విమానాశ్రయాలకు తన పేరు ఉండాలని తపన
ట్రేడ్‌మార్క్ హక్కుల కోసం కుటుంబం దరఖాస్తు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌లో ‘కీర్తికండూతి’ ఎక్కువగా కన్పిస్తోంది. తాను ఎనిమిది ప్రపంచ యుద్ధాలను ఆపానని, తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆయన ఇప్పటికే అనేక సందర్భాలలో తన మనసులో మాటను బయటపెట్టారు. తనను తాను శాంతి దూతగా చెప్పుకున్నారు. కానీ నోబెల్ కమిటీ ఆయన అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సుంకాల పేరు చెప్పి అనేక దేశాల మెడలు వంచి వాటితో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నానని, ఆ ఒప్పందాల ద్వారా అమెరికాను ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తున్నానని బహిరంగంగానే చెబుతుంటారు. ఇలా తన పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోవాలని ఆయన కోరుకుంటున్నారు. చివరికి ఇప్పుడు దేశంలోని విమానాశ్రయాలకు కూడా తన పేరు పెట్టాలని తపన పడుతున్నారు.
దేశంలోని విమానాశ్రయాలు, వాటికి సంబంధించిన డజను సేవలు, ఉత్పత్తులకు ప్రస్తుత అధ్యక్షుడి పేరును ఉపయో గించుకునేందుకు ప్రత్యేక హక్కులు కల్పించాలంటూ ట్రంప్ కుటుంబ కంపెనీ అమెరికా పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ కార్యాలయంలో ఓ దరఖాస్తును సమర్పించింది. డోనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్ యాజమాన్యంలోని ట్రంప్ ఆర్గనైజేషన్ ఈ దరఖాస్తును అందజేసింది. ఇది డబ్బు కోసం చేస్తున్న అభ్యర్థన కాదని, ‘బాడ్ యాక్టర్స్’ (తరచుగా హానికరమైన, అనైతిక లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొనే వ్యక్తులు)కు వ్యతిరేకంగా కుటుంబానికి ఉన్న పేరును కాపాడుకోవడానికే ఈ దరఖాస్తు చేస్తున్నామని చెప్పుకుంది. ట్రంప్ పేరును తరచుగా దుర్వినియోగం చేస్తున్నారని, ఆ పేరు ప్రపంచంలో అత్యధికంగా ఉల్లంఘనకు గురవుతున్న ట్రేడ్‌మార్క్ అని అమెరికా పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ కార్యాలయంలో ట్రంప్ ఆర్గనైజేషన్ సమర్పించిన పత్రాలలో తెలియజేశారు.
విమానాశ్రయాలు, వాటికి సంబంధించిన సర్వీసులు, వస్తువులు అంటే…ప్యాసింజర్ షటిల్ బస్సుల నుంచి ట్రావెల్ బ్యాగులు, గొడుగులు, విమాన సూట్ల వరకూ ట్రంప్ పేరును మూడు విధాలుగా…ప్రెసిడెంట్ డోనాల్ జే.ట్రంప్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, డోనాల్డ్ జే.ట్రంప్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, డీజేటీ… ఉపయోగించుకునేందుకు కుటుంబానికి చెందిన డీటీటీఎం ఆపరేషన్స్ విభాగం ప్రత్యేక హక్కులను కోరింది. ట్రంప్ పేరును ఉపయోగించుకునే ఏ విమానాశ్రయం నుంచి ఆదాయాన్ని పొందే ఉద్దేశం తమకు లేదని కుటుంబం తెలిపింది. ఫ్లోరిడాలోని విమానాశ్రయానికి పామ్‌బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టాలన్న ప్రతిపాదన కూడా ఉంది. ఇది ట్రంప్‌కు చెందిన మార్- ఏ-లాగో ఎస్టేట్ సమీపంలో ఉంది. విమానాశ్రయం పేరును మార్చినందుకు అధ్యక్షుడు కానీ, ఆయన కుటుబం కానీ ఎలాంటి రాయల్టీ, లైసెన్సింగ్ రుసుము లేదా ఆర్థిక ప్రయోజనం కోరబోదని కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది.
అబ్బే…నా ప్రమేయం లేదు
న్యూయార్క్‌లోని పెన్ స్టేషన్, వాషింగ్టన్ డల్లెస్ అంత ర్జాతీయ విమానాశ్రయానికి తన పేరు పెట్టాలని ట్రంప్ కోరుకుంటున్నారని, అందుకే ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తు చేయించారని వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ కోసం 16 బిలియన్ డాలర్లను విడుదల చేసినందుకు ప్రతిగా ట్రంప్ ఆ రెండింటి పేర్లను మార్చాలని ప్రతిపాదిం చారని గుసగు సలు వినిపించాయి. ఈ వార్తలపై ట్రంప్ స్పందిస్తూ పేరు మార్చే ప్రతిపాదనను తాను ముందుకు తీసుకురాలేదని చెప్పారు. కొందరు రాజకీయ నాయకులు, నిర్మాణ సంఘా ల నేతల నుంచి ఆ ప్రతిపాదన వచ్చిందని ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో వివరణ ఇచ్చారు.
అమెరికా సంప్రదాయం ప్రకారం…
అమెరికాలో ఓ సంప్రదాయం ఉంది. అమెరికా అధ్యక్షులు పదవీ విరమణ చేసిన తర్వాత లేదా చనిపోయిన తర్వాత విమానాశ్రయాలు, ముఖ్యమైన ప్రదేశాలకు వారి గౌరవార్థం పేర్లు పెడుతుంటారు. ఉదాహరణకు బిల్ క్లింటన్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన తర్వాత 11 సంవత్సరాలకు ఆయన పేరును విమానాశ్రయానికి పెట్టారు. అలాగే రోనాల్ట్ రీగన్ పేరు పెట్టడానికి తొమ్మిది సంవత్సరాలు, గెరాల్డ్ ఫోర్డ్ పేరు పెట్టడానికి 22 సంవత్సరాలు పట్టింది. జాన్ ఎఫ్.కెన్నడీ హత్యానంతరం నెల రోజులకే ఆయన పేరు పెట్టారు. ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ ట్రేడ్‌మార్క్ ప్రచారం ట్రంప్ బ్రాండింగ్ విస్తరణలో ఓ భాగం. గత సంవత్సర కాలంగా ట్రంప్ కుటుంబం దుబాయ్, భారత్, సౌదీ అరేబియా, వియత్నాంలలో వ్యాపారాభివృద్ధి కోసం ట్రంప్ పేరుతో లైసెన్స్ ఇచ్చింది. ఎలక్ట్రిక్ గిటార్లు, బైబిల్ పుస్తకాలు, స్నీకర్ల (కాలి బూట్లు) తో సహా బ్రాండెడ్ ఉత్పత్తులు ప్రారంభించింది.



