ఓపీటీ ప్రోగ్రామ్‌పై కీలక ప్రతిపాదన..
అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్‌కు తప్పని అవస్థలు
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ఎవరిపై దుందుడుకుగా వ్యవహరిస్తున్నారో..ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో ఎవరికీ తెలియడం లేదు. తాజాగా విదేశీ విద్యార్థుల రాకను కఠినతరం చేస్తున్నారు. సోషల్ వెట్టింగ్ అంటూ పలు విధానాలతో అమెరికా కలను గందరగోళంలో పడేస్తున్నారు. ఈ క్రమంలో యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హౌమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సరికొత్త ప్రతిపాదన చేసింది. ఆ నిబంధన వల్ల అంతర్జాతీయ విద్యార్థులకు ఉన్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్‌పై పరిమితులు విధించేలా లేక పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉంది. ఆ రూల్ ఫెడరల్ రెగ్యులేటరీ ఎజెండాలో లిస్ట్ అయింది. 2025 చివర్లో లేక 2026 ప్రారంభంలో దానిని అమలు చేయొచ్చని తెలుస్తోంది.
బీటెక్‌తోపాటు తత్సమాన విద్యార్హతల అండర్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ పూర్తి చేసి, ఎఫ్-1 వీసా పొందినవారు స్టెమ్ కోర్సుల్లో (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితశాస్త్రం) ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్తుంటారు. వీటిలో ఏదేనీ విభాగంలో పీజీ పూర్తి చేసిన తరువాత ఓపీటీకి దరఖాస్తు చేసుకోవాలి. ఓపీటీ వచ్చిన అనంతరం తొలి ఏడాది స్టెమ్‌కు సంబంధించిన సంస్థల్లోనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అనంతరం రెండేండ్లపాటు (స్టెమ్‌కు సంబంధించిన సంస్థల్లోనే) అక్కడ పనిచేసే అవకాశం లభిస్తుంది. ఈ సమయంలోనే పలువురు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చుకొని హెచ్-1 వీసా సైతం పొందుతున్నారు. ఓపీటీని భారత్‌తో సహా ఇతర దేశాల విద్యార్థులు దుర్వినియోగం చేస్తున్నారని అమెరికాలోని పలు సంస్థలు అభ్యంతరం తెలపటంతో సమస్య మొదలైంది. ఆ నేపథ్యంలో ఓపీటీ ప్రోగ్రామ్‌ను రద్దు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి.
ఒకవేళ.. ఓపీటీ రద్దు విధానం అమలైతే ఆ ప్రభావం విద్యార్థులపై తీవ్రంగా ఉంటుంది. మన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే అవకాశం తగ్గిపోతుంది. విద్యార్థులతోపాటు అక్కడ యూనివర్సిటీలు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇదిలా ఉండగా.. ట్రంప్ యంత్రాంగం ఇలాంటి ప్రతిపాదనలు చేస్తుంటే.. ఇటీవల ఆయన వ్యాఖ్యలు మాత్రం మరోలా ఉన్నాయి. విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని అన్నారు. వారు రావడం అమెరికాలోని వ్యాపారాలకు మంచిదేనని వ్యాఖ్యానించారు. దీనివల్ల దేశ ఉన్నత విద్యావ్యవస్థకు మద్దతుగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తూనే కీలక ప్రతిపాదనలను తెరపైకి తేవటంతో భారత విద్యార్థుల్లో అయోమయం, గందరగోళ పరిస్థితులకు దారితీస్తోందని పేర్కొంటున్నారు.
విదేశీ విద్యార్థులపై ట్రంప్ మరిన్ని ఆంక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



