Thursday, February 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమన ఖనిజాలపై ట్రంప్‌ కన్ను

మన ఖనిజాలపై ట్రంప్‌ కన్ను

- Advertisement -

భారత్‌లో యూఎస్‌ అన్వేషణకు ఓకే..జైశంకర్‌, రూబియో భేటీలో నిర్ణయం
భారత్‌..అమెరికా ట్రేడ్‌ డీల్‌పై హర్షం

వాషింగ్టన్‌ : ట్రంప్‌ బెదిరింపులకు ప్రధాని మోడీ మోకరిల్లారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు దేశంలో కీలక ఖనిజాల అన్వేషణకు అమెరికా, భారత్‌ అంగీకారం తెలిపాయి. వాణిజ్య ఒప్పందంపై ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అవగాహనకు రావడాన్ని భారత్‌, అమెరికా విదేశాంగ మంత్రులు జైశంకర్‌, మార్కో రూబియో స్వాగతించారు. అమెరికా నిర్వహిస్తున్న తొలి కీలక ఖనిజాల మంత్రుల సమావేశానికి ముందు వాషింగ్టన్‌డీసీలో రూబియోతో జైశంకర్‌ భేటీ అయ్యారు. అరుదైన ఖనిజాల అన్వేషణ, మైనింగ్‌పై సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు.

క్వాడ్‌ ద్వారా ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారాన్ని విస్తరించేందుకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. మార్కో రూబియోతో భేటీ అయ్యి చర్చలు జరిపినట్టు జైశంకర్‌ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ప్రాంతీయ, ప్రపంచ అంశాలతో పాటు వాణిజ్యం, ఇంధనం, అణు, రక్షణ, సాంకేతికత వంటి అంశాలపైనా చర్చలు జరిపినట్టు తెలిపారు. ఇరు దేశాల ఉమ్మడి ప్రయోజనాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి మరిన్ని సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

‘కీలక ఖనిజాల అన్వేషణపై సహకారం’
కొత్త ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, ఉమ్మడి ఇంధన భద్రత లక్ష్యాలను సాధించడానికి కట్టుబడి ఉండాలని జైశంకర్‌, రూబియోలు నిర్ణయించారని అమెరికా విదేశాంగశాఖ ప్రకటన విడుదల చేసింది. క్వాడ్‌ ద్వారా ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారాన్ని విస్తరించేందుకు నిబద్ధతతో ఉన్నారని పేర్కొంది. ప్రపంచ దేశాల సహకారంతో క్రిటికల్‌ మినరల్స్‌ సరఫరా గొలుసును వైవిధ్యపర్చేందుకు, మరింత బలోపేతం చేసేందుకు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నట్టు వివరించింది.

అమెరికా ట్రెజరీ కార్యదర్శితో జైశంకర్‌ భేటీ
అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశ ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌తో జైశంకర్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సరఫరా గొలుసులు, భద్రతతో పాటు పరస్పర ఆర్థిక, జాతీయ భద్రత అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ విషయాన్ని ఇరువురు నేతలు ఎక్స్‌ వేదికగా తెలిపారు. జైశంకర్‌ ప్రస్తుతం మూడు రోజుల అమెరికా పర్యటనలో ఉన్నారు.

విదేశాల్లోని రేర్‌ ఎర్త్‌ ఖనిజాలపై యూఎస్‌ దృష్టి
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ, రక్షణ రంగాలను శాసిస్తున్న రేర్‌ ఎర్త్‌ ఖనిజాల (ప్రత్యేక లోహ మూలకాలు) విషయంలో చైనాను ఎదుర్కోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఇందుకోసం వాషింగ్టన్‌లో భారత్‌ సహా దాదాపు 50 దేశాల ప్రతినిధులతో ఒక కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రిక్‌ వాహనాలు, అత్యాధునిక ఫైటర్‌ జెట్‌ల తయారీకి అవసరమైన ఈ ఖనిజాల సరఫరాలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడమే ఈ కూటమి ప్రధాన ఉద్దేశ్యం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రేర్‌ ఎర్త్‌ ఖనిజాల తవ్వకంలో 60 శాతం, ప్రాసెసింగ్‌లో 90 శాతం వాటా చైనాదే కావడం విశేషం. వీటితోనే అమెరికాతో చైనా ప్రధానంగా పోటీపడుతోంది. కాగా.. ట్రంప్‌ ఎన్ని ప్రయత్నాలు చేసిన రేర్‌ ఎర్త్‌ ఖనిజాల రంగంలో చైనాను ఢీ కొట్టలేరని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -