కాంగో, కాంబోడియా-థాయిలాండ్ సరిహద్దులో తీవ్ర పోరాటం
వాషింగ్టన్ : ప్రపంచ దేశాలలో కొనసాగుతున్న ఘర్షణలను నివారించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుదిర్చిన శాంతి ఒప్పందాలకు విఘాతం కలుగుతోంది. సంప్రదింపులు జరపడంలో తనకున్న శక్తియుక్తులకు ఈ ఒప్పందాలు సాక్ష్యమంటూ ట్రంప్ ఇప్పటి వరకూ గొప్పలు చెప్పుకున్నారు. అయితే వాటిలో రెండు ఒప్పందాలు ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. అవి విఫలమయ్యే ప్రమాదం కన్పిస్తోంది. వాషింగ్టన్‌లో ట్రంప్ సమక్షంలో కాంగో, రువాండా దేశాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేసి వారం రోజులైనా కాలేదు. తూర్పు కాంగోలో పోరాటానికి ముగింపు పలికేందుకు ఈ ఒప్పందాన్ని ఉద్దేశించారు.
అలాగే ట్రంప్ చొరవతో సుమారు రెండు నెలల క్రితం సరిహద్దులో ఘర్షణను నివారించేందుకు మలేషియాలో కాంబోడియా, థాయిలాండ్ దేశాలు కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేశాయి. అయితే ఈ రెండు ఒప్పందాలు ఇప్పుడు అటకెక్కాయి. ఇరు ప్రాంతాలలోనూ ఘర్షణలు తీవ్రతరం అయ్యాయి. తాజా పరిణామాలపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హింసకు వెంటనే స్వస్తి చెప్పాలని ఆఫ్రికన్ గ్రేట్ లేక్స్ ప్రాంతంలోని దేశాలతో పాటు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కూడా ఆయా దేశాలకు సూచించారు. ఒప్పందాలలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని కోరారు. కాంబోడియా, థాయిలాండ్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని తాను మరోసారి ఆపుతానని ట్రంప్ చెప్పారు. ఆయా దేశాల నేతలతో ఫోన్‌లో మాట్లాడతానని తెలిపారు.



