది. 2025లో అమెరికా ఆర్థిక వ్యవస్థ పెరుగుదల 1.6 శాతానికే పరిమితం కానుందని అంచనా వేసింది. 2026లో మరింత తగ్గి 1.5 శాతంగా ఉండొచ్చని విశ్లేషించింది. ఇంతక్రితం మార్చిలోని 2.2 శాతం వృద్ధి అంచనాలతో పోల్చితే ఇది చాలా తక్కువ కావడం విశేషం. 2025, 2026లో ప్రపంచ వృద్ధి రేటు 2.9 శాతానికి మందగించొచ్చని తెలిపింది. ఇంతక్రితం ఈ అంచనా వరుసగా 3.1 శాతం, 3 శాతంగా ఉంది. ముఖ్యంగా అమెరికా, కెనడా, మెక్సికో లాంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థలు నెమ్మదించడం ద్వారా గ్లోబల్ వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడనుంది. ”ప్రపంచ దృక్పథం, భవిష్యతు మరింత సవాలుగా మారుతోంది. ప్రస్తుత హెచ్చు సుంకాల స్థాయిలు కొనసాగితే అవి వృద్ధి అవకాశాలను మరింత క్షీణింపజేస్తాయి. పెరుగుతున్న వాణిజ్య అడ్డంకులు, పడిపోతున్న వినిమయం, వ్యాపార విశ్వాసం, కఠినమైన ఆర్థిక పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత భారాన్ని మోపనున్నాయి.” అని ఓఈసీడీ పేర్కొంది. ఇటీవలి వారాల్లో అమెరికా వాణిజ్య విధానంలో మరింత గందరగోళం చోటు చేసుకుంది. ఉక్కు సుంకాలను 50 శాతం రెట్టింపు చేయాలని ట్రంప్ నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేసింది. ”యూఎస్ వాణిజ్య విధాన అనిశ్చితి తీవ్ర స్థాయికి చేరింది. దీంతో ప్రతీ దేశంపై ప్రభావం పడటంతో గ్లోబల్ వృద్ధి రేటు అంచనాలకు కోత పెట్టాం. ఇది బలహీనమైన పెట్టుబడి, వినియోగానికి దారితీసింది మొత్తం ఆర్థిక కార్యకలాపాల సూచికలు దెబ్బతిన్నాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరుగుతున్నాయి.” అని ఓఈసీడీ చీఫ్ ఎకనామిస్ట్ అల్వరో పెరియిరా పేర్కొన్నారు.
అమెరికా వృద్ధికి ట్రంప్ దెబ్బ
- Advertisement -
- Advertisement -