Thursday, October 30, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవెనిజులా లక్ష్యంగా… దక్షిణ అమెరికాకు విమాన వాహక యుద్ధ నౌక : ట్రంప్‌ నిర్ణయం

వెనిజులా లక్ష్యంగా… దక్షిణ అమెరికాకు విమాన వాహక యుద్ధ నౌక : ట్రంప్‌ నిర్ణయం

- Advertisement -

వాషింగ్టన్‌ : మాదక ద్రవ్యాలపై పోరాడే పేరుతో అత్యాధునిక విమాన వాహక యుద్ధ నౌకను దక్షిణ అమెరికాకు తరలించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయించారు. గాజాలో జరుగుతున్న తాజా దాడులు ఇజ్రాయిల్‌-హమాస్‌ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి విఘాతం కలిగిస్తున్న తరుణంలో ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ మధ్యధరా సముద్రంలో మోహరించిన విమాన వాహక నౌకను అమెరికా తాజాగా దక్షిణ అమెరికాకు తరలిస్తోంది. దీంతో మధ్యప్రాచ్యంలోనూ, యూరప్‌లోనూ సముద్ర జలాలలో అమెరికాకు ఒక్క విమాన వాహక నౌక కూడా లేకుండా పోతుంది. జూన్‌లో ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ దాడి జరిపినప్పుడు అమెరికా దానికి వత్తాసు పలికింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎర్ర సముద్రంలో యెమన్‌కు చెందిన హౌతీలపై జరిగిన అత్యంత తీవ్రమైన పోరాటాలలో ఆ దేశం భాగస్వామి అయింది. అలాంటి అమెరికా ఇప్పుడు అసాధారణ రీతిలో దక్షిణ అమెరికాలో వాహన నౌకను మోహరించాలని తీసుకున్న నిర్ణయానికి కారణమేమిటి?

యుద్ధ విమాన వాహక నౌకలో వేలాది మంది నావికులు, డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు ఉంటాయి. 2023 అక్టోబర్‌ 7న ఇజ్రాయిల్‌పై హమాస్‌ దాడి చేసిన తర్వాత మధ్యప్రాచ్యంలో అమెరికా ఐదు వాహక నౌకలను మోహరించింది. మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్నాయన్న ఆరోపణలతో అమెరికా సైన్యం ఇప్పటి వరకూ 13 నౌకలపై దాడులు చేసింది. అనేక మందిని బందీలను చేసింది. ఈ దాడుల్లో కొందరు ప్రాణాలు కోల్పోయారు కూడా. వెనెజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురోను గద్దె దించడానికే అమెరికా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని నిపుణులు అంటున్నారు. వెనెజులా సమీపంలో అమెరికా సైనికుల మోహరింపు పెరుగుతోంది. దక్షిణ అమెరికాలోని ఉత్తర తీరంలో ఉన్న దేశమే వెనెజులా. సముద్ర మార్గంలో మాదక ద్రవ్యాల రవాణా జరగకుండా అడ్డుకున్నామని, ఇప్పుడు భూతలంలో అవి ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటామని ట్రంప్‌ చెప్పారు. మాదక ద్రవ్యాల రవాణాలో మదురో ప్రభుత్వం భాగస్వామి అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఆరోపించారు. కాగా ట్రంప్‌ ప్రభుత్వం తనపై కయ్యానికి కాలు దువ్వుతోందని మదురో తెలిపారు.

వెనిజులాలో అస్థిరత సృష్టించి, హింసను ప్రేరేపించడానికే అమెరికా తన దళాలను ఆ దేశ సరిహద్దుకు తరలిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వెనెజులా సమీపంలో ఇప్పటికే అమెరికా సైనిక దళాలు మోహరించగా ఫోర్డ్‌ స్రైక్‌ గ్రూప్‌ కూడా వాటితో జత కలుస్తోంది. ఈ గ్రూపులో ఐదు క్షిపణి విధ్వంసక డిస్ట్రాయర్లు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -